Share News

వై..చీప్‌ రాజకీయం!

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:54 AM

వైసీపీ నాయకులా మజాకానా.. టక్కు టమార విద్యల్లో ఆరితేరిన వారు.. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చీపు రాజకీయానికి తెరలేపుతున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా మద్యం నిల్వలు తెచ్చి జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో నిల్వ చేస్తోంది.

వై..చీప్‌ రాజకీయం!
పిఠాపురంలో పట్టుబడిన మద్యం (ఫైల్‌)

గోవా నుంచి గోదావరికి అక్రమ మద్యం

భారీగా కంటెయినర్లలో డంప్‌

లోకల్‌గానూ తయారీ

అన్ని నియోజకవర్గాలకు సరఫరా

పిఠాపురం,కాకినాడల్లో పట్టివేత

తూతూ మంత్రంగా కేసులు

పిఠాపురం, ఏప్రిల్‌ 27: వైసీపీ నాయకులా మజాకానా.. టక్కు టమార విద్యల్లో ఆరితేరిన వారు.. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చీపు రాజకీయానికి తెరలేపుతున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా మద్యం నిల్వలు తెచ్చి జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో నిల్వ చేస్తోంది. గోవా మద్యంతో పాటు రాష్ట్రంలోనూ తయారు చేసి అవే లేబుల్స్‌ ఉన్న సీసాల్లో నింపుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికే కాకినాడ, పిఠాపురంలలో భారీగా మద్యం డంప్‌లు బయటపడ్డాయి. విలువ రూ.1.50 కోట్లకు పైగా ఉంది. ఇంతకు వంద రెట్లు అధికంగా కాకినాడ జిల్లాకు మద్యం నిల్వలు చేరినట్టు సమాచారం.

బరితెగించిన వైసీపీ నేతలు..

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియకుండానే జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. వైసీపీ నేతలు బరితెగించి భారీగా మద్యం పంపిణీ చేస్తున్నారు. గోవా నుంచి కంటెయినర్ల ద్వారా మద్యం జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నట్టు సమాచారం. అంతే కాకుండా గోవా మద్యం సీసాల్లో రాష్ట్రంలోని రెండు ఫ్యాక్టరీల్లో తయారైన మద్యాన్ని నింపి ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్టు సమాచారం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంతో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజవర్గాలకు ఇప్పటికే భారీ మద్యం నిల్వలు చేరాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.5 నుంచి రూ.పది కోట్లు విలువైన మద్యాన్ని చేర్చినట్టు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా తీసుకువచ్చినట్టు చెబుతున్నారు.

వైసీపీ కీలక నేతల ఫ్యాక్టరీల్లోనే..

ఈ అక్రమ మద్యం వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన వైసీపీ ఎంపీలుగా ఉన్న ఇద్దరు నేతలు, కాకినాడ జిల్లా కేంద్రం కీలక నేత ఒకరు కీలకపాత్ర పోషించినట్టు చెబుతున్నారు. ఆ ఇద్దరు ఎంపీలకు లిక్కర్‌ తయారీ యూనిట్లు ఉండడంతో అక్కడ ఈ మద్యాన్ని తయారు చేయించి గోవా బ్రాండ్ల స్టిక్కర్లు అంటించి ఉన్న సీసాల్లోకి నింపినట్టు చెబుతున్నారు. గోవా మద్యంతో పాటు అంతకు రెండింతలు లోకల్‌ మద్యం వివిధ ప్రాంతాలకు డంప్‌ చేసినట్టు చెబుతున్నారు. పిఠాపురం పట్టణంలోని మూడు చోట్ల, కుమారపురంలో ఒక చోట గృహాల్లో డంప్‌లపై ఎస్‌ఈబీ, పోలీసు అధికారులు దాడులు చేశారు. ఇక్కడ ఏకంగా 52,992 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.కోటి పైగా ఉంటుందని అంచనా. కాకినాడలోనూ మద్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ రూ.50 లక్షలు ఉంటుంది.రెండు చోట్ల పట్టుబడిన మద్యం చాలా తక్కువని, ఇంతకు వంద రెట్లు నిల్వలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఓటర్లను మద్యంతో ముంచెత్తడమే లక్ష్యంగా

ఓటర్లను మద్యం మత్తులో ముంచేయాలని వైసీపీ నేతలు ముం దు నుంచీ భావిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలో మద్యం పంపిణీ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రతి రోజు మద్యం పంపిణీ చే యాలని, పోలింగ్‌ చివరి ఐదు రోజులు ప్రజలు కోరినంత మద్యం పంపిణీ చేయాలని వైసీపీ పెద్దలు నియోజకవర్గాల నేతలకు చెప్పినట్టు సమాచారం.పిఠాపురంలో పవన్‌ను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న వైసీపీ అధినాయకత్వం అక్కడ మద్యాన్ని ఏరులై పారించాలని పన్నా గం పన్నినట్టు ఇతర పార్టీల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కాకినాడ, పిఠాపురంలలో మద్యం నిల్వలు పట్టుబడిన నేపథ్యంలో రెండు, మూడు రోజుల పాటు లిక్కర్‌ పంపిణీకి వైసీపీ నేతలు తాత్కాలికంగా ఫులిస్టాప్‌ పెట్టారు. అంతే కాకుండా వైసీపీ నేతలు తమ మద్యం నిల్వలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సెబ్‌, పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తే మరింత భారీగా నిల్వలు బయటపడతాయని అందరు భావిస్తున్నా ఆ దిశగా అడు గులు వేస్తున్నట్టు లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పట్టుబడిన మద్యం బ్రాండ్లు ఇవే

పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన దాడుల్లో పట్టుబడిన మద్యం బ్రాం డ్లు అన్నీ గోవా తయారీ మద్యం బ్రాండ్లుగా చెబుతున్నారు. ఇవన్నీ ఎన్‌డీపీఎల్‌ లిక్కర్‌ కావడంతో కేసు తీవ్రత అధికంగా ఉంటుంది. పట్టుబడిన వాటిలో రాయల్‌ బ్లూ, గోవా కిక్‌ విస్కీ, బొంబాయు సెంట్రల్‌ క్లాసిక్‌ టోటల్‌ విస్కీ, గోవా క్విక్‌ ఫైనెస్ట్‌ సుపీరియర్‌ విస్కీ,యూకే నెంబరు 1 రేర్‌ విస్కీ, రాయల్‌ స్టైల్‌ విస్కీ, గోవా విస్కీ బ్రాండ్లు ఉన్నాయి.ఇప్పుడు ఇవి ఎక్కడ తయారయ్యాయి, వీటిని ఎలా తరలించారు, ఎవరు తరలించమన్నారు తదితర విషయాలపై దర్యాప్తు చేయాల్సిన పోలీసు,సెబ్‌ అధికారులు అసలు విషయాన్ని వదిలి తూతూమంత్రంగా నాలుగుచోట్ల ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఇంత భారీగా మద్యం నియోజకవర్గాలకు తరలించిన వైసీపీ రానున్న రోజుల్లో ఇక ఎన్ని కుట్రలకు తెరలేపుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 28 , 2024 | 12:54 AM