చిక్కని..చిరుత
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:40 AM
చిరుత పులి భయపెడుతోంది.. నాలుగు రోజులైనా చిరుత చిక్కకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎటు నుంచి ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.
నాలుగురోజులైనా కానరాని పురోగతి
ఆదివారం అర్ధరాత్రి కెమెరాలో నిక్షిప్తం
రంగంలోకి 9 అటవీ బృందాలు
ఫేక్ మెసేజ్‌లపై ఆందోళన
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
చిరుత పులి భయపెడుతోంది.. నాలుగు రోజులైనా చిరుత చిక్కకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎటు నుంచి ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. రాజమహేంద్రవరం నగరానికి చేరువగా ఉన్న రిజర్వు ఫారెస్టులో చిరుత పులి నక్కినట్టు అధికారులే చెబుతున్నారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట పెనుశాపంగా పరిణమించింది. జనవాసాల మధ్యనే ఈ ఫారెస్ట్ ఉంది. మరో వైపు హైవేను ఆనుకుని ఉంది. దీంతో నిరంతరం జన సంచారం ఉంటుంది. మరో వైపు పులి నక్కిన ప్రాంతంలోనే రోడ్డు పక్కన వ్యాపారాలు చేస్తున్నా.. హోటళ్లు తెరిచినా ఎటువంటి రక్షణ చర్యలు లేవు. కనీస హెచ్చరిక బోర్డులు లేవు. ఎప్పుడూ చిరుత పులిని పట్దేద్దామనే ఆలోచనే తప్ప.. ప్రజల రక్షణ మరిచారు. చిరుతపులి ధైర్యంగా ఇక్కడే తిరుగుతుంది.పైగా ఫారెస్ట్ అకా డమీ ఆఫీసుల సమీప ప్రాంతాల్లోనే తిరుగుతుంది. శుక్రవారం రాత్రి టీవీ రిలేకేంద్రం ప్రధాన గేటుకు అమర్చిన సీసీ కెమెరాకు చిక్కిన చిరుత ఆదివారం అర్ధరాత్రి 12.29 గంటలకు ఫారెస్ట్ అకాడమీ సమీపంలో అడవిలో అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాకు చిక్కింది.ఇక్కడ ఒకటి గమనించాలి. రాత్రి సమయంలో ఇది రోడ్లపై, మంచి దారుల్లోనే నడుస్తోంది. శుక్రవారం రాత్రి టీవీ రిలే కేంద్రం వద్ద రోడ్డు మీద నడుస్తూ కనిపించింది. ఆదివారం రాత్రి అడవిలో ఓ బాటలో నడుస్తూ ఉంది. ఆదివారం దాని పాదముద్రలు గుర్తించారు. చిరుతను త్వరగా పట్టుకోవ డానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా అమర్చిన నాలుగు బోన్లు అలాగే ఉంచుతూ..దాని కదలికలను బట్టి ట్రాప్ కెమేరాలు మారుస్తున్నారు.త్వరగా దీనిని పట్టుకుంటామనే ధీమాతో అధి కారులు ఉన్నారు.సుమారు 50 మంది సిబ్బంది వివిధ విభా గాలు డ్యూటీ చేస్తున్నారు. ట్రాఫ్ కెమెరాలు కొందరు పర్యవే క్షిస్తుంటే, మరో టీమ్ పాదముద్రలు పరిశీలిస్తుంది. మరొకరు ప్రజలకు అవగాహన కల్పించడం,మరో టీమ్ గస్తీ తిరడం వంటి పనులు చేస్తున్నారు.ప్రస్తుతం ఇన్‌చార్జి డీఎఫ్‌వో భరణితో పాటు ఏలూరు అధికారి ఇక్కడ పరిశీలిస్తున్నారు. సీతాఫలాల సీజన్ కా వడంతో ఉదయాన్నే పొలాల్లోకి వెళ్లి రైతులు కాయలు కోస్తుం టారు.చిరుత సంచారం వల్ల పొలాలకు వెళ్లడానికి రైతులు భయ పడుతున్నారు.వెంటనే చిరుతపులిని బంధించాలని కోరుతున్నారు.
కలకలం రేపిన దూడ కళేబరం
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాజమ హేంద్రవరం శివారు రిజర్వు ఫారెస్టులో చిరుత సంచారం మూడు రోజుల నుంచీ కలకలం రేపుతోంది. నేటికీ చిరుతను పసిగట్టలేకపోవడంతో పరీవాహక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావడానికే భయపడుతున్నారు.వివిధ పనులపై నగరానికి వచ్చి న వాళ్లు సాయంత్రం ఇళ్లకు త్వరగా చేరుకోవాలని, గుంపు లుగా వెళ్లాలని ఇప్పటికే అధికారులు సూచించారు. రాజాన గరం పోలీస్ స్టేషను పరిధి రఘునాథపురం గ్రామ సమీ పంలో అటవీ ప్రాంతానికి దగ్గరలో పొలాల్లో సోమవారం ఒక దూడ కళేబరాన్ని గుర్తించడం మరింత కలకలం రేపింది.ఆ కళేబరాన్ని అటవీ అధికారులు పరిశీలించారు.చిరుత దాడి చేసి న ఆనవాళ్లు కనిపించడం లేదన్నారు. కుక్కలు, నక్కలు దాడి చేసినట్టు అంచనా వేస్తున్నారు.
