Share News

ఆంధ్రకు వచ్చేయండి.. రెండు నెలల్లో మేం సిద్ధం!

ABN , Publish Date - Apr 13 , 2024 | 06:05 AM

‘రెండు నెలల్లో మేం సిద్ధంగా ఉంటాం. ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చేయండి’ అని అమెరికాకు చెందిన ప్రఖ్యాత టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌కు టీడీపీ యువ నేత లోకేశ్‌ ఆహ్వానం పలికారు...

ఆంధ్రకు వచ్చేయండి.. రెండు నెలల్లో మేం సిద్ధం!

ఎలాన్‌ మస్క్‌కు లోకేశ్‌ ఆహ్వానం.. ఇక్కడి యువతలో నైపుణ్యం..

2 నెలల్లో టెస్లాకు స్వాగతం: యువనేత

కోయంబత్తూరులో తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ

అమరావతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ‘రెండు నెలల్లో మేం సిద్ధంగా ఉంటాం. ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చేయండి’ అని అమెరికాకు చెందిన ప్రఖ్యాత టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌కు టీడీపీ యువ నేత లోకేశ్‌ ఆహ్వానం పలికారు. మస్క్‌ భారత పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ‘మీరు భారత పర్యటనకు రాబోతుండడం ఆనందంగా ఉంది. 2017లో నా తండ్రి, నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీతో సమావేశమై చర్చించారు. మీరు ఆ సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తి చూపించారు. ఏపీ మీకు సరైన గమ్యస్థానం. ఇక్కడ నైపుణ్యమున్న యువత, అపరిమిత సహజవనరులు ఉన్నాయి. మీ విద్యుత్‌ ఆకాంక్షలు నెరవేరడానికి మా రాష్ట్రం సహాయపడుతుంది. టెస్లాకు స్వాగతం పలకడానికి 2నెలల్లో మేం తయారుగా ఉంటాం’ అని పేర్కొన్నారు.

తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్‌ సమావేశం

కోయంబత్తూరులో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్‌ శుక్రవారం ఉదయం అక్కడ సమావేశమయ్యారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు మద్దతుగా సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్‌లో జరిగిన భేటీలో ఆయన పాల్గొన్నారు. అన్నామలైను లోకేశ్‌ మంగళగిరి శాలువాతో సత్కరించగా.. ఆయన లోకేశ్‌ను కోయంబత్తూరు శాలువాతో సన్మానించారు. మంచి నాయకత్వం ఉంటే చెన్నై నగరం హైదరాబాద్‌ను మించిపోయేదని, కానీ అటువంటి నాయకత్వం కొరవడటం వల్ల అంత దూసుకెళ్లలేకపోయిందని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. ‘అన్నామలై ఐపీఎస్‌ వదులుకుని వచ్చారు. అభివృద్ధిని సాధించగల పట్టుదల ఉంది. ఆయనకు అవకాశం ఇస్తే కోయంబత్తూరులో మౌలిక వసతులు అభివృద్ధి చేసి మరో ముందడుగు వేయిస్తారు. ఆయనకు ఆ అవకాశం ఇవ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. లోకేశ్‌ తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో సమస్యలను బాగా అధ్యయనం చేశారని, ఆయన యాత్ర తనకు స్ఫూర్తి అని అన్నామలై చెప్పారు. కాగా.. బీజేపీ ఎంపీ, బెంగుళూరు దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి తేజస్వి సూర్య శుక్రవారం ఉదయం కోయంబత్తూరులో లోకేశ్‌ను కలిశారు. తన తరఫున ప్రచారానికి బెంగుళూరు రావాలని ఆహ్వానించారు. ‘బెంగుళూరులో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నారు. ఐటీ ఉద్యోగులు, తెలుగు యువతరంలో మీకు చాలా పేరు ఉంది. తెలుగువారితో సమావేశం అయినప్పుడు వారి వద్ద మీ పేరు చాలాసార్లు విన్నాను. మీరు నా తరఫున ప్రచారానికి రావాలని నా కోరిక. ఏదో ఒక సమయంలో వీలు చేసుకోండి’ అని కోరారు. అందుకు లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆంధ్రలో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. ‘మాకీ ఎన్నికలు చాలా కీలకం. ఏమీ అనుకోవద్దు. అంత సమయం ఇవ్వగలిగే పరిస్థితిలో లేను’ అని చె ప్పారు.

ప్రజాప్రభుత్వంలో పోలీసులను ఆదుకుంటాం: లోకేశ్‌

అమరావతి, బెంగళూరు, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్‌ సోదరులను ఆదుకుంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మాట ఇచ్చారు. విశాఖపట్నంలో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ శంకరరావు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌ శంకరరావు స్మృతికి నివాళులర్పిస్తూ, అతని కుటుంబ సభ్యులకు శుక్రవారం ఎక్స్‌ వేదికగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎండనక, వాననక.. రేయింబవళ్లు శ్రమిస్తూ, పోలీస్‌ సోదరులు శాంతిభద్రతలు కాపాడుతున్నారు. వారికి రావాల్సిన టీఏ, డీఏ తదితరాలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సరెండర్‌ లీవ్‌, అడిషనల్‌ సరెండర్‌ లీవ్‌ బకాయిలు కూడా నెలల తరబడి ఇవ్వకుండా వేధించడం విచారకరం’ అని లోకశ్‌ అన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 06:05 AM