Share News

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:45 AM

జిల్లా స్థాయి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు క్షేత్ర స్థాయిలో మద్యం లావాదేవీలు, ఇతర ఉచిత పంపిణీల తీరుపై సూక్ష్మ స్థాయిలో నిఘా పెట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు.

 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు అప్రమత్తంగా ఉండాలి
ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

  • సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాధవీలత

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): జిల్లా స్థాయి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు క్షేత్ర స్థాయిలో మద్యం లావాదేవీలు, ఇతర ఉచిత పంపిణీల తీరుపై సూక్ష్మ స్థాయిలో నిఘా పెట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. జిల్లా ఎఫ్‌ఎస్‌టీ బృందంతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 7 నియోజక వర్గాల స్థాయిలో 63 బృందాలు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నాయ న్నారు. వీటికి అదనంగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో జిల్లా స్థాయిలో 10మంది సభ్యులతో జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాన్ని ఏర్పాటు చేశామ న్నారు. ఈ బృందానికి సహాయ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డిని నోడల్‌ అధికారిగా నియమించామన్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసినందున ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు మరింత అప్రమత్తత, కచ్చితత్వంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గత ఏడాది ఇదే రోజున ఎంత మద్యం లావాదేవీలు జరిగాయి, వివిధ ఫ్రీబీస్‌, వస్తువుల వినిమయం ఎంత ఉందో షాపుల వారీగా, ప్రాంతాల వారీగా గణాంకాలను తనిఖీ చేయాలన్నారు. ఇన్‌కం ట్యాక్స్‌, జీఎస్టీ, ఎస్‌ఎస్‌టీ శాఖల ఆధ్వర్యంలో రికార్డు లను పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక అందజేయాలని మాధవీలత ఆదేశించారు. ఎఫ్‌ఎస్‌టీ బృందాలు తనిఖీల వివరాలను ఎప్పటికప్పుడు రిపోర్టు చేయడం అత్యంత అవసరమన్నారు. జిల్లాలోని ఐదు డిస్టిలరీలు, ఒక బ్రూవరీ ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాలపై సమగ్ర సమాచారం సేకరించాలన్నారు. అమ్మకాలను నియంత్రించే క్రమంలో సీలింగ్‌ పద్ధతిని అనుసరిస్తున్నామని ఆమె తెలిపారు. సమావేశంలో సహాయ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.భానుప్రకాశ్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  • ఆర్‌వో కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు: సబ్‌ కలెక్టర్‌

కొవ్వూరు, ఏప్రిల్‌ 18: ఎన్నికల కమిషన్‌ ఆదేశాలమేరకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినట్టు కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆశుతోష్‌ శ్రీవాస్తవ తెలిపారు. శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ నిమిత్తం నియమించబడిన పోలింగ్‌ సిబ్బంది ఓపీవోలు(అందరు పోలింగ్‌ ఆఫీసర్స్‌), మైక్రో అబ్జర్వర్స్‌, ఎసెన్షీయల్‌ సర్వీసెస్‌, మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్‌ విధులు నిర్వహించే ఫొటోగ్రాఫర్స్‌, వీడియోగ్రాఫర్స్‌, డ్రైవర్స్‌, క్లీనర్స్‌, ఇతర సిబ్బంది నుంచి ఫారం-12 స్వీకరిస్తున్నట్టు చెప్పారు. అందుకోసం కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, 4 అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు (కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండల తహశీల్దార్‌ కార్యాలయాలు, కొవ్వూరు మున్సిపల్‌ కార్యాలయంలో) హెల్ప్‌డెస్కులు ఈ నెల 15వ తేదీ నుంచి ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని కొవ్వూరు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో విధులు కేటాయించిన ఎన్నికల సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ చెప్పారు.

Updated Date - Apr 19 , 2024 | 12:46 AM