జీవో నంబరు 7 ప్రకారమే ఆక్వా చెరువుల అనుమతులు మంజూరు చేయాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:56 PM
ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జీవో నంబరు 7 ప్రకారమే ఆక్వా చెరువుల అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. తీర ప్రాంతం వెంబడి ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లలో ఎంతమేర విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నవి సర్వే ఆధారంగా ఖచ్చితత్వంతో గుర్తించి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్ మ్యాప్‌లతో సహా బృందాలు సర్వే నిర్వహించాలన్నారు.
అమలాపురం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జీవో నంబరు 7 ప్రకారమే ఆక్వా చెరువుల అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. తీర ప్రాంతం వెంబడి ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లలో ఎంతమేర విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నవి సర్వే ఆధారంగా ఖచ్చితత్వంతో గుర్తించి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్ మ్యాప్‌లతో సహా బృందాలు సర్వే నిర్వహించాలన్నారు. కలెక్టరేట్‌లో శనివారం కాలుష్య నియంత్రణ మండలి, భూగర్భ, జలవనరులు, మత్స్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సర్వే బృందాలను నియమించి ఎంతమేర ఏయే జోన్లలో ఆక్వాసాగు జరుగుతుందో క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న చెరువులకు అనుమతులు ఉన్నదీ లేనిదీ, మార్గదర్శకాలను పాటిస్తున్నారో లేదో నివేదికలో పొందుపరచాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 46 వేల ఎకరాల్లో ఆక్వాసాగు ఉండగా ఆక్వాజోన్‌లో లేని 7వేల ఎకరాలకు గ్రామ, మండల, డివిజన్ల వారీగా ఆక్వా జోనేషన్ టైపును నిర్ధారించాలన్నారు. పంటకాల్వలు, నదీ పరివాహక జిల్లాలను మాత్రమే ఆక్వాసాగుకు వినియోగించాల్సి ఉందని, ఉప్పునీటిని భూగర్భ జలాలను వినియోగిస్తుంటే పరిశీలన చేసి నివేదికలో పొందుపరచాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూత్రాల ప్రకారం పెద్దపెద్ద ఆక్వా చెరువులకు చుట్టూ సీఫేజ్ డ్రెయిన్ల ద్వారా ఊటనీరు పారే సౌకర్యంపై ఆరా తీయాలన్నారు. సబ్ డివిజన్ స్థాయి కమిటీ పరిధిలో సంబంధిత ఆర్డీవో ఐదు హెక్టార్లలోపు చెరువులకు అనుమతులు మంజూరు చేస్తూ పైబడిన విస్తీర్ణంలో ఆక్వా చెరువుల అనుమతులు కోరితే కోస్టల్ ఆక్వా అథారిటీ విభాగానికి పంపించాలన్నారు. కోస్టల్ రీజియన్ జోన్ నిబంధనలు పాటిస్తున్నవీ లేనివీ పర్యవేక్షించాలన్నారు. హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్వాసాగులో ఉన్న చెరువుల రద్దుకు సంబంధించి వైనతేయ నదిని ఆనుకుని గొల్లపాలెం, కరవాక, గోగన్నమఠం గ్రామాల్లో కొనసాగుతున్న రద్దు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఇన్‌చార్జి డీఆర్వో కె.మాధవి, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీర్ శంకరరావు, జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు, భూగర్భ జలశాఖ సహాయ సంచాలకుడు శివప్రసాద్, మత్స్య అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.