Share News

మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లిఅబ్బాయిరెడ్డి కన్నుమూత

ABN , Publish Date - May 29 , 2024 | 12:22 AM

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లిఅబ్బాయిరెడ్డి(70) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు.

మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లిఅబ్బాయిరెడ్డి కన్నుమూత

కొత్తపల్లి, మే 28: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లిఅబ్బాయిరెడ్డి(70) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన బుల్లి అబ్బాయిరెడ్డి తొలుత 1987లో కొత్తపల్లి ఎంపీపీగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంపర ఎమ్మెల్యేగా టిక్కెట్‌ రావడంతో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 2004లో రెండోసారి సంపర నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వైఎస్‌తో సత్సంబంధాలు ఉండటంతో రాజమండ్రి ఆర్టీసీ రీజినల్‌ చైర్మన్‌గా కూడా పనిచేశారు. బుల్లిఅబ్బాయిరెడ్డి చదువుకోకపోయినా విద్యాభివృద్ధి కోసం మృతిచెందిన తన కుమారుని పేరుతో కొత్తపల్లిలో వీవీఎస్‌ విద్యా సంస్థలను ప్రారంభించి అనేక మంది పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించారు. అనారోగ్యంతో గత కొంత కాలంగా ఆయన వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం నాగులాపల్లిలో ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఎమ్మెల్యేకు భార్య, కుమారుడు, ఇద్దరు మనవళ్లు ఉన్నారు. బుల్లిఅబ్బాయిరెడ్డి మృతితో కొత్తపల్లి మండలంలో విషాదఛాయలు అలముకున్నాయి.

బుల్లిఅబ్బాయిరెడ్డి మృతికి సంతాపం:

సంపర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టిబుల్లిఅబ్బాయిరెడ్డి మృతికి పలువురు ప్రముఖులు తీవ్రసంతాపం తెలియజేశారు. కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌, ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌, కాకినాడ రూరల్‌ మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, పలువురు అధి కారులు బుల్లిఅబ్బాయిరెడ్డి పార్దివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అదే విధంగా కొత్తపల్లి మండలానికి చెందిన పలువురు ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి మృతికి సంతాపం తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 12:22 AM