Share News

ఆరోగ్యమిత్రలపై బదిలీ కత్తి

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:01 AM

పేదరికం కారణంగా ఏఒక్కరూ నాణ్యమైన వైద్యానికి దూరం కాకూడదన్న ఉద్దేశంతో అందరికీ ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందేలా మరింత మెరుగ్గా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా పథకంలో రోజురోజుకూ కొత్తమార్పులు తీసుకువస్తున్నారు.

ఆరోగ్యమిత్రలపై బదిలీ కత్తి

పీహెచ్‌సీ ఆరోగ్యమిత్రలకు పూర్తిగా మంగళం

పాడిన వైసీపీ ప్రభుత్వం

సచివాలయ ఏఎన్‌ఎంలకు అదనపు బాధ్యతలు అప్పగింత

ప్రక్షాళన పేరుతో స్థానచలనం?

17ఏళ్లుగా చాలీచాలని జీతాలతో

నెట్టుకొస్తున్న ఆరోగ్యమిత్రలు

పనిచేసే ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే యోచన

పథకం నిర్వీర్యమయ్యే అవకాశం

ఆందోళనలో ఆరోగ్యమిత్రలు

పెద్దాపురం, ఫిబ్రవరి 29: పేదరికం కారణంగా ఏఒక్కరూ నాణ్యమైన వైద్యానికి దూరం కాకూడదన్న ఉద్దేశంతో అందరికీ ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందేలా మరింత మెరుగ్గా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా పథకంలో రోజురోజుకూ కొత్తమార్పులు తీసుకువస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలకు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో కొన్నేళ్లుగా పీహెచ్‌సీల్లో అరకొర వేతనాలతో పనిచేసిన ఆరోగ్యమిత్రలు కనుమరుగయ్యారు. పైగా వారిని నెట్‌వర్క్‌ మిత్రాలుగా మార్పు చేసేశారు. ఇప్పుడు మళ్లీ వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పథకం నిర్వీర్యమైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకంలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలను ఉద్యోగాలనుం చి పొమ్మన కుండా పొగపెడుతోంది వైసీపీ ప్రభుత్వం.ఈఉద్యోగాలనే నమ్ముకుని 17ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రాల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. వారిపై ప్రభుత్వం బదిలీ కత్తిని ప్రయోగించేందుకు సిద్దం అవుతున్నట్ల్లు తెలుస్తోంది. అసలే అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్న వారిపై బదిలీ కత్తిని ప్రయోగిస్తారన్న విషయంతో ఆరోగ్యమిత్రలు అయోమ య ంలో పడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అయినా తమ బతుకులు బాగుపడతాయని ఆశించి భంగపడడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదు. ప్రస్తుతం పనిచేసే ప్రాంతంనుంచి 20 కిలోమీటర్ల పరిధిలో వారిని మార్చేలా ప్రభుత్వం సమాయత్తమవుతునట్లు ఆరోగ్యమిత్ర లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆరోగ్యమిత్రలు గందరగోళంలో పడ్డారు. దీనిపై ఇప్పటికే మిత్రాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరుద్యోగులపై ఇటువంటి బదిలీ ప్రయోగాలు చేయడం ఏంటని వారు లోలోపల రగిలిపోతున్నారు. ఆరోగ్యమిత్రలను బదిలీ చేస్తే పథకం నిర్వీర్యమయ్యే అవకాశం ఉందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

17ఏళ్లుగా చాలీచాలని వేతనాలే..

17 ఏళ్గుగా అరకొర వేతనాలకుపనిచేస్తున్న తాము పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు చాలా కష్టపడ్డామని, గ్రామీణ ప్రాంత రోగులకు సైతం ఉచిత కార్పోరేట్‌ వైద్యాన్ని అందించడానికి తామెంతో చిత్తశుద్ధితో పనిచేసినట్లు ఆరోగ్యమిత్రలు చెబుతున్నారు. తమ కృషివల్ల ఇప్పటివరకూ ఈపథకానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో అవార్డులు వచ్చినట్లు ఆరోగ్యమిత్రలు చెబుతున్నారు. తమకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావించామని, మళ్లీ ఈ బదిలీ ప్రక్రియను తెరమీదకు తీసుకురావడంతో తమకు ఏంచేయాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు.

బదిలీతో పథకం నిర్వీర్యమయ్యే అవకాశం

స్థానికంగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలను ప్రస్తుతం పనిచేసే ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం ద్వారా పథకం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో 200మంది వరకూ ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి 79 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉండగా 80మంది ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ, నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కలిపి 249 ఆస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యమిత్రలు పనిచేసే ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే చాలీచాలని జీతంతో ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనుకావడమే కాకుండా పథకం అమలు మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. తమకు ఇచ్చే వేతనంలో కోతలు మినహాయించుకుంటే తమకు చేతికి అందే రూ.13,500 వేతనంతో తాము సుదూర ప్రాంతాలకు వెళ్లి ఏవిధంగా పనిచేయగలమని, పైగా బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి అని, తమకు టీఏ, డీఏలు సైతం లేవని చెబుతున్నారు. తమను ఈవిధంగా వేధించడం ఎంతవరకూ సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. పథకం విజయవంతంగా కొనసాగాలంటే ఎక్కడున్నవారిని అక్కడే ఉంచి, తమకు పూర్తిస్థాయిలో ఉద్యోగ భధ్రతను కల్పించాలని ఆరోగ్యమిత్రాలు కోరుతున్నారు. పథకంలో మార్పులు చేస్తే సరిపోతుందని ఆరోగ్యమిత్రాలు భావిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నియమితులైన ఆరోగ్యమిత్రలు ప్రజాపథం, రచ్చబండ, తదితర కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించడంతోపాటు ప్రజల్లో పథకానికి మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేశారు. ఆరోగ్యమిత్రలు స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో పథకం మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది.

ట్రస్ట్‌ నిర్ణయం మేరకే ఏ నిర్ణయమైనా..

ట్రస్ట్‌ నిర్ణయం మేరకే ఏదైనా చర్యలు తీసుకోవడం జరుగుతు ంది. ప్రస్తుతం బదిలీల విషయంపై స్పష్టత ఇంకా లేదు. ప్రస్తుతం ఆరోగ్యమిత్రలు ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారన్న విష యంపై వివరాలు సేకరించడం జరుగుతోంది. పీహెచ్‌సీల్లో పనిచేసే ఆరోగ్యమిత్రలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సర్దుబాటు చేశాం. బదిలీ ప్రక్రియపై ఆదేశాలు రావాల్సి ఉంది.

-డాక్టర్‌ ఎ.రాధాకృష్ణ, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌, కాకినాడ

Updated Date - Mar 01 , 2024 | 12:01 AM