Share News

బంద్‌ విజయవంతం

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:28 AM

బీజేపీ ప్రభుత్వ వినాశనకర విధానాలకు నిరసనగా దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణభారత్‌ బంద్‌ విజయ వంతమైంది.

బంద్‌ విజయవంతం
రాజమహేంద్రవరంలోనిరసన ర్యాలీ చేస్తున్న కార్మికులు

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 16 : బీజేపీ ప్రభుత్వ వినాశనకర విధానాలకు నిరసనగా దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణభారత్‌ బంద్‌ విజయ వంతమైంది. జిల్లా వ్యాప్తంగా కార్మికులు, రైతులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ చేశారు. కార్మికులు, రైతులకు అన్యాయం చేస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోదీ నాయకత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దింపాలని పలు కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండు సెంటర్లోని హెడ్‌ పోస్టాఫీసు నుంచి శ్యామలా సెంటర్‌, మెయిన్‌రోడ్డు మీదుగా కోటగుమ్మం సెంటర్‌ వరకూ కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్‌, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ కె.రాంబాబు, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు ఏవీ రమణ మాట్లాడుతూ గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టారని విమర్శించారు.బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, ఉద్యోగులు, ప్రజల పట్ల తీవ్రమైన నిరంకుశత్వం ప్రదర్శించిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ మాట నిలబెట్టుకోకుండా రైతు చట్టాల పేరుతో వారి భూములను లాక్కుని కార్పొరేట్లపరం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ, జిల్లా కోశాధికారి కేఎస్‌వీ రామచంద్రరావు, ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్‌ మూర్తి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కొండలరావు, నల్ల రామారావు, రామకృష్ణ, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు జోజి, ఎస్‌ఎఫ్‌ఐ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:28 AM