భయపడవద్దు : ఎమ్మెల్యే వాసు
రాజమహేంద్రవరం సిటీ/దివాన్‌చెరువు,సెప్టెంబరు 9 : చిరు త సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయవద్దని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షించారు. అనంతరం దివాన్‌చెరువు సమీపంలోని రాష్ట్ర అటవీ అకాడమీని సందర్శించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత మూడు రోజుల కిందట రిజర్వు పారెస్ట్‌కు చిరుత రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు.అటవీ శాఖ అఽధికారులు 50 మంది సిబ్బందితో 9 బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పగలు నిరంతరం గస్తీ కాస్తున్నారన్నారు.అటవీ శాఖ విడుదల చేసిన వీడియోలు చూసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు.బోన్లు ఏర్పాటు చేశారని, చిరుత పట్టుకునే విషయంలో నమ్మకంగా ఉన్నారన్నారు.త్వరలో పట్టుకుంటారన్నారు.. ఫేక్ మెసే జ్‌లను చూసి ఎవరు భయపడవద్దన్నారు. ప్లేన్ స్క్వాడ్ డీఎఫ్‌వో ఏ.త్రిమూర్తులరెడ్డి, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వో హెచ్.హిమ శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఆరు దాటితే బయటకు రావొద్దు..
దివాన్‌చెరువు పంచాయతీ పరిధిలోని స్వరూపనగర్, శ్రీరాంపురం, రూపనగర్, రఘునాఽథపురం గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దివాన్‌చెరువు పంచాయతీ కార్యదర్శి సుంకర వెంకట రమేష్ సోమవారం విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ప్రజలు బయట తిరగ వద్దన్నారు. చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని కోరారు. పొలాల్లో రైతులు నిద్రించవద్దని సూచించారు.
రిజర్వు ఫారెస్టులోనే చిరుత పులి
జిల్లా ఇన్‌ఛార్జి అటవీ అధికారి భరణి
దివాన్‌చెరువు,సెప్టెంబరు 9 : రిజర్వు ఫారెస్టులోనే చిరుత ఉందని.ట్రాప్‌బోనులో పడలేదని జిల్లా ఇన్‌ఛార్జి అటవీశాఖ అధికారి ఎస్.భరణి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాప్ కెమెరాలు తనిఖీ, పాద ముద్రల గుర్తించుటకు రెండు బృందాలు తిరుగుతున్నాయని అన్నారు. అటవీ ప్రాంతంలోనే చిరుతపులి సంచరిస్తుందన్నారు. నామవరం సి బ్లాక్ 11వ వీధిలో గత అర్ధరాత్రి నుంచి చిరుతపులి కనిపించినదని కొందరు ఆకతాయిలు ఫేక్ వీడియో తయారుచేశారన్నారు. అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయవద్దని కోరారు.
వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు : ఎస్పీ
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): చిరుత పులి సంచారంపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఎస్పీ నర సింహ కిశోర్ పేర్కొన్నారు. వదంతులు వ్యాప్తి చేస్తే కేసులు చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘చిరుతను బంధించడానికి ఫారెస్టు అధికారులు ఇప్పటికే రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. పోలీసు శాఖ నుంచి కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చే శాం. రాత్రి వేళల్లో బీట్లు పెంచాం. గ్రామాల్లో అవగాహన కలి గిస్తున్నాం. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా వదంతులను వ్యాప్తి చేస్తే కేసులు తప్పవు. ఏదైనా సమా చారం ఉంటే డయల్ 112కి కాల్ చేయడం బాధ్యతగా భావి ంచాలి.నామవరంలో చిరుత పులి కనిపించిందని కొందరు ఆకతాయిలు వదంతులను వ్యాప్తి చేయ డంపై చర్యలు తీసుకోవడం జరిగింది’ అని ఎస్పీ చెప్పారు.
ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయండి సారూ..
దివాన్‌చెరువు, సెప్టెంబరు 9 : చిరుతపులి సంచారం నేపథ్యంలో జాతీయరహదారిపై లాలాచెరువు వద్ద నుంచి పుష్కరవనం వరకూ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరు తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు కొందరు రాత్రివేళల్లో సైతం తమ అవసరాలను తీర్చుకునేందుకు ఈ ప్రాంతంలో కొద్ది సేపు ఆగి తిరిగి ముందుకుసాగుతారు. అయితే ఈప్రాంతంలోనే చిరుతపులి సంచరిస్తోందన్న వార్తల నేపఽథ్యంలో ఆప్రాంతమంతా కాంతులు వెద జల్లేవిధంగా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలి.అలాగే రాత్రివేళల్లో వాహనాలు నిలుపుదల చేయకుండా వాహనదారులు, లారీ ఆపరేటర్లకు అవగాహన కల్పించేందుకు అటవీశాఖ, పోలీసు శాఖలు చర్యలు చేపట్టాలి.ఈ మేరకు ఆయా ప్రాంతాలకు కొంత దూరంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం వందలాది మంది జీవనోపాధి పొందుతున్న ఆటోనగర్ ప్రహరీగోడలపై చిరుత సంచరించిందన్న వార్తలు నేపఽథ్యంలో ఆ ప్రాంతం వారు భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచారం నేపఽథ్యంలో సాయంత్రం ఆరు గంటలకే షాపులు మూసివేసి వెళ్లడమా లేక కొద్దిరోజులు షాపులు పూర్తిగా మూసివేయడమా అన్న ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.