బెండపూడిలో డయేరియా కేసులు
ABN , Publish Date - Jun 19 , 2024 | 12:39 AM
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో గత వారం రోజులుగా నమోదవుతున్న డయేరియా కేసుల ఉధృతి తగ్గి కనిష్ఠ స్థాయికి చేరుకోగా ఈ దశలో కొత్తగా బెండపూడిలో 18 డయేరియా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
తొండంగి, జూన్ 18: కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో గత వారం రోజులుగా నమోదవుతున్న డయేరియా కేసుల ఉధృతి తగ్గి కనిష్ఠ స్థాయికి చేరుకోగా ఈ దశలో కొత్తగా బెండపూడిలో 18 డయేరియా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కొమ్మనాపల్లిలో సుమారు వంద కేసులు వరకూ నమోదు కావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అంతా మకాం వేసి వారం రోజులుగా స్థానికంగాను, కాకినాడ జీజీహెచ్‌లోను రోగులకు చికిత్స అందించడంతో మంగళవారానికి తీవ్రత మూడు కేసులకు తగ్గింది. కాకినాడ నుంచి సుమారు 25 మంది జీజీహెచ్ నుంచి, మరో 15 మంది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి రిలీవ్ అయ్యారు. అధికార యంత్రాంగం, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో బెండపూడి గ్రామంలో భారీగా డయేరియా కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. బెండపూడి సబ్ సెంటర్‌లో 10 మందికి చికిత్స అందించి మరో 8 మందిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సబ్‌సెంటర్‌లో బెడ్ అందుబాటులో లేకపోవడంతో కుర్చీలలోనే పడుకోబెట్టి సెలైన్ పెడుతున్నారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సరిత గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్ టి.గాయత్రిదేవి రోగుల్ని పరామర్శించి వైద్యులతో సమావేశమయ్యారు. వ్యాధి వ్యాప్తికి గల కారణాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. కొమ్మనాపల్లి వైద్య శిబిరంలో డాక్టర్ రవికుమార్ డాక్టర్ భారతి రోగులకు చికిత్స అందించారు. బెండపూడి గ్రామంలో నూతి నీటిని తాగునీటిగా ఉపయోగించడం వలనే డయేరియా వ్యాప్తి చెంది ఉంటుందని భావించి ఆ నీటిని ఉపయోగించవద్దని నోటీసు అంటించి చుట్టూ కంపతో మూసివేశారు.