Share News

ఆరుచోట్ల వైసీపీకి కొత్త ఇన్‌ఛార్జులొచ్చారు!

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:16 AM

ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో అధికార పార్టీ ఆరుచోట్ల ఇంఛార్జులను మార్చింది. వైసీపీ గురువారం రాత్రి విడుదల చేసిన మూడో జాబితా మేరకు ఆరుగురు సిట్టింగులకు టికెట్లు గల్లంతైనా అందులో ముగ్గురికి పార్టీ అధిష్ఠానం ప్రత్యామ్నాయం చూపింది.

ఆరుచోట్ల వైసీపీకి కొత్త ఇన్‌ఛార్జులొచ్చారు!
గురుమూర్తి - ఆదిమూలం - మేరిగ మురళీధర రావు - నిస్సార్‌ అహ్మద్‌ - సునీల్‌కుమార్‌ - విజయానందరెడ్డి

తిరుపతి, ఆంధ్రజ్యోతి: ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో అధికార పార్టీ ఆరుచోట్ల ఇంఛార్జులను మార్చింది. వైసీపీ గురువారం రాత్రి విడుదల చేసిన మూడో జాబితా మేరకు ఆరుగురు సిట్టింగులకు టికెట్లు గల్లంతైనా అందులో ముగ్గురికి పార్టీ అధిష్ఠానం ప్రత్యామ్నాయం చూపింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి బదిలీ కాగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి పార్లమెంటుకు బదిలీ అయ్యారు. చిత్తూరు సిట్టింగు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు రాజ్యసభ స్థానానికి బదిలీ అయ్యారు. ఈ ముగ్గురినీ మినహాయిస్తే గూడూరులో వరప్రసాదరావు, పూతలపట్టులో ఎంఎస్‌ బాబు, మదనపల్లెలో నవాజ్‌ బాషాలకు టికెట్లు గల్లంతయ్యాయి.

తిరుపతి ఎంపీ, సత్యవేడు ఎమ్మెల్యే పరస్పర బదిలీ

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సత్యవేడు ఇంఛార్జిగా బదిలీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో తిరుపతి నుంచీ మళ్ళీ ఎంపీగా పోటీ చేయడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు. పెద్దగా శ్రమ, ఖర్చు లేకుండా ఎంపీగా గెలిచే అవకాశముంటుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. దానికి తోడు సత్యవేడు టీడీపీకి కంచుకోట కావడం, అక్కడి నుంచీ గెలుపు కష్టసాధ్యమని గ్రహించడంతో ఎంపీ పదవి వైపే ఆయన మనసు లాగుతోందని సమాచారం. అయితే అధిష్ఠానం ఆదేశంతో అయిష్టంగానే సత్యవేడుకు వెళ్ళేందుకు అంగీకరించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అదే సమయంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సైతం అక్కడే మళ్ళీ పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ నియోజవకర్గంలో వ్యతిరేకవర్గం బలంగా వుండి టికెట్‌కు అడ్డుపడడంతో బదిలీ తప్పలేదు. ఆయన కూడా అయిష్టంగా, అసంతృప్తిగా తిరుపతి పార్లమెంటు అభ్యర్థిత్వానికి ఒప్పుకున్నట్టు ఎమ్మెల్యే సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇష్టం లేని చోట్ల పోటీ ఈ ఇద్దరికీ చేదు అనుభవాన్నే మిగుల్చుతాయేమోనన్న భయాందోళన వారి సన్నిహిత వర్గాల్లో వ్యక్తమవుతుండడం గమనార్హం.

