Share News

సెల్‌కలం!

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:51 AM

మనిషి ఉదయం లేచిన నాటి నుంచి రాత్రి నిద్రించే వరకు ఉన్న సమయంలో సెల్‌ ఫోనుదే ప్రథమస్థానం. మంచం పైనుంచి లేవగానే ఫోన్‌.. కాలకృత్యాలు తీర్చుకుంటూ ఫోన్‌.. బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తూ ఫోన్‌..

 సెల్‌కలం!

టచ్‌ చేస్తే బోలెడు వినోదం

ఎడిక్ట్‌ అవుతున్న పిల్లలు..పెద్దలు

సెల్‌ని వదల్లేకపోతున్న వైనం

దంపతుల మధ్య దూరం

అటకెక్కుతున్న చదువులు

ఫోన్లకు బాల్యం బందీ

మందగిస్తున్న కంటిచూపు

పక్కదారి పడుతున్న విజ్ఞానం

(ఆంధ్రజ్యోతి- రాజమహేంద్రవరం సిటీ)

పాప ఏడుస్తోంది.. ఉడ్‌వర్డ్స్‌ పట్టవే.. ఇదీ చాలా సుపరిచితమైన యాడ్‌.. ఇది ఒకప్పటి మాట.. మరిప్పుడు పాప ఏడుస్తోంది అంటే సెల్‌ఫోన్‌ ఇవ్వు ఊరుకుంటుందే అనే రోజులు వచ్చేశాయి.. పిల్లలు ఏడాది నుంచే సెల్‌ఫోన్‌కు ఎడిక్ట్‌ అయిపోతున్నారు.. అదే మంచిదనుకుని.. చిన్నారులకు సెల్‌ఫోన్‌ ఇచ్చేసి తమ పని తాము చేసుకుంటు న్నారు.. సెల్‌ ఎందుకిచ్చావే అంటే ఫోన్‌ ఇస్తేనే కానీ ఊరుకోవడంలేదనేది పెద్దల మాట.

ఒక పిల్లాడు తీక్షణగా సెల్‌ఫోన్‌ చూస్తున్నాడు.. సెల్‌ ఫోన్‌ పక్కన పెట్టేసి చదువుకోమని తల్లి చెబుతూనే ఉంది.. అయినా వినకపోవడంతో సెల్‌ఫోన్‌ లాక్కుని పుస్తకం చేతిలో పెట్టి చదువుకోమని చెబుతోంది. అనంతరం ఆమె టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటుంది.. అప్పటికే సెల్‌ఫోన్‌ లాక్కుందని కోపంతో ఉన్న కుమారుడు.. పక్కనే ఉన్న క్రికెట్‌ బ్యాట్‌ తీసుకుని తల్లి తలపై మోదుతాడు.. ఇదీ ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. సెల్‌ఫోన్‌కు ఎడిక్ట్‌ అయితే ఎంత ప్రమాదమో చాటి చెప్పింది..

ఒక పెద్దావిడ సెల్‌ఫోన్‌ చూస్తూ ఇంట్లో వంట చేస్తోంది.. ఫోన్‌లో పడి వంట సంగతి మర్చిపోయింది.. కాసేపటికి కిచెన్‌ నుంచి పొగలు వస్తున్నాయి.. అయినా ఆమెకు వాసన తగల్లేదు.. ఇంతలో అదృష్టం కొద్దీ ఆమె భర్త ఇంటికి వచ్చాడు.. ఇంట్లో నుంచి వచ్చే పొగను చూసి కంగుతిన్నాడు.. వెంటనే ఏమేవ్‌ ఏం చేస్తున్నావ్‌.. ఇల్లు తగల బడిపోతుందే అంటూ పెద్దగా కేకలు వేశాడు.. తేరుకున్న ఆమె కిచెన్‌లోకి వెళ్లి చూసేసరికి వండిన కూర కాస్తా మాడిమసైపోయింది.. కాసేపు ఆగితే మంటలు చెలరేగి పెద్ద ప్రమాదమే జరిగేది.

ఆసుపత్రిలో ఉన్నా.. తల్లిదండ్రులతో షాపింగ్‌లో ఉన్నా.. బైక్‌పై వెళుతున్నా.. కారులో వెళుతున్నా.. ఇంట్లో ఉన్నా.. ప్రస్తుతం చిన్నారుల చేతిలో కనిపించేది ఒక్కటే.. అదే సెల్‌ఫోన్‌.. బడిలో తప్పించి ప్రతి చోటా చిన్నారుల ప్రపంచం సెల్‌ బందీగా మారిపోయింది.. అది లేనిదే అన్న ముట్టరు.. అది చూడనిదే స్నాక్స్‌ తినరు.. అందుకే నేటితరం చిన్నారుల్లో నూటికి 60 శాతం చిన్నారులు నాలుగు కళ్లతో దర్శనమిస్తున్నారు..

