Share News

వంతెనలు శిథిలం.. కనీస మరమ్మతులు కరువు

ABN , Publish Date - May 31 , 2024 | 12:25 AM

ప్రధాన రోడ్లలో మురుగునీటి, పంటకాల్వలపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

 వంతెనలు శిథిలం.. కనీస మరమ్మతులు కరువు

ముమ్మిడివరం, మే 30: ప్రధాన రోడ్లలో మురుగునీటి, పంటకాల్వలపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వంతెనల పునాధులు దెబ్బతిని రెయిలింగ్‌లు ధ్వంసమై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈవంతెనలకు కనీస మరమ్మతులు లేకపోవడంతో అవి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈవంతెనలు కూలిపోతే ప్రయాణికుల రాకపోకలకు దూరాభారం అవుతుంది. ముమ్మిడివరం-కాట్రేనికోన ఆర్‌అండ్‌బీ రోడ్డులో అయినాపురం ప్రధాన మురుగునీటికాల్వ, వాడపర్రు పంటకాల్వ, ఓల్డ్‌ అయినాపురం పంటకాల్వలపైనా, మహిపాలచెరువు-మాగాం రోడ్డులో పోతుకుర్రు సమీపంలోని బొండాయికోడు మురుగునీటి కాల్వపై ఉన్న వంతెన, కాశివానితూము-క్రాపచింతలపూడి ఆర్‌అండ్‌బీ రోడ్డులో మాగాం-అయినాపురం పంటకాల్వపై ఉన్న వంతెన, అయినాపురం బాడవ వృద్ధ గౌతమీ మురుగు కాల్వపై ఉన్న వంతెనల పునాధులు దెబ్బతిని వంతెన రెయిలింగ్‌లు శిథిలమయ్యాయి. ఈవంతెనలకు తక్షణం తాత్కాలిక మరమ్మతులు చేపట్టవలసి ఉంది. ఇవి కనుక కూలిపోతే ఆయా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యానికి రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలకు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వంతెనలకు రెయిలింగ్‌ లేకపోవడంతో రాత్రి సమయాల్లో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెనల నిర్మాణాలకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 31 , 2024 | 12:25 AM