గోదావరిలో అరుదైన అతిథులు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:47 AM
భూమికి అత్యంత ఎత్తులో ప్రయాణించే పక్షులుగా గుర్తింపు పొందిన బార్‌హెడెడ్ గుస్ బాతులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు వద్ద గోదావరి తీరాన సందడి చేశాయి.

భూమికి మూడు వేల అడుగుల ఎత్తులో ఎగిరే పక్షులుగా గుర్తింపు
హిమాలయాల నుంచి శీతాకాలంలో వచ్చే అరుదైన అతిథులు
కోనసీమ జిల్లాలోని ఆలమూరు వద్ద గోదావరిలో పక్షుల సందడి
ఆలమూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భూమికి అత్యంత ఎత్తులో ప్రయాణించే పక్షులుగా గుర్తింపు పొందిన బార్‌హెడెడ్ గుస్ బాతులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు వద్ద గోదావరి తీరాన సందడి చేశాయి. హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి శీతాకాలంలో వచ్చే అరుదైన పక్షులుగా ఈ బాతులకు మంచి గుర్తింపు ఉంది. భూమికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఎగరడం వీటి ప్రత్యేకత. శీతాకాలంలో కోసిన వరిపొలాలు, చిత్తడి నేలలు వీటికి ఆవాస క్షేత్రాలుగా విలసిల్లుతాయని ప్రముఖ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఉప్పులూరి సురేష్‌కుమార్ తెలిపారు. రోజుకు వందల కిలోమీటర్ల మేర ప్రయాణం చేయడం వీటి ప్రత్యేకత. సాధారణంగా నవంబరులో రావాల్సిన ఈ పక్షులు ఈసారి ఆలస్యంగా డిసెంబరు నెల లో కనిపించినట్టు వివరించారు. ఉప్పునీటి కయ్యలు, మంచినీటి కయ్యలు, నదీతీరాలకు వీటి రాక ఉంటుందని.... అయితే ఆలమూరు మండలంలో ఇవి కనిపించడం ఆనందం కలిగించే విషయమని చెప్పారు.