సంజాయిషీలకూ..షాక్!
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:45 AM
రాష్ట్రవ్యాప్తంగా లక్షమందికి పైగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా అని అంగన్‌వాడీలు మండిపడ్డారు. గత 37 రోజులుగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 17 : రాష్ట్రవ్యాప్తంగా లక్షమందికి పైగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా అని అంగన్‌వాడీలు మండిపడ్డారు. గత 37 రోజులుగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు బుధవారం రాజమహేంద్రవరం, కొవ్వూరులో ఐసీడీఎస్ కార్యాలయాలకు వెళితే సీడీపీవో కార్యాలయం సిబ్బంది రిప్లయ్ తీసుకోవడానికి నిరాకరించారు. దీనిపై అంగన్‌వాడీలు మండిపడ్డారు. మా ఓట్లతో గెలిచి మాపై పెత్తనమేంటని.. సీఎం జగన్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎంత సేపటికి కార్యాలయ సిబ్బంది పట్టించుకోకపోవడంతో రాజ మహేంద్రవరంలో ఐసీడీఎస్ కార్యాలయం గోడలకు సమాధాన పత్రాలు అతికించారు. షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ వేచి ఉన్నా సిబ్బంది స్పందించకపోవడంతో షోకాజ్‌లకు రిప్లయ్‌లను కార్యాలయం గోడలకు అతికించి వెనుదిరిగామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజమహేంద్రవరం ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు శారద, సునీత తెలిపారు. దీనిపై సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో నోటీసులపై రిప్లయ్‌లు తీసుకుంటుంటే ఇక్కడ మాత్రం ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ, జిల్లా కమిటీ సభ్యుడు పవన్ తదితరులు పాల్గొన్నారు.