Share News

టీడీపీ కౌన్సిలర్‌పై వైసీపీ దాడి

ABN , Publish Date - May 23 , 2024 | 12:14 AM

అభివృద్ధి పనులు చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఉంటుంది. ఎక్కడైనా ఒకరిద్దరు ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులుండీ.. వారు అభివృద్ధి చేయాలన్నా వీలుకాని పరిస్థితులు ఉంటాయి.

టీడీపీ కౌన్సిలర్‌పై వైసీపీ దాడి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌన్సిలర్‌ సెల్వం (ఎడమవైపు వ్యక్తి), అశోక్‌ (తలకు కట్టుతో ఉన్న వ్యక్తి)

కుప్పం, మే 22: అభివృద్ధి పనులు చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఉంటుంది. ఎక్కడైనా ఒకరిద్దరు ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులుండీ.. వారు అభివృద్ధి చేయాలన్నా వీలుకాని పరిస్థితులు ఉంటాయి. కానీ కుప్పంలో పరిస్థితి తిరగబడింది. వార్డును ఎందుకు అభివృద్ధి చేయలేదంటూ వైసీపీకి చెందిన కార్యకర్తలు, టీడీపీకి చెందిన కౌన్సిలర్‌పై దాడికి తెగబడ్డారు. ఈ ఈ ఘటనలో తంబిగానిపల్లెకు చెందిన 5వ వార్డు కౌన్సిలరు సెల్వంతోపాటు ఆ పార్టీ మాజీ వార్డు సభ్యుడు అశోక్‌ గాయపడ్డారు. బాధితులు తెలిపిన ప్రకారం.. తంబిగానిపల్లెలో బుధవారం అశోక్‌తో కలిసి టీడీపీ కౌన్సిలర్‌ సెల్వం వెళ్తున్నారు. నలుగురు వైసీపీ కార్యకర్తలు వీరికి అడ్డు వచ్చారు. వార్డులో రోడ్లు ఎందుకు వేయడంలేదని నిలదీశారు. సెల్వం గెలిచాక ఒక్క పనీ జరగలేదని వాదనకు దిగారు. అటు రాష్ట్రంలోను, ఇటు మున్సిపాలిటీలోనూ వైసీపీనే అధికారంలో ఉందని, అభివృద్ధి చేయాల్సింది మీరేనంటూ కౌన్సిలర్‌ సెల్వం వారికి దీటుగా సమాధానమిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వార్డులో ఒక్క పనీ జరగకపోవడం తనకు బాధగానే ఉందని, మీవారికి చెప్పి అభివృద్ధి పనులు చేయించాల్సిన బాధ్యత మీపైనే ఉన్నదని రిటార్టు ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లినా.. వెంటపడి మరీ దాడి చేశారు. అడ్డం వచ్చిన అశోక్‌నూ కొట్టారు. ఈ ఘటనలో గాయపడిన కౌన్సిలరు సెల్వం, అశోక్‌ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - May 23 , 2024 | 12:14 AM