Share News

టీడీపీ కార్యకర్తపై వైసీపీ శ్రేణుల దాడి

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:16 AM

కుప్పంలో వైసీపీ ఆగడాలు మితిమీరుతున్నాయి. కౌంటింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ నేతలు పెట్రేగి టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు.

టీడీపీ కార్యకర్తపై వైసీపీ శ్రేణుల దాడి
దాడిలో గాయపడ్డ జయశంకర్‌ నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుంటున్న పోలీసులు

ఫ తాగునీటి బకాయి అడిగినందుకు దౌర్జన్యం

కుప్పం, జూన్‌ 1: కుప్పంలో వైసీపీ ఆగడాలు మితిమీరుతున్నాయి. కౌంటింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ నేతలు పెట్రేగి టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. కుప్పం మండలం ఎన్‌.కొత్తపల్లెలో ఇంటికి ట్యాంకర్‌ ద్వారా సరఫరా చేసిన తాగునీటి బిల్లు బకాయి అడిగినందుకు అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే టీడీపీ కార్యకర్తపై దాడిచేసి గాయపరిచారు. అడ్డువచ్చిన రెడ్డి అనే మరో కార్యకర్తపైనా దాడికి తెగబడి రక్తం కారేలా కొట్టారు. బాధితుల కథనం మేరకు.. కుప్పం మండలం ఎన్‌.కొత్తపల్లె గ్రామ నివాసి జయశంకర్‌ వ్యవసాయంతోపాటు సొంతంగా ట్రాక్టర్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామవాసి అయిన వైసీపీ కార్యకర్త బాలకృష్ణకు ఆయన సుమారు వారం రోజుల క్రితం ట్యాంకర్‌ ద్వారా తాగునీటిని, భవన నిర్మాణానికి అవసరమయ్యే కడగాళ్ల రాళ్లను అప్పుగా సరఫరా చేశాడు. దీనికి సంబంధించి రూ.7 వేలు బాలకృష్ణ బాకీపడ్డాడు. గతనెల 31వ తేదీన జయశంకర్‌ బకాయి నగదు చెల్లించాల్సిందిగా కోరాడు. నగదు ఇవ్వకపోగా జయశంకర్‌ను బాలకృష్ణ దుర్భాషలాడాడు. ఈ విషయాన్ని జయశంకర్‌ గ్రామపెద్ద కృష్ణప్ప దృష్టికి తీసుకెళ్లాడు. తాను మాట్లాడతానని చెప్పడంతో జయశంకర్‌ నిమ్మకంపల్లె వద్ద ఉండే పొలం వద్దకు వెళ్లిపోయాడు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాలకృష్ణ తన సోదరులతో కలిసి పొలం వద్దకు వచ్చారు. జయశంకర్‌ను దుర్భాషలాడారు. ‘మా ఇంటికి వచ్చి డబ్బులు అడగడానికి నీకు ఎంత ధైర్యం’ అంటూ ముఖంమీద పిడిగుద్దులు కురిపించారు. దుడ్దు కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం మోటారు సైకిల్‌పై ఎన్‌.కొత్తపల్లెకు తీసుకొచ్చారు. అక్కడ మరోసారి దాడిచేసి, తీవ్రంగా గాయపరిచారు. అడ్డుకోబోయిన మరో టీడీపీ కార్యకర్త రెడ్డెప్పపై దాడిచేశారు. ప్రస్తుతం బాధితులు జయశంకర్‌, రెడ్డిలు కుప్పం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 02 , 2024 | 01:16 AM