Share News

అధినేతలు ఆగయా..

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:24 AM

జిల్లాలో ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతల వరుస పర్యటనలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేడెక్కుతోంది. ముంచుకొస్తున్న అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ముందే తెచ్చేస్తోంది.

అధినేతలు ఆగయా..

నేడు సీఎం జగన్‌ కాకినాడ రాక

రేపు పవన్‌ కాకినాడకు రాక: మూడు రోజులు అక్కడే మకాం

10న తుని రానున్న టీడీపీ అధినేత చంద్రబాబు:లక్ష మందితో సభ

(కాకినాడ,ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతల వరుస పర్యటనలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేడెక్కుతోంది. ముంచుకొస్తున్న అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ముందే తెచ్చేస్తోంది. ఇందుకు నిదర్శనమే జిల్లాలో సీఎం జగన్‌, జనసేన అధినేత పవన్‌, టీడీపీ అధినేత చంద్రబాబుల వరుస పర్యటనలు.. సభలు నిర్వహిస్తున్న తీరు. రోజుల వ్యవధిలోనే ఈ ముగ్గురు అధినేతలు జిల్లాలోకి అడుగుపెట్టబోతున్నారు. అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన సంక్షేమంపై చెప్పుకోవడానికి సీఎం జగన్‌ నేడు కాకినాడ పర్యటిస్తుండగా, ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తుతూ పోరాడుతున్న జనసేన అధినేత పవన్‌ ఈనెల 4న, టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 10, 20, 27 తేదీల్లో మూడు పార్లమెంట్‌ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. దీంతో ఈ మూడు పార్టీల రాజకీయ కార్యకలాపాలతో హోరెత్తనుంది.

సీఎం వస్తున్నారు...జనాన్ని తీసుకురండి

సీఎం జగన్‌ బుధవారం కాకినాడ నగరంలో పర్యటించనున్నారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయలుదేరి 10.20 గంటలకు కాకినాడ పోలీస్‌ పరేడ్‌ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు షో ద్వారా 10.40 గంటలకు రంగరాయ మెడికల్‌ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. అనంతరం వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక నిధులను జగన్‌ విడుదల చేస్తారు. ఈనెల నుంచి రూ.3 వేల పెన్షన్‌ డబ్బులను చెల్లిస్తున్న నేపథ్యంలో దాన్ని ప్రచారం చేసుకోవడానికి వీలుగా అక్కడే భారీ బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు. తిరిగి 12 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ గంటపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. బహిరంగ సభకు ముందు కాకినాడ నగరంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం జగన్‌ ప్రారంభోత్సవాలను చేయనున్నారు. సభావేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను జగన్‌ ఆవిష్కరిస్తారు. కాగా సీఎం జగన్‌ సభకు వేలల్లో జనాలను తరలించేందుకు ప్రభుత్వం అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి జనాలను తరలించేందుకు పార్టీ నేతలు, అధికారులకు టార్గెట్లు విధించింది. ప్రధానంగా వలంటీర్లు అయితే తమ పరిధిలోని పింఛన్‌దారులను బెదిరిస్తూ ఆడియో మెసేజ్‌లు పంపారు. తమ సమీపంలోని సచి వాలయాలకు పెన్షన్‌దారులు బుధవారం ఉదయం ఏడుకు చేరుకోవాలని, అక్కడి నుంచి సీఎం సభకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. రాకపోతే పెరిగిన పెన్షన్‌ డబ్బులు అందవని కూడా హెచ్చరించారు. ఈ మేరకు కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో ఓ వలంటీర్‌ బెదిరింపుల ఆడియో బయటకు లీకైంది. మరోపక్క ప్రతిపక్ష టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు ఒక్క బస్సు కూడా అద్దెకు ఇవ్వని ఆర్టీసీ, సీఎం సభ కోసం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి 318 బస్సులను పంపుతోంది. ఆయా జిల్లాల నుంచి సీఎం సభ కోసం ఇవన్నీ బుధవారం ఉదయం కాకినాడకు చేరుకోనున్నాయి.

మూడు రోజులు పవన్‌ ఇక్కడే...

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈనెల 4న కాకినాడకు రానున్నారు. మూడు రోజుల పాటు ఓ ప్రైవేటు అతిఽథిగృహంలో బసచేయనున్నారు. తొలిరోజు కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి 28 వార్డులపై విడివిడిగా సమీక్షించనున్నారు. ఆ తర్వాత కాకినాడ రూరల్‌, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12 నియోజకవర్గాలపై సమీక్షిస్తారు. వాస్తవానికి గత నెల 27 నుంచి పవన్‌కల్యాణ్‌ కాకినాడలో మూడు రోజులు మకాం వేశారు. కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై కూలంకుష సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై సమీక్షించారు. ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది? ఎక్కడ ఇంకా పార్టీ మరింత బలోపేతం అవ్వాలి? అనేదానిపై ఇంఛార్జులతో సమీక్షించారు. ఆ తర్వాత మరో రెండు రోజులు ఏకంగా కాకినాడ సిటీ నియోజకవర్గంపై సమీక్షించారు. తద్వారా కాకినాడ సిటీ నుంచి అసెంబ్లీకి పవన్‌ పోటీ చేస్తారనే ప్రచారానికి మరింత బలం కల్పించారు. తిరిగి మళ్లీ ఈనెల 4 నుంచి మూడు రోజులు ఇక్కడే మకాం వేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. పవన్‌ కాకినాడలో ఉన్నప్పుడే జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆయన్ను కలిశారు. దీంతో వైసీపీ వర్గాలకు భారీ షాక్‌ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే నేరుగా పవన్‌ కలవడం జనసేనలో చేరడానికేననే ప్రచారం బలపడింది. అయితే రెండో విడత కాకినాడకు పవన్‌ వస్తున్న నేపథ్యంలో ఈసారి వైసీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారోననే భయం అధికార పార్టీకి కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను వైసీపీ తప్పించాలని నిర్ణయించింది. వీరిలో ఒకరు ఇప్పటికే పవన్‌ను కలవగా, మిగిలిన ఇద్దరిలో ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

లక్ష మందితో దద్దరిల్లేలా...

టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 10న తునికి వస్తున్నారు. ఆరోజు లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. జగన్‌ ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభల ద్వారా విరుచుకుపడుతున్న చంద్రబాబు అందులోభాగంగా కాకినాడ పార్లమెంట్‌కు సంబంధించి సభను తునిలో నిర్వహిస్తున్నారు. తొలుత పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటన ఖాయం అయినా ఆ తర్వాత వేదిక తునికి మార్చారు. ఆరోజు కాకినాడ జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షమందికిపైగా తునికి చేరుకునేలా జిల్లా టీడీపీ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి సంక్రాంతి తర్వాత సభ నిర్వహించాలని భావించారు. కానీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో వాయిదా వేయకుండా సభ జరపాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. మరోపక్క డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం పార్లమెంట్‌ పరిధిలో సభను మండపేటలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు జనవరి 20వ తేదీ ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలో గోపాలపురంలో ఈనెల 27న చంద్రబాబు బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించనున్నారు. కాగా ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రభంజనం సృష్టించింది. పార్టీలో ఎనలేని ఉత్సాహాన్ని నింపి క్యాడర్‌లో విజయోత్సాహాన్ని నింపింది. తిరిగి స్కిల్‌ కేసులో అక్రమంగా అరెస్టై బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మళ్లీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుండడం విశేషం.

Updated Date - Jan 03 , 2024 | 12:24 AM