ముగ్గురు ఎమ్మెల్యేలకు టికెట్ల గల్లంతు

గూడూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వరప్రసాదరావుకు టికెట్‌ గల్లంతైంది. ఆయన రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కావడంతో రాజకీయాల్లో ప్రజలకు, కార్యకర్తలకు చేరువ కాకుండా ఓ గిరి గీసుకుని అందులోనే వుండిపోయారు. దీంతో సొంత వర్గమంటూ లేకుండా పోయింది. ఎమ్మెల్సీ మేరిగ మురళీధరరావు సీఎం జగన్‌కు సన్నిహితుడైన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మద్దతుతో ఇంఛార్జిగా నియమితులైనట్టు సమాచారం. నేదురుమల్లి, నల్లపురెడ్డి వర్గాలు ఇప్పటికీ గూడూరులో ఎంతోకొంతమేర ప్రభావం చూపుతున్నాయి. ఈ రెండు వర్గాల మద్దతు మురళీధరరావుకు లభించనుంది. కాకపోతే ఈ రెండు వర్గాల కంటే కూడా పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి వర్గం ఇక్కడ బలంగావుంది. ఆ వర్గం మురళీని వ్యతిరేకిస్తోంది. అధిష్ఠానం అతడికే ప్రాధాన్యత ఇవ్వడంతో పేర్నాటి వర్గం మిన్నకుండిపోయింది.ఎన్నికల్లో మురళీ విజయానికి ఈవర్గం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ రకంగా చూస్తే వరప్రసాదరావును మార్చడం వల్ల వైసీపీకి ఇక్కడ నష్టమే తప్ప లబ్ధి కలిగే పరిస్థితి లేదనే చెప్పాలి. పూతలపట్టు విషయానికొస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుకు అధిష్ఠానం మొండిచేయి చూపింది. గత ఎన్నికల్లో వద్దనుకున్న డాక్టర్‌ ముత్తిరేవుల సునీల్‌కుమార్‌ ఇపుడు ముద్దయ్యారు. ఎంఎస్‌ బాబుకు నియోజకవర్గంలోని ప్రతి దళితవాడలోనూ సొంత వర్గం ఏర్పడింది. ఇపుడా వర్గం సునీల్‌కుమార్‌ గెలుపుకోసం పనిచేసే అవకాశాల్లేవు. దానికి తోడు ఎంఎస్‌ బాబు కోసం గట్టిగా పోరాడిన నలుగురైదుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు అధిష్ఠానం తీరుతో అసంతృప్తితో అలిగి దూరంగా వున్నట్టు సమాచారం. వీరు చేతులెత్తేస్తే పార్టీ మునిగిపోయినట్టేనన్న ప్రచారం జరుగుతోంది. అలాగే మదనపల్లెలోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నవాజ్‌ బాషాకు అధిష్ఠానం రిక్త హస్తం చూపింది. ఆయన్ను కాదని అసలు రాజకీయాలతో సంబంధమే లేని నిషార్‌ అహ్మద్‌కు అవకాశమిచ్చింది. దీంతో నవాజ్‌ బాషా వర్గం ఎన్నికల్లో పనిచేసే వాతావరణం కనిపించడం లేదు. ఇదివరకూ ఇక్కడ మైనారిటీ ఓటర్లు మూకుమ్మడిగా వైసీపీకి మద్దతిచ్చారు. దానికి తోడు మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా టీడీపీలో చేరడంతో మైనారిటీ ఓటర్లలో గణనీయమైన చీలిక ఏర్పడే అవకాశాలేర్పడ్డాయి.

ఆరణికి రాజ్యసభ ఖరారైనా....

చిత్తూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు కూడా టికెట్‌ గల్లంతైంది. అయితే ఆయనకు రానున్న రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు అధిష్ఠానం నిర్ణయించిందని, ఇక ప్రకటించడమే మిగిలిందన్న ప్రచారం నడుస్తోంది. నిజానికి రాజ్యసభ అవకాశం కల్పించడం శ్రీనివాసులుకు పదోన్నతి కల్పించినట్టే. చిత్తూరులో పోటీ చేసినా గెలుస్తామో లేదో తెలియని స్థితిలో రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశాలేర్పడడం ఆయనకు అదృష్టమనే చెప్పాలి. కాకపోతే ఎంపీగా ఎన్నికైనా కూడా చిత్తూరు సెగ్మెంట్‌లో పార్టీ అభ్యర్థి గెలుపుకోసం సహకరిస్తారా అన్నది అనుమానంగానే వుంది. దానికి తోడు శ్రీనివాసులును అసెంబ్లీ బరి నుంచీ తప్పించడం పట్ల చిత్తూరు నియోజకవర్గంలో గణనీయంగా వున్న బలిజ సామాజికవర్గం తీవ్ర అసంతృప్తితో వుంది. దాదాపుగా ఆ సామాజికవర్గమంతా వైసీపీకి మద్దతివ్వరాదని అంతర్గతంగా సమావేశాలు పెట్టుకుని మరీ తీర్మానాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ ఇంఛార్జి విషయానికొస్తే ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యం ఆయన గెలుపుకు అవరోధం కానుంది. పీడీ యాక్టు కింద అరెస్టయి జైలులో గడిపి వచ్చిన నేపఽథ్యం విద్యావంతులపై ప్రభావం చూపే అవకాశముంది. అంతే కాకుండా వెన్నంటి వుండే అనుచరవర్గం పట్ల నియోజకవర్గ ప్రజల్లో దౌర్జన్యకర శక్తులనే ముద్ర పడింది. ఇవన్నీ పార్టీ విజయానికి ప్రతిబంధకం కానున్నాయనే ప్రచారం జరుగుతోంది.

పెరగనున్న అంతర్గత విభేదాలు

మొత్తం మీద అధికార పార్టీ గురువారం విడుదల చేసిన మూడవ జాబితాతో అంతర్గత సంక్షోభం నెలకొంది. సత్యవేడు, గూడూరు, చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సిట్టింగులను పక్కనపెట్టి కొత్తవారిని ఇంఛార్జులుగా నియమించడం వల్ల పార్టీలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు మరింతగా పెరగనున్నాయి. సిట్టింగు ఎమ్మెల్యేలు, వారి వర్గాలు కొత్త వారి గెలుపుకోసం సహకరించే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఎన్నికలు సమీపించేకొద్దీ ఈ వర్గాల నడుమ అగాధం మరింతగా పెరిగి మరింత సంక్షోభానికి దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు.

Updated Date - Jan 12 , 2024 | 01:16 AM