Share News

పేదింటికి జగన్‌ చెద!

ABN , Publish Date - May 08 , 2024 | 01:14 AM

పేదింటిని జగన్‌ దగా చేశాడు.. కక్షతో చెదలు పట్టించాడు.. ఐదేళ్ల కిందట తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 80 నుంచి 90 శాతం నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయించాడు..

పేదింటికి జగన్‌ చెద!
చూడు..గూడు : నిడదవోలులో శిథిలావస్థకు చేరిన టిడ్కో ఇళ్లు

టీడీపీ కట్టిందన్న కక్షతో తీవ్ర నిర్లక్ష్యం

శిథిలమవుతున్న టిడ్కో అపార్ట్‌మెంట్లు

సొంతిల్లు సమకూరిందన్న ఆనందం ఆవిరి

లబ్ధిదారుల అవస్థలు

వైసీపీ పగ ఫలితమిది

పేదింటిని జగన్‌ దగా చేశాడు.. కక్షతో చెదలు పట్టించాడు.. ఐదేళ్ల కిందట తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 80 నుంచి 90 శాతం నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయించాడు.. నాలుగేళ్ల తరువాత తాపీగా ఎన్నికల వేళ లబ్ధిదారులకు ఇచ్చారు. ఏదో అంతా మేమే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు.. అసలు విషయం చూస్తే.. అధికారం చేపట్టిన వైసీపీ కేవలం టీడీపీ ప్రభుత్వం కట్టిందన్న కక్షతో ఆ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా నాలుగేళ్ల పాటు ఆటలాడుకుంది. దాంతో గోడలు పగుళ్లివ్వడం, విద్యుత్‌ వైర్లు, పరికరాలు చోరీకి గురికావడం, గుమ్మాలు, ఇతర సామగ్రి దెబ్బతినడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇప్పుడు అపార్ట్‌మెంట్లల్లోకి గృహప్రవేశం చేసినవారు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. సౌకర్యాలు లేక, దుర్గంధపూరిత వాతావరణంలో ఉండలేక అవస్థలు పడుతున్నారు.

పిఠాపురాన వసతుల లేమి..

పిఠాపురం, మే 7: పేదలను జగన్‌ దగా చేశాడు.. ఒక్క ఛాన్స్‌ అంటే నమ్మి గెలిపిస్తే వారికే పంగనామాలు పెట్టాడు. పూర్లయిన ఇళ్లకు నాలుగేళ్లు చెదలు పట్టించాడు.. చివరికి రేపుమాపూ అంటూ ఎన్నికల వేళ నాలుగేళ్ల తరువాత ఇచ్చాడు. అయితే ప్రస్తుతం కొంత మంది పేదల్లో సొంతింటిలోకి వచ్చామన్న ఆనందం మచ్చుకైనా కానరావడం లేదు. అద్దె ఇంట్లోనే ఉంటే బాగుండేది. లక్షలాది రూపాయలు వడ్డీ రూపంలో నష్టపోయి కష్టాలు కొని తెచ్చుకున్నామన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని టిడ్కో అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న వారందరి పరిస్థితీ ఇదే. కనీస నిర్వహణ లేక.. సమస్యలు ఎవ్వరు పట్టించుకోక వారు ఇబ్బందులకు గురవుతున్నారు. పిఠాపురం-గోర్స రోడ్డులో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 864 అపార్ట్‌మెంట్లు నిర్మించారు. వీటిని మూడు రకాల విస్తీర్ణాల్లో నిర్మించి లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో అపా కేటాయించారు.ఈలోగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాలుగేళ్ల పాటు వాటిని పట్టించుకోకుండా వదిలేశారు. ఇటీవల 441 మంది లబ్థిదారులు రుణాలు పొందేందుకు అర్హత పొందగా, అందులో 350 మందికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి అపార్ట్‌మెంట్లు అప్పగించారు. కనీస వసతుల్లే ఇబ్బందులు పడుతున్నారు.

రామచంద్రపురాన చెదలు

రామచంద్రపురం (ద్రాక్షారామ), మే 7: పేదలకు తక్కువ ఖర్చుతో గృహాలు అందించాలన్న ఉన్నతాశయానికి చెదలుపట్టింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో గృహ నిర్మాణాలు పూర్తయినప్పటికీ తదుపరి మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించకపోవడంతో ఇప్పటికీ పలు ఫ్లాట్లు లబ్ధిదారులకు అందలేదు. రామచంద్రపురంలో తొలివిడత నిర్మించిన 1098 ప్లాట్లలో చాలా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తలుపులు, గుమ్మాలు పూర్తిగా చెదలుపట్టి ఊడిపడిపోయాయి. బ్యాంకు రుణాలకు డాక్యుమెంటేషన్‌ పూర్తికాకపోవడం, వివిధ కారణాలతో ఫ్లాట్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు. దీంతో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న గృహాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. అయినా పట్టించుకునేవారే లేరు.

