Share News

ఇదైనా సక్సెస్‌ అవుతుందా?

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:17 AM

చౌకదుకాణాల వద్ద పేదలు పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. నేరుగా కార్డుదారుల ఇంటి వద్దకే ఎండీయూ వాహనం ద్వారా సరుకులు అందజేస్తామని వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పింది.

ఇదైనా సక్సెస్‌ అవుతుందా?

- వలంటీర్ల పర్యవేక్షణలో నేటినుంచి రేషన్‌ పంపిణీ

చౌకదుకాణాల వద్ద పేదలు పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. నేరుగా కార్డుదారుల ఇంటి వద్దకే ఎండీయూ వాహనం ద్వారా సరుకులు అందజేస్తామని వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పింది. కొన్ని రోజులకే తమ వీధి చివరికి కూడా వాహనాలు రావడం లేదంటూ కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రతినెలా 50వేల మందికిపైగా కార్డుదారులైతే వాహనం ఎప్పుడొస్తుందో తెలియక సరుకులకు దూరమవుతున్నారు. తాజాగా వలంటీర్ల పర్యవేక్షణలో సరుకులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

రేషన్‌ సరుకుల పంపిణీలో ప్రభుత్వం సోమవారం నుంచి నూతన విధానం అమలు చేయనుంది. ప్రతి గ్రామం, వార్డుల్లో 5-10 మంది కార్డుదారులకు కలిపి ఒక పాయింట్‌ నిర్దేశిస్తారు. ఎండీయూ వాహనం ఆ ప్రాంతానికి వెళ్లి కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలి. దీనిని పర్యవేక్షించే బాధ్యతను వలంటీర్లకు అప్పగిస్తున్నారు. పౌరసరఫరాల శాఖకు చెందిన యాప్‌ను వలంటీర్లు తమ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఎప్పటికప్పుడు పంపిణీ వివరాలు అందులో పొందుపరచాలి. ఇందుకోసం ప్రతి వలంటీరుకు నెలకు అదనంగా రూ.750 ఇవ్వనున్నారు. నూతన విధానంపై వలంటీర్లకు అవగాహన కల్పిస్తున్నామని డీఎస్వో శంకరన్‌ తెలిపారు.

బుజ్జగించేందుకేనా..?

కొంతకాలంగా వలంటీర్లు తమకిస్తున్న వేతనం సరిపోవడం లేదని, పెంచాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడక్కడా ఆందోళనా చేశారు. ఎన్నికల నేపథ్యంలో వీరిని బుజ్జగించడానికే ఈ నూతన విధానం తీసుకొస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 10వేల మంది వలంటీర్లకుగాను ప్రస్తుతం 9,395 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెంచిన మొత్తంతో ప్రతినెలా ప్రభుత్వంపై అదనంగా రూ.70.46 లక్షల భారం పడనుంది.

వారి అవసరం ఏముంది?: డీలర్లు

ఆరు నెలలుగా కార్డుదారులకు కేవలం ఉచిత బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. రాయితీ కందిపప్పు ఊసేలేదు. గోధుమ పిండి, పంచదార నెల విడిచి.. నెల ఇస్తున్నారు. ఇచ్చే అరకొర సరుకుల కోసం వలంటీర్లకు రూ.750 ఇచ్చి, వారితో పర్యవేక్షణ చేయించాల్సిన అవసరం ఏముందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఆ ఇచ్చేదేదో తమకే ఇస్తే మరింత బాధ్యతతో సరుకులు పంపిణీ చేస్తాం కదా అని అంటున్నారు.

గతంలో చేశారిలా..

ఎండీయూ వాహనం వచ్చే సమయం, ప్రదేశం వివరాలను గతంలో వలంటీర్లు తమ క్లస్టర్‌ పరిధిలోని వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేసేవారు. కొన్ని రోజులకే ఈ పోస్టులు చేయడం మానేశారు.

సంక్రాంతికీ కందిపప్పు కోతే?

సంక్రాంతి పండగకైనా రేషన్‌ కార్డుదారులందరికీ కందిపప్పు ఇస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 5.41 లక్షల కార్డులుండగా ఒక్కో కార్డుకు కిలో వంతున 5.41 టన్నుల కందిపప్పు అవసరం. తాజా సమాచారం మేరకు 1.41 టన్నుల కోటా కోతపడినట్లు తెలిసింది. ఇక కందిపప్పుతోపాటు చక్కెర, గోధుమ పిండి, రాగుల కోసం డీడీలు కట్టడానికి డీలర్లు వెనకడుగు వేశారు. దాంతో 1379 మంది డీలర్లలో 25శాతం మందికి జిల్లా యంత్రాంగం రుణసౌకర్యం కల్పించింది. వీరు సరుకులను కార్డుదారులకు అందజేశారు. తీసుకున్న రుణాన్ని బ్యాంకులకు చెల్లించాలి. మరోవైపు జనవరి నెల కోటాగా జిల్లాకు 270 టన్నుల చక్కెర, 200 టన్నుల రాగులు, 25 టన్నుల గోధుమ పిండిని కేటాయించారు.

- చిత్తూరు కలెక్టరేట్‌

Updated Date - Jan 01 , 2024 | 12:17 AM