Share News

‘వైసీపీ’ తీరు మారలేదు

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:01 AM

ఒకవైపు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. కనీసం జాతరలు, ఊరేగింపులు వంటివాటి నిర్వహణకు కూడా ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా వైసీపీ వారి తీరు మారలేదు. ఏకంగా అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు చేసేస్తున్నారు. దళితుల ఓట్లను ఆకర్షించడానికి దొడ్డిదారులు వెదుకుతున్నారు.

‘వైసీపీ’ తీరు మారలేదు
నూలుకుంటలో నిర్మిస్తున్న సిమెంటు దిమ్మె

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసిన స్థానికులు

కుప్పం, ఏప్రిల్‌ 13: ఒకవైపు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. కనీసం జాతరలు, ఊరేగింపులు వంటివాటి నిర్వహణకు కూడా ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా వైసీపీ వారి తీరు మారలేదు. ఏకంగా అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు చేసేస్తున్నారు. దళితుల ఓట్లను ఆకర్షించడానికి దొడ్డిదారులు వెదుకుతున్నారు. కుప్పం మండలం నూలుకుంట గ్రామంలో శనివారం ఉదయం నుంచే సిమెంటు దిమ్మెను కొంతమంది నిర్మించడం ప్రారంభించారు. మధ్యాహ్నానికి నిర్మాణం పూర్తయ్యింది. ఇది ఎందుకని కొందరు గ్రామస్తులు ఆరా తీస్తే.. అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్ఠకోసం వైసీపీ నేతలు కొందరు ఈ సిమెంటు దిమ్మెను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల్‌ కోడ్‌ అమల్లో ఉండగా విగ్రహాలను ఎలా ప్రతిష్ఠిస్తారని వారు అభ్యంతరం తెలిపినా నిర్మాణం ఆగలేదు. దీనిపై వారు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జి.శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై రిటర్నింగ్‌ అధికారిని వివరణ కోరగా, నూలుకుంటలో విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు తమకు కూడా అందిందని చెప్పారు. అలా చేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Apr 14 , 2024 | 01:01 AM