Share News

తల్లి ఒడికి చేరిన చిన్నారి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:39 AM

ప్రభుత్వ రైల్వే పోలీసుల(జీఆర్పీ) ప్రత్యేక చొరవతో తల్లి నుంచి దూరమైన చిన్నారిని నెలన్నరలో తిరిగి ఆమె ఒడికి చేర్చారు. జీఆర్పీ సీఐ విజయ్‌ శంకర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గతేడాది నవంబరు 18న రాజమండ్రి రైల్వే స్టేషనులోని ఏడాదిన్నర పసిపాప ఒంటరిగా ఏడుస్తోందంటూ డ్యూటీలో ఉన్న ఆర్పీహెచ్‌సీ ఎస్‌వీవీ సత్యనారాయణకు చెప్పారు.

తల్లి ఒడికి చేరిన చిన్నారి

రాజమహేంద్రవరం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రైల్వే పోలీసుల(జీఆర్పీ) ప్రత్యేక చొరవతో తల్లి నుంచి దూరమైన చిన్నారిని నెలన్నరలో తిరిగి ఆమె ఒడికి చేర్చారు. జీఆర్పీ సీఐ విజయ్‌ శంకర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గతేడాది నవంబరు 18న రాజమండ్రి రైల్వే స్టేషనులోని ఏడాదిన్నర పసిపాప ఒంటరిగా ఏడుస్తోందంటూ డ్యూటీలో ఉన్న ఆర్పీహెచ్‌సీ ఎస్‌వీవీ సత్యనారాయణకు చెప్పారు. ఆయన ఏఆర్‌ఎస్‌ఐ ఎస్‌.సత్యనారాయణతో హుటాహుటిన వెళ్లి పాపను సంరక్షించి వివరాల కోసం వాకబు చేయగా ఫలితం లేకపోయింది. దీంతో కేసు నమోదు చేసి.. చైల్డ్‌ వెల్ఫేర్‌ వాళ్లకు సమాచారమివ్వగా వాళ్లు పాపను తీసుకెళ్లారు. సీఐ విజయ్‌ శంకర్‌ పర్యవేక్షణలో ఆర్పీ ఎస్‌ఐ పి.లోవరాజు, ఆర్‌పీ ఎస్‌ఐ కె.మావుళ్లు కేసు దర్యాప్తు చేపట్టారు. మీడియా, సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారాన్ని కల్పించారు. ఇన్‌స్టాగ్రాంలో చూసిన పాప బంధువు ఒకరు కాట్రేనికోన మండలం కొత్తపాలెంకి చెందిన పాప తల్లి ఓలేటి కావేరికి విషయాన్ని చేరవేశారు. దీంతో ఆమె జీఆర్పీ పోలీసులను గురువారం ఆశ్రయించగా పాపను అప్పగించారు. ఆ రోజున తల్లి ఇంటికి బయలుదేరి పాప తినడానికి ఏదైనా తీసుకురావడానికి స్టేషను బయటకు వెళ్లగా మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆమె కళ్లు తిరిగి పడిపోయిందని.. తర్వాత వచ్చి చూడగా పాప కనబడకపోవడంతో అప్పటి నుంచీ వాళ్లు వెతుకుతున్నారని సీఐ చెప్పారు. కేసులో ప్రతిభ చూపిన సీఐ విజయ్‌ శంకర్‌, ఎస్‌ఐలు మావుళ్లు, లోవరాజు ఇతర సిబ్బందికి రైల్వే పోలీసు ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌, రైల్వే డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు ప్రశంసించారు.

Updated Date - Jan 12 , 2024 | 12:39 AM