Share News

అంబేడ్కర్‌ విగ్రహ శిలాఫలకం ధ్వంసం

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:43 AM

అనపర్తి కెనాల్‌ రోడ్డులో ఇటీవల ప్రారంభమైన బీఆర్‌ అంబేడ్కర్‌, జ్మోతిరావు పూలే విగ్రహాల శిలాఫలకాలు వివాదాస్పదంగా మారాయి. శుక్రవారంరాత్రి దుండగులు అంబేడ్కర్‌ విగ్రహానికి ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహ శిలాఫలకం ధ్వంసం

నాయకుల పేర్లపై వివాదం

ఆవిష్కరణ సమయంలోనే శిలాఫలకం మాయం

అనపర్తి జనవరి 13: అనపర్తి కెనాల్‌ రోడ్డులో ఇటీవల ప్రారంభమైన బీఆర్‌ అంబేడ్కర్‌, జ్మోతిరావు పూలే విగ్రహాల శిలాఫలకాలు వివాదాస్పదంగా మారాయి. శుక్రవారంరాత్రి దుండగులు అంబేడ్కర్‌ విగ్రహానికి ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గత నెల 30న అంబేడ్కర్‌, పూలే విగ్రహాల ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేసి ఫూలే విగ్రహానికి ప్రారంభకులు ఎంపీ భరత్‌రామ్‌, శిలాఫలక ఆవిష్కరణ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్లను, అంబేడ్కర్‌ విగ్రహానికి ప్రారంభకులు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌, శిలాఫలకం ఆవిష్కరణ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రారంభోత్సవం ముందురోజు రాత్రి అంబేడ్కర్‌ విగ్రహంవద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకం మాయ మైంది. మాజీ ఎమ్మెల్యే పేరు ఉన్నందునే దానిని మాయం చేశారని ఒక వర్గం ఆరోపించింది. దీంతో శిలాఫలకం ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటుచేసి ప్రారంభోత్సవం పూర్తిచేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి శిలాఫలకం ఏర్పాటుచేశారు. అయితే దానిని శుక్రవారం రాత్రి దుండగులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీఐ శివగణేష్‌, ఎస్‌ఐ రామారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి శిలాఫలకం ధ్వంసమైన ప్రాంతం లో ప్లాస్టిక్‌ కవర్‌ను కప్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటుచేశారు. కాగా శిలాఫలకం ధ్వంసంపై నల్లా చిన్నారావు, పచ్చిమళ్ల వెంకటరమణ విడివిడిగా ఫిర్యాదులు చేశారని, కోర్టు అనుమతితో కేసులు నమోదు చేస్తామని సీఐ చెప్పారు.

Updated Date - Jan 14 , 2024 | 06:47 AM