పెద్దాపురం, సామర్లకోటలో ఇళ్లెప్పుడిస్తారో..

సామర్లకోట/పెద్దాపురం, మే 7 : పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం,సామర్లకోట పట్టణాల్లో 4,368 టిడ్కో గృహాలు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. రెండు పట్టణాల్లోనూ లబ్ధిదారులు గత ప్రభుత్వ హయాంలోనే సామూ హిక గృహప్రవేశాలు చేసుకున్నారు. ఈలోపు ఎన్నికలు రావ డంతో లబ్ధిదారులకు స్వాధీనం చేయలేకపోయారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు అప్పగించ కుం డా తాత్సారం చేసింది. సామర్లకోటలో జగ్గమ్మగారిపేట లేఅవుట్‌ లో 272 ఫ్లాట్‌లు, ఉప్పువారి సత్రం వద్ద 361 ఫ్లాట్‌లు నిర్మిం చారు. వీటిలో ఇప్పటివరకూ కేవలం 33 ఫ్లాట్‌లను మాత్రమే లబ్ధిదారులకు స్వాధీనపరిచారు. పెద్దాపురం పట్టణ శివారు వాలు తిమ్మాపురం వెళ్లే రహదారిలో మొదటి విడతలో 1728, రెండో విడతలో 1585 ఇళ్లు నిర్మాణాలను చేపట్టారు. మొదటి విడతలో నిర్మించిన ఇళ్లలో 1460 మందికి మాత్రమే పంపిణీ చేశారు. మిగిలినవాటిని ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. ఆయా గృహసముదాయాల్లో మౌలిక వసతులను పూర్తిగా విస్మరిం చారు. పైగా నిర్వహణ పూర్తిగా గాలికొదిలేశారు.

రాజమహేంద్రవరంలో దగా..దగా..

రాజమహేంద్రవరం మే 5 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ హయంలో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు అప్పగించడంలో వైసీపీప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. ఇళ్ళు 2019లోనే పూర్తయినా లబ్ధిదారులకు ఇటీవలే కొన్ని అప్పగించారు. మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు. ఇళ్ళలోకి దిగకుండానే బ్యాంక్‌ వాయిదాలు చెల్లించాలి నోటిసులు ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 16,304 నిర్మించగా ఇంత వరకు వంద మంది మాత్రమే ఇళ్ళలో ఉన్నారు. ఇళ్ళలో లేనివారికి బ్యాంక్‌ నోటీసులివ్వడం గమనార్హం. నిడదవోలు 1158 ఇళ్లు, కొవ్వూరులో 480 ఇళ్లు నిర్మించినా లబ్ధిదారులకు అప్పగించలేదు.

అల్లవరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

అల్లవరం, మే 7: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రులోని టిడ్కో భవనాల్లో సమస్యలు తిష్ఠవేశాయి. ఇక్కడ రూ.113 కోట్లతో 2019 ఫిబ్రవరి 9న టిడ్కో భవనాలు ప్రారంభించారు. 1,632 కుటుంబాలు నివసించేలా భవనాలు నిర్మించినా 545 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. తాగునీటి సమస్య అధికంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు పారట్లేదు. వర్షాకాలంలో వైనతేయ వరదనీరు పోటెత్తడంతో రోడ్లు మునుగు తున్నాయి. సి-6 భవనంలో స్లాబ్‌ లీకేజీ అవుతోంది. అసాంఘిక కార్యకలపాలకు కొన్ని ప్లాట్లు అడ్డాగా మారాయి.

నిడదవోలులో ఐదేళ్లుగా ఇంతే!

నిడదవోలు, మే 7: గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదలందరికీ గృహాలు అందించాలనే లక్ష్యంతో నిడదవోలు పట్టణం తీరుగూడెం సమీపంలో 2017-18 సంవత్సరంలో 1152 మందికి టిడ్కో గృహాలు నిర్మించారు. నిర్మాణాలు పూర్తి కావొ స్తున్న దశలో లబ్ధిదారులకు ఇళ్ళ కేటాయింపులు చేశారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే టిడ్కో గృహాల నిర్మాణాల పనులు నిలిచిపోయాయి. నేటికీ లబ్ధిదారులకు అందించకపోవడంతో శిఽథిలావస్థకు చేరాయి. టిడ్కో గృహాల కోసం పేదలైన లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

Updated Date - May 08 , 2024 | 01:14 AM