Share News

25 నాటికి కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 19 , 2024 | 01:24 AM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈనెల 25 నాటికి కౌంటింగ్‌ రూమ్‌ల ఏర్పాట్లు పూర్తిచేయడం జరుగుతుందని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తెలిపారు.

25 నాటికి కౌంటింగ్‌  ఏర్పాట్లు పూర్తి
చెయ్యేరులో పార్కింగ్‌ స్థలాలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, ఎస్పీ శ్రీధర్‌

నాలుగు పార్కింగ్‌ స్థలాల గుర్తింపు : కలెక్టర్‌

అమలాపురం టౌన్‌, మే 18: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈనెల 25 నాటికి కౌంటింగ్‌ రూమ్‌ల ఏర్పాట్లు పూర్తిచేయడం జరుగుతుందని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తెలిపారు. జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చెయ్యేరు శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాల పరిసర ప్రాంతాల్లో శనివారం వాహనాల పార్కింగ్‌ ప్రదేశాల ఎంపిక ప్రక్రియను జిల్లా ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌తో కలిసి కలెక్టర్‌ చేపట్టారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బంది, పోటీలో ఉన్న అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, ఇతర సిబ్బంది వాహనాల పార్కింగ్‌ కోసం ఆరు పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. ఇప్పటివరకు నాలుగు పార్కింగ్‌ స్థలాలను ఎంపిక చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాలలో పార్లమెంటు నియోజకవర్గంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల స్ర్టాంగ్‌ రూమ్‌ల సీల్డులను ఎస్పీతో కలిసి తొలుత ఆయన పరిశీలించారు. అనంతరం స్ర్టాంగ్‌ రూమ్‌లకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు రోజున పౌర జీవనానికి ఏవిధమైన ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జి.కేశవర్థనరెడ్డి, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

జూన్‌ 6 వరకు సెక్షన్‌ 144 అమలు..

శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లావ్యాప్తంగా సెక్షన్‌ 144 అమలులో ఉంటుందని కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షుశుక్లా తెలిపారు. స్ర్టాంగ్‌రూమ్‌ల కౌంటింగ్‌ కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యలు, సంఘటనలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున జూన్‌ 6 వరకు ప్రజా ప్రశాంతత కోసం సెక్షన్‌ 144 అమలు చేస్తున్నట్టు తెలిపారు. పోలింగ్‌ అనంతరం పలు జిల్లాల్లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ప్రశాంత జీవనానికి విఘాతం కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెక్షన్‌ 144 అమలు చేస్తున్నారన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కౌంటింగ్‌ కేంద్రం నుంచి 200 మీటర్ల పరిధిలో మారణాయుధాలు, నలుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడి ఉండరాదని, ఊరేగింపులు నిర్వహించరాదని ఆదేశించారు.

Updated Date - May 19 , 2024 | 08:22 AM