Share News

ఐదేళ్లూ.. వెనకబడే!

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:44 AM

జగనన్నా నీ భాషలో నా అంటే ఏంటన్నా.. వదిలేయడమా.. పట్టుకోవడమా.. లేదంటే నమ్మించి మోసం చేయడమా.. ఇదీ ఒక బీసీ నాయకుడి ప్రశ్న.. మీకెందుకా డౌటు అంటే..!? నా బాణం అంటూ గత ఎన్నికల్లో చెల్లెలు షర్మిలను ఊరూవాడా తిప్పారు.. చివరకు ఏం జరిగింది..

ఐదేళ్లూ.. వెనకబడే!
కడియం మండలం వీరవరంలో చేనేత కష్టం

30 బీసీ పథకాలు రద్దు

కొండెక్కిన ఆదరణ

ఉత్తుత్తి కార్పొరేషన్లు

సబ్సిడీల్లేవ్‌.. సాయం లేదు

రిజర్వేషన్లు కుదింపు

బీసీ భవన్‌లు లేవు..

జగనన్నా నీ భాషలో నా అంటే ఏంటన్నా.. వదిలేయడమా.. పట్టుకోవడమా.. లేదంటే నమ్మించి మోసం చేయడమా.. ఇదీ ఒక బీసీ నాయకుడి ప్రశ్న.. మీకెందుకా డౌటు అంటే..!? నా బాణం అంటూ గత ఎన్నికల్లో చెల్లెలు షర్మిలను ఊరూవాడా తిప్పారు.. చివరకు ఏం జరిగింది.. అధికారం వచ్చిన తరువాత ఆమె ఎవరో కూడా మర్చిపోయారు.. చివరికి సీఎం జగన్‌ సొంత చెల్లెలు కాంగ్రెస్‌ పంచన చేరింది.. 2024 ఎన్నికల వేళ... జగన్‌ కొత్త పల్లవి అందుకున్నారు. నా బీసీలు.. నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూ ఊదరగొడుతున్నారు.. ఒకసారి బీసీల సంగతే తీసుకుంటే.. ఈ ఐదేళ్లలో బీసీలకు చేసిందేంటి.. ఏమీలేదు.. రిజర్వేషన్లు కుదించేశారు.. ఆదరణ పథకం అటకెక్కించేశారు.. బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణమూ ఆపేశారు.. కార్పొరేషన్లు పెట్టారు.. ఒక్క రూపాయి విడుదల చేయకుండానే పాలన ముగించేశారు.. మాట్లాడితే నా బీసీలనే జగన్‌.. ఐదేళ్లూ వెనుకబడిన తరగతులకు చేసిందేంటి.. చెల్లి షర్మిలను పక్కనబెట్టేసినట్టే.. బీసీలను వెనుకబడేశారు.. ఎన్నికల వేళ నా బీసీలంటూ మళ్లీ ఓటు రాజకీయం ఆరంభించారు.. బీసీల్లారా తస్మాత్‌ జాగ్రత్త!? ఈ సారైనా మేల్కొండి.. అంటూ బీసీ సంఘాలు పిలుపునిస్తున్నాయి.

పిఠాపురం, ఏప్రిల్‌ 19 : నా.. బీసీలు అంటూ చిలకపలుకులు పలుకుతున్న జగన్‌ తన ఐదేళ్ల పాలనలో వారిని నమ్మించి నిలువునా మోసం చేశారు. అండగా నిలబడతానని చెప్పి అణగదొక్కేశారు. చేతివృత్తుల వారికి చేయూతను ఇచ్చే ఆదరణ పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన ఉపకరణాలు తుప్పు పట్టించేశారు. బీసీ భవన్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపును రద్దు చేశారు. ఆయా స్థలాలు కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. యువత ఉపాధికి అందించే సబ్సిడీ రుణాలు అటకెక్కించారు. బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు. బీసీల సంక్షేమ పథకాలన్నీ రద్దు బాటలోనే నడిచాయి. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన 30కిపైగా పథకాలను జగన్‌ సర్కారు రద్దుల పద్దులోకి చేర్చింది. బీసీలపై దాడులు పెరిగిపోతున్నా కనీస చర్యలు లేవు. ఒక్క కాకినాడ జిల్లాలోనే చూస్తే 7.40 లక్షల మందికి పైగా బీసీలు ఉన్నా ఒక్క ఎమ్మెల్యే సీటును బీసీలకు కేటాయించలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 19.80 లక్షల మంది బీసీలు ఉన్నట్టు సమాచారం ఉంది.

బీసీలకు ఆదరణ ఎక్కడన్నా?

టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఆదరణ పథకం చేతివృత్తుల వారికి అండగా ఉండేది. ఈ పథ కం కింద చేతివృత్తులు చేసుకునే వారికి 90 శాతం సబ్సిడీపై అత్యాధునిక పరికరాలు, పనిముట్లు అందిం చేవారు. ఈ పథకం కింద లక్షలాది మంది చేతివృత్తిదారులు లబ్ధిపొందారు. అయితే గత ఎన్నికల ముందు మునిసిపల్‌, మండల పరిషత్‌ కార్యాలయాలకొచ్చిన ఈ ఉపకరణాలు పంపిణీ చేయకుండా వైసీపీ సర్కా రు నిలిపివేయడంతో అవి తుప్పు పట్టిపోయాయి. అంతే కాకుండా అప్పటికే పెం డింగ్‌లో ఉన్న లక్షల దరఖాస్తులను, చెల్లించిన డీడీలను పక్కన పడేసింది. కనీసం డీడీలు వెనక్కి ఇవ్వలేదు. బీసీలకు సంబంధించి 100 కిపైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్ప లు చెప్పుకోవడం మినహా ఐదేళ్లూ ఒక్క పైసా జగన్‌ సర్కారు విడుదల చేయలేదు. బీసీ కార్పొరేషన్ల ద్వారా గతం నుం చి అమలవుతూ వచ్చిన అన్ని పథకాలను రద్దుచేసింది. యువతకు ఉపాధి కల్పించేందుకు 50 శాతం సబ్సిడీపై గరిష్ఠంగా రూ.25 లక్షల వరకూ రుణాలను గతంలో అం దించేవారు. జగన్‌ వాటి ఊసే ఎత్తలేదు. గతంలో అమలుచేసిన ఓబీఎంఎంఎస్‌, ఎంబీసీ పథకాలను అటకెక్కించింది. బీసీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్పులకు ఎగనామం పెట్టారు. విదేశీ విద్య పథకాన్ని నీరుగార్చింది. టీడీపీ ప్రభుత్వం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీసీ భవన్లు,బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించేది. వీటికి జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలను కేటాయించింది. నిర్మాణాలు ప్రారంభించి సగంలో ఉన్న భవనాల పనులు నిలిపివేసింది. అప్పటికే కేటాయించిన నిధులను రద్దుచేశారు. అంతటితో ఆగని వైసీపీ నేతలు బీసీ భవన్‌లు, కమ్యూనిటీహాళ్లకు కేటాయించిన విలువైన స్థలాలపై కన్నువేసి కబ్జా చేశారు. పిఠాపురంలో ఇటువంటి ప్రయత్నమే జరగగా బీసీ నాయకులు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రజకుల కోసం చేపట్టిన దోబీ ఘా ట్ల నిర్మాణాలు నిలిపివేశారు. టీడీపీ హయాంలో బీసీల్లోని అన్ని వర్గాలకు 30కిపైగా సంక్షేమ పథకాలు అమలుచేయగా వైసీపీ ప్రభుత్వం వీటన్నింటిని రద్దుచేసింది. జగనన్న చేయూత పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పి దానిలోనూ ఆంక్షలు విధించి లబ్ధిదారుల సంఖ్యలో కోతలు పెట్టి ంది.ఈ ఒక్క పథకం మినహా బీసీల కోసం ఏ ఇతర పథకాలు అమలు చేయకపోవడం, బీసీలపై దాడులు జరుగుతున్నా నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు గురైంది. ఐదేళ్ల జగన్‌ ఏలుబడిలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరిగిందని ఆయా వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.

‘నేతన్న నేస్తం’ పేరుతో.. చేనేత పథకాలన్నీ రద్దు

అమలాపురం రూరల్‌ : చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చేలా గతంలో త్రిఫ్ట్‌ ఫండ్‌ స్కీమ్‌ అమల్లో ఉండేది. కార్మికుడు ఆదాయంలో 8 శాతం జమ చేసుకుంటే ప్రభుత్వం 16 శాతం నగదు ఏడాదికోసారి కార్మికుడికి తిరిగిచ్చేవారు. ఆ మొత్తాన్ని చంద్రబాబు పాలనలో 18 శాతానికి పెంచారు. పవర్‌లూమ్‌ధాటికి చేనేత వస్త్రాలు తట్టుకునే విధంగా 20 శాతం రిబేటు విధానం గత ప్రభుత్వాలు కొనసాగిస్తే చంద్రబాబు 30 శాతం రిబేటు ప్రకటించారు. రాయితీని జగన్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. చిలప నూలు కొనుగోలుపై గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 10 శాతం రాయితీ ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని 30 శాతానికి పెంచింది. తద్వారా 15 శాతం కార్మికుడికి లబ్ధి చేకూరితే మరో 15 శాతం సంఘాలకు లబ్ధి కలిగేది. సిల్కు, పట్టు నూళ్లపై సైతం రాయితీలను ఎత్తివేయడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. పావలా వడ్డీ రాయితీని జగన్‌ రద్దు చేశారు. చేనేతలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో రూ.15 వేలు వరకు లబ్ధి చేకూర్చేవారు. ఇప్పుడా పథకం లేదు. కార్మికులు 58 ఏళ్లలోపు చనిపోతే రూ.60 వేలు అందించేవారు. నేడు ఆ పథకాలన్నీ రద్దయ్యాయి. దేవాంగ సాధికార సమితి ఐటీడీపీ కో-ఆర్డినేటర్‌ కొండా సత్యనారాయణరాజు మాట్లాడుతూ ‘నేతన్న నేస్తం’ పేరుతో గత ప్రభుత్వాలు అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో నేతనేసే కార్మికుల సంఖ్య సైతం గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సంఘాలు బ్యాంకుల్లో తీసుకున్న నగదు పరపతి సొమ్ములకు వడ్డీలు చెల్లించలేక మూతపడే పరిస్థితి తలెత్తుతుంది.