చందమామారావే.. జాబిల్లి రావే.. కొండెక్కిరావే.. గోగిపూలుతేవే.. అంటూ చందమామను చూపిస్తూ తల్లులు వారి చంటిబిడ్డలకు గోరుముద్దలు తినిపించే రోజులు పోయాయి. ప్రస్తుత ఆధునికయుగంలో యాపిల్‌ రావే.. ఐఫోనురావే.. మా పిల్లవాడితో ఆడుకోవే.. గేమ్‌లతో రావే.. మా చంటిబిడ్డను అలరించవే అంటూ ప్రసుత్త యు గం తల్లిదండ్రులు చేస్తున్న చిన్నపాటి పొరపాటు భవిష్యత్తులో అది తీవ్రరూపం దాల్చి బాల్యం మంతా సెల్‌కు బానిసలుగా మార్చేసింది. తిండిలేకపోయినా ఉంటున్నారు కానీ పది నిమిషాలు సెల్‌ ఆగిపోతే ప్రాణం పోయినట్టు నేటి సమా జం తయారైంది. నేటి తరంలో ఏడాది చంటి బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు సెల్‌ బారిన పడనివారులేరంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ రాకుండా ఉండడంకోసం, ప్రపంచ జ్ఞానం కోసం రూపొందించిన అంతర్జాల చరవాణి ఇప్పు డు కొత్తపుంతలు తొక్కి మనిషి ఆరోగ్యానికి హానికరంగా మారిపోయింది. ఇందులో మంచిని గ్రహించి పరిమిత వినియోగం చేసేవారికంటే చెడును గ్రహించే వారే ఎక్కువయ్యారు. ము ఖ్యంగా పిల్లలపై పెనుప్రభావానే చూపిస్తుంది.

తెల్లారింది మొదలు..

మనిషి ఉదయం లేచిన నాటి నుంచి రాత్రి నిద్రించే వరకు ఉన్న సమయంలో సెల్‌ ఫోనుదే ప్రథమస్థానం. మంచం పైనుంచి లేవగానే ఫోన్‌.. కాలకృత్యాలు తీర్చుకుంటూ ఫోన్‌.. బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తూ ఫోన్‌.. ఇలా చెప్పుకుంటూపోతే ఫోన్‌తోనే రోజంతా ఉంటారు.. అఖరికి రాత్రి పడుకునే ముందు అర్ధరాత్రి వరకు ఫోన్‌లోనే ఉంటున్నారు. అది చాలదన్నట్టు ఇంట్లో గృహిణిలకు అంటించారు. ఇప్పుడు వాళ్లు కూడా అను క్షణం ఫోన్‌లతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే అన్నం తినను అన్నా.. మారం చేసినా ఫోన్‌ ఇచ్చి వారిని సముదాయి స్తున్నారు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేకపోతే గోలగోల చేసేవిధంగా కుటుంబమంతా ఎడిక్ట్‌ అయ్యింది.

దంపతుల మధ్య దూరం..

ఒకనాడు కుటుంబ బాంధవ్యాలు ఉండేవి.. పెద్దలు వస్తే చాలా గౌరవంగా చూసేవారు. మరిప్పుడో పెద్దలు వచ్చినా ఎవరి పని వారిదే.. సెల్‌ఫోన్‌ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.. వచ్చిన వాళ్లు వెళ్లిపోతుంటే ఊ అనే చిన్న సమా ధానం తప్ప.. క్షేమసమాచారం మాటే మరిచారు. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు తలో సెల్‌ఫోన్‌ పట్టుకుని నాలుగు గోడల మధ్య జీవి స్తున్నారంటే పరిస్థితి ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరంలో ఇటీ వల భార్యభర్తలు పార్కుకు వచ్చారు..ఒక మంచి ప్లేస్‌ చూసుకుని కూర్చున్నారు.. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటారులే అని చూస్తుంటే అతను ఒక ఫోన్‌.. ఆమె ఒక ఫోన్‌ పట్టుకున్నారు.. వచ్చి నప్పటి నుంచి వెళ్లే వరకూ కీపాడ్‌పై పైకీ కింద కూ లాగుతూనే ఉన్నారు. చివరికి భార్య లేచి వెళ్లిపోదాం అనే సిగ్నల్‌ ఇవ్వడంతో భర్త ఫోన్‌ జేబులో పెట్టుకుని బయలుదేరాడు. అంతలా దంపతుల మధ్య సెల్‌ దూరిపోయింది. దూరం చేస్తుంది. అంతేకాదండోయ్‌ సోషల్‌ మీడియా వాట్సాప్‌.. ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టా తదితర యాప్‌లతో అనుమానపు చిచ్చురేగుతోంది. కుటుంబాలు విడి పోతున్నాయి. సెల్‌కి ఎడిక్ట్‌ అయిన భార్యభర్తను పట్టించుకోవడంలేదంటే అతిశయోక్తి కాదేమో.

