Share News

బి-ఫారం ఎవరిస్తే వారికే పార్టీ గుర్తండోయ్‌...

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:16 AM

పార్టీ తరుపున అభ్యర్థిగా ప్రకటించారు సరే.. బి-ఫారం తెచ్చుకోనివ్వండి చూద్దాం.. ఇంకా మాకూ సమయం ఉందనే నాయకులు నేటికీ ఎందరో ఉన్నారు.

బి-ఫారం ఎవరిస్తే వారికే పార్టీ గుర్తండోయ్‌...

అభ్యర్థిని ప్రకటించగానే పండుగ కాదు..

బి-ఫారం తెచ్చుకోనివ్వండి చూద్దాం..

ఎ-ఫారం ఉంటేనే బి-ఫారానికి గుర్తింపు

అమలాపురంరూరల్‌, ఏప్రిల్‌ 17: పార్టీ తరుపున అభ్యర్థిగా ప్రకటించారు సరే.. బి-ఫారం తెచ్చుకోనివ్వండి చూద్దాం.. ఇంకా మాకూ సమయం ఉందనే నాయకులు నేటికీ ఎందరో ఉన్నారు. ఎందుకంటే గతానుభవాలే అందుకు నిదర్శనం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరుపున ఓ అభ్యర్థిని ముందుగా ప్రకటించినా చివరి నిమిషంలో మరో అభ్యర్థికి బి-ఫారం ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగని ఎ-ఫారం లేకుండా బి-ఫా రం ఇచ్చే అధికారం ఆ పార్టీ అధినేతకు ఉండదు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్న తరుణంలో బి-ఫారం గురించి మాట్లాడుకోని నాయకులు ఉండరంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అసలు ఎ-ఫారం, బి-ఫారం గురించి తెలుసుకుందాం...

బి-ఫారం ఎవరికి ఇస్తారంటే..

ఎన్నికలు సమయంలో ప్రధాన రాజకీయపార్టీల తరపున ఎంపికైన వ్యక్తిని ఆ పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ అభ్యర్థులు వీరేనంటూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదిస్తూ ఇచ్చేదే బి-ఫారం. నామినేషన్‌ సమయంలో అభ్యర్థులు తమ రాజకీయ పార్టీలు ఇచ్చే బి-ఫారం దాఖలు చేస్తే అతనికి గుర్తింపు పొందిన పార్టీ ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయిస్తోంది. అందుకే పార్టీ అధ్యక్షుడు ఎంపిక చేసిన అభ్యర్థికి బి-ఫారం అందిస్తారు. సాధారణంగా ఎన్నికల బరిలో నిలిచినవారంతా రాజకీయ పార్టీలకు చెందినవారు కాదు. కానీ అభ్యర్థి ఎదైనా ప్రధాన పార్టీ తరపున నామినేషన్‌ వేస్తే ఆ పార్టీ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాల్సి ఉం టుంది. బి-ఫారం పొందిన వ్యక్తికే ఆ పార్టీ గుర్తును ఎన్నికల సంఘం కేటాయిస్తోంది.

బి-ఫారం సమర్పించకపోతే..

పార్టీ తరపున నామినేషన్‌ వేసిన వ్యక్తి సకాలంలో బి-ఫారం సమర్పించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు. ఆ అభ్యర్థికి ఏదో ఒక గుర్తును కేటాయిస్తారు. ఒక్కోసారి ప్రధానపార్టీ అధ్యక్షుడు ఒకరికంటే ఎక్కువ మందికి బి-ఫారాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరిలో ఎవరు ముందుగా బి-ఫారం సమర్పిస్తే వారికే పార్టీ గుర్తును కేటాయిస్తారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఈనెల 25వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ ఎప్పుడువేసినా బి-ఫారం మాత్రం 25వ తేదీ మధ్యాహ్నం 3గంటలలోపు రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అప్పడే వారికి ఆయా పార్టీల అధికారిక గుర్తులు లభిస్తాయి. లేదంటే పార్టీ గుర్తు వారికి గల్లంతే.

పార్టీ అధ్యక్షులకే ఎ-ఫారం..

గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులకు మాత్రమే ఎన్నికల సంఘం ఎ-ఫారం అందిస్తోంది. ఉదాహరణకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లకు ఎన్నికల సంఘం ఎ-ఫారం అందిస్తోంది. ఎ-ఫారం ఉన్నవారు మాత్రమే తమ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులకు బి-ఫారం ఇచ్చే అధికారం కలిగి ఉంటారు.

Updated Date - Apr 18 , 2024 | 07:20 AM