బీసీల స్థానిక రిజర్వేషన్లు కట్‌..కట్‌

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : నా.. ఎస్సీలు, నా... బీసీలు, నా.. మైనార్టీలు.. నా ఎస్టీలు అంటూ దీర్ఘాలు తీసే వైసీపీ అధినేత, సీఎం జగన్‌ స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగకుండా కుట్ర చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలకు మరీ అన్యాయం చేశారు. స్థానిక సంస్థల్లోనే కాదు.. చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు కావాలని పోరాడుతున్న బీసీలకు, ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గించేయడంతో బీసీల ప్రాతినిధ్యం తగ్గిపోయింది. టీడీపీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లు ఎక్కువ మంది బీసీలే ఉండేవారు. నూటికి మూడో వంతు రిజర్వేషన్లతో పాటు జనరల్‌ స్థానాల్లో కూడా బీసీలు గెలవడంతో స్థానిక సంస్థల్లో బీసీల బలమే ఎక్కువగా ఉండేది. కానీ వైసీపీ పాలనలో బీసీల రిజర్వేషన్ల తగ్గించే కుట్ర జరిగింది. తర్వాత కోర్టు కూడా 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని చెప్పడం ఈ కుట్రదారులకు అనుకూల పరిస్థితి ఏర్పడింది. దీంతో 2019లో వైసీపీ గెలిచిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు బాగా తగ్గిపో యాయి. 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. ఏకంగా 10 శాతం తగ్గిపోవడంతో స్థానిక సంస్థలో పట్టుసాధిస్తున్న బీసీలంతా కుప్పకూలి పోయారు. 2014 తర్వాత టీడీపీ 34 శాతం రిజర్వేషన్లు అమలుచేసింది. తర్వాత ఇబ్బందులు రావడంతో వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకెళ్లి, వీటిని అమలుచేయడానికి ప్రయత్నిస్తే మేలు జరిగేది. కానీ అసలు పట్టించుకోకపోవడంతో బీసీలు, మహిళలు అనేక అవకాశాలను కోల్పోయారు. టీడీపీ ఈసారి 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని చెబుతోంది. అంతేకాక బీసీ చట్టం కూడా తీసుకుని వచ్చి, బీసీలకు రక్షణగా ఉండే ఏర్పాటు చేయడానికి కూడా మేనిఫెస్టోలో పెట్టింది.

16,860 పదవులు కోల్పోయాం..

జగన్‌ బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతం తగ్గించడంతో స్థానిక సంస్థల్లో 16,860 పదవులు కోల్పో యాం. టీడీపీలో బీసీ కార్పొరేషన్‌ నిధులిచ్చారు. ఆదరణ పథకం పెట్టారు. వైసీపీలో వీటి జాడే లేదు.

- బత్తుల నాగేశ్వరరావు(నాగు), రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, దివాన్‌చెరువు

ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం

వైసీపీ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లు ప్రకటించి పాలకవర్గాలను నియమించింది. లోన్లు వస్తాయని మాకు మేలు జరుగుతోందని ఆశించాం. ఐదేళ్లు గడిచినా బీసీలకు ఏ ప్రయోజనం చేకూరలేదు. నమ్మించి వంచించిన జగన్‌కు ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం.

- మామిడి లలిత, గృహిణి, ఏలేశ్వరం

మినీ ఫిషింగ్‌ హార్బరు గాలికి..

టీడీపీ అంతర్వేదిలో రూ.33 కోట్లతో మినీ ఫిషింగ్‌ హార్బరు నిర్మాణం చేపట్టారు. రూ.20 కోట్లు మంజూరు చేసి సగం నిర్మించారు. మిగిలిన ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వం మత్స్యకారుల జీవనభృతికి తూట్లు పొడిచింది. - తిరుమాని ఆచార్యులు, రాష్ట్ర మత్స్యకార సాధికార అధ్యక్షుడు, అంతర్వేది

Updated Date - Apr 20 , 2024 | 12:44 AM