చదువులపై పెనుప్రభావం

పిల్లలు అడిగారని తల్లిదండ్రులు ఆలోచించ కుండా ఆండ్రాయిడ్‌ ఫోన్లను ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు వీరి చదువుపై ప్రభావం చూపిస్తోంది. చదువుకునే సమయంలో ఫోన్‌ దగ్గర పెట్టుకుని చాటింగ్‌లు చేయడం, యూట్యూబులు చూడడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలు వెతుకులాట చేస్తూ చదువుపై ఏకాగ్రత సన్నగిల్లుతోంది. ఫలితంగా పిల్లలు చదువులో వెనుకబడుతున్నారు. నిజానికి కొన్ని స్కూల్స్‌, కళాశాలలో సెల్‌ఫోన్లను అనుమతించరు. ఎందుకంటే సెల్‌ఫోన్‌తో ఉంటే చదువుపాడైపోతుందని వారికి తెలుసు. కొన్ని కళాశాలల్లో మాత్రం ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌ తప్పనిసరి అంటున్నారు. అవసరం మేరకు వాడితే సెల్‌ఫోన్‌ విజ్ఞానాన్ని పంచుతుంది. పరిమితిమించి వాడితే వినాశానానికి దారితీస్తుంది. కాబట్టి సెల్‌ఫోన్‌ ఇవ్వడం తప్పుకాదుకానీ..అది అతిగా వినియోగిస్తేనే తప్పు. తల్లిదండ్రులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి.

దెబ్బతింటున్న ఆరోగ్యం

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకు ఎడిక్ట్‌ అయినవారు ప్రస్తుతం అనారోగ్య సమస్యలు బారిన పడుతు న్నారు. ముఖ్యంగా చంటి బిడ్డకు చూపు మందగిస్తుంది. ఇంట్లో అదే పనిగా సెల్‌ చూస్తూ ఉండడం వల్ల కంట్లో రెటీనాపై ప్రభావం పడుతుంది. అందుకే పదేళ్లు దాటేసరికే చాలామందికి చూపుమందగిస్తోంది. స్కూల్‌కి వెళితే బ్లాక్‌ బోర్డు, డిజిటల్‌ బోర్డుపై అక్షరాలు కనిపించలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణంగా ఫోన్‌ నిలుస్తోంది. చీకటి గదిలో ఫోన్‌ చూడడం, ముఖానికి దగ్గరగా ఫోన్‌ పెట్టుకుని చూడడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలు సెల్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడుతున్నా తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకపోవడంతో వారి మానసికస్థితిపై పడుతుంది. ఫ్రీఫైర్‌, హంటింగ్‌ తదితర గేమ్‌లు ఆడుతున్న బాలలు ఆ గేమ్‌లో ఉన్న వారిని అనుకరిస్తూ తమలో తామే మాట్లాడుకోవడం, ఆ గేమ్‌లో ఎటాక్‌లు జరిగినప్పుడు ఎదుర్కొనే దృశ్యాలు నిజజీవితంలో జరుగుతున్న ట్టు ఫీలై ప్రవర్తించడం వంటివి చేస్తున్నారు. కొం తమంది పబ్‌జీకి ఎడిక్ట్‌ అయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. సరదాగా ప్రారంభమైన సెల్‌గేమ్‌ బాల్యాన్ని ఆపదలోకి నెట్టివేస్తుంది. ఆండ్రాయిడ్‌ ఫోను నిద్రించే సమయంలో దిండు వద్ద పెట్టుకోవడం, పక్కన పెట్టుకోవడం వల్ల రేడియేషన్‌ కారణంగా మనిషి శరీరంలో ఇమ్యూనిటీ తగ్గించడంతోపాటు క్యాన్సర్‌ కణాలు పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు ఆం డ్రా యిడ్‌ ఫోన్లను దూరంగా ఉంచడమే ఉత్తమం.

అతి వినియోగం ప్రమాదమే..

ప్రతి వస్తువులోను మంచిచెడులు ఉంటాయి. కేవలం మంచిని గ్రహించాలి. కత్తితో వైద్యుడు శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు నిలబెడతాడు. అదే కత్తితో చెడ్డవాడు ప్రాణాలు తీస్తాడు. ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చిందే ఇంటర్నెట్‌.. దానిని స్మార్ట్‌ఫోన్‌లో పరిమితంగా వినియోగిస్తే జ్ఞానమే. ఎడిక్ట్‌ అయితే ప్రమాదమే. పిల్లలు దేనికి అలవాటుపడితే దానికి బానిసలవుతారు. ఆ పరిస్థితి రాకుండానే తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి.

- డాక్టర్‌ కర్రి రామారెడ్డి, మానసిక వైద్యనిపుణులు, రాజమండ్రి

Updated Date - Oct 27 , 2024 | 12:51 AM