భూచోళ్లు ఎక్కడ!
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:40 AM
భూమాఫియాల డొంక కదులుతోంది. దశాబ్దా లుగా సాగుతున్న భాస్కర్ నగర్ భూ మాఫియాకు చెక్ పెట్టడానికి జిల్లా యంత్రాంగం కదిలింది.

లేఅవుట్ అక్రమాలపై కలెక్టర్ ఆరా
ఆరుగురు సభ్యులతో కమిటీ
ఆక్రమణకు గురైన స్థలాల పరిశీలన
భూమాఫియా కథనానికి స్పందన
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
భూమాఫియాల డొంక కదులుతోంది. దశాబ్దా లుగా సాగుతున్న భాస్కర్ నగర్ భూ మాఫియాకు చెక్ పెట్టడానికి జిల్లా యంత్రాంగం కదిలింది. ఈ నెల 8న ‘ఆంధ్రజ్యోతి’లో భూచోళ్లు శీర్షికతో ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పందించారు. అప్పట్లోనే రిజిస్ర్టేషన్లు ఆపేయాలని ఆదేశించారు. జిల్లా సహకార అధికారి నుంచి నివేదిక తెప్పించుకుని అధ్య యనం చేసి వివిధ విభాగాల ముఖ్య అధికారులతో సిక్స్ మెన్ కమిటీని నియమించారు. నెల రోజుల్లోఈ లేఅవుట్ సంగతి తేల్చాలనే లక్ష్యంతో యంత్రాం గం ముందుకు సాగుతోంది. రాజమహేంద్రవరం సిటీఆర్‌ఐ ప్రాంతం భాస్కరనగర్‌లో 1928లో ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ది.రాజమండ్రి పబ్లిక్ సర్వెంట్స్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీగా రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు.1967లో సొసైటీ ప్రెసిడెంట్‌గా ఉన్న సుంకర భాస్కరరావు (కోఆపరేటివ్ ఆఫీసర్) ఆధ్వర్యంలో భూస్వామి ఆలపాటి భాస్కర రామయ్య అండ్ బ్రదర్స్ నుంచి రూ.10 వేలకు సుమారు 32 ఎకరాల భూమిని సొసైటీ కోసం కొనుగోలు చేశారు. 1968లో ప్రభుత్వం మార్కెట్ విలువ (సబ్ రిజిస్టర్ వేల్యూ) ప్రకారం 32.09 ఎకరాలు సొసైటీ పేర రిజి స్ర్టేషన్ చేసుకున్నారు. ఈ భూమి సర్వే నంబర్లు 111, 114,117, 118,119, 120, 121/1, 122/1, 135గా ఉన్నాయి. 1975లో భూమిని 254 ప్లాట్లుగా కేటాయించారు.మరో 20 క్రాస్ బిట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్లాట్లు రిజి స్ర్టేషన్ జరగలేదు. మరికొన్ని భూయజమానులు ఎవరో తెలియదు.దీంతో ఖాళీ స్థలాలపై భూమాఫియా కన్నుపడింది. రూ.కోట్ల విలువైన ఇక్కడ భూములన్నీ రాజకీయనేతల అండదండలతోనే కబ్జా అయినట్టు చెబుతున్నారు.భూ యజమానులు స్థాని కంగా లేక పోవడం.. రిజిస్ర్టేషన్లు కాకపోవడం తదితర కారణాలతో ఆక్రమించుకోవడం..వేరేవారికి అమ్మే యడం ఇలా చాలా ప్లాట్లు ఇప్పటికి మూడు నాలుగు చేతులు కూడా మారా యి. ఇక్కడ గజం స్థలం రూ.35 వేల నుంచి రూ.45వేల వరకూ ఉంది. మార్కెట్ విలువ ఉంటే, మొత్తం ఒక్కో ప్లాట్ 346 గజాల కంటే ఎక్కువగా ఉంది. 420 గజాల స్థలాలు కూడా ఉన్నాయి. ఇది పెద్ద వివాదం కావడంతో గతంలో విజిలెన్స్ విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. సొసైటీ సభ్యులు ఎవరూ లేకపోవడంతో సహకార శాఖకు చెందిన అసిస్టెంట్ రిజిస్ర్టార్ స్థాయి అధికారిని ప్రభుత్వం ఇక్కడ లిక్విడేటర్‌గా నియమించింది.కానీ పరిస్థితిలో మార్పులేదు.అన్యాక్రాంతం జరుగుతూనే ఉం ది. మొత్తం 254 ప్లాట్లలో 160 సక్రమంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.42 ప్లాట్లు అన్యాక్రాంతమైన ట్టు గుర్తించారు. మిగతా 78 ప్లాట్లను పరిశీలిస్తున్నారు.
రికార్డులు మాయం
ఈ సొసైటీ భూములకు సంబంధించిన రికార్డులను ఎవరో మాయం చేశారు. సబ్- రిజిస్ర్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు చివికిపోయి ఉన్నట్టు చెబుతున్నారు. అయినా సుమారు 10 ప్లాట్లకు పైగా సబ్- రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇక్కడ భూకబ్జాదారులు, అధికారులు కుమ్మక్కయ్యే రికార్డులు మాయం చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కోర్టులో ఆరు ప్లాట్లు ఒకరికే రిజిస్ర్టేషన్ చేసిన ఉదంతంపై హియరింగ్ జరుగుతోంది. ఇటీవల సర్వే నంబర్ 121/1లోని 249,250 నంబరు ప్లాట్లకు సంబం ధించి తాజాగా మరో వివాదం చెలరేగింది.
కలెక్టర్ ఆరా ! కమిటీ ఏర్పాటు
‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆరా తీసి ఆరుగురు సభ్యులతో హైలెవెల్ కమి టీని నియమించారు. కమిటీలో రాజమహేంద్రవరం ఆర్ డీవో కృష్ణనాయక్,జిల్లా కోపరేటివ్ అధికారి శ్రీరాములు నాయుడు,జిల్లా రిజిస్ర్టార్ (ఆర్.సత్యనారాయణ), సెం ట్రల్ జోన్ డీఎస్పీ రమేష్‌బాబు, మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్ ప్లానర్ కోటయ్య, అర్బన్ తహశీల్దార్ పాపారావు ఉన్నారు. హైలెవల్ కమిటీ గురువారం వివాదాస్పద స్థలాలను పరిశీలించింది. మొత్తం సుమారు 2 గంటల పాటు ఈ ప్రాంతమంతా కలియతిరిగి, ప్రజల నుంచి వివరాలు సేకరించింది.లిక్విడేటర్ చంద్రశేఖర్ ఇక్కడ పరిస్థితిని అధికారులకు స్వయంగా వివరించారు. ఆర్‌డీవో కృష్ణనాయక్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు స్థలాలను పరి శీలించామన్నారు. ఇక్కడ ఎవరికి ఎన్‌వోసీలు ఇచ్చారో, ఎవరు ఎలా రిజిస్ర్టేషన్ చేయించుకున్నారో తదితర వివరాలను లిక్విడేటర్ నుంచి సేకరిస్తామని చెప్పారు. సుమారు నెల రోజుల్లో సమస్యను అధ్యయనం చేసి, ఎవరికీ చెందని, అన్యాక్రాంతమైన స్థలాలను స్వాఽధీనం చేసుకుంటామన్నారు.స్థానిక ప్రజలు, బాధితుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు.