శ్రీవారి అన్నప్రసాదాల రుచి మారేనా?
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:05 AM
‘అసలిది అన్నమేనా, ఎలా తినాలి. కమీషన్లు తీసుకుని చెత్తభోజనం పెడుతున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి అన్నమే తింటారా, బయట తినలేక కాదు స్వామి ప్రసాదమని వచ్చాం, ఆకులో పెట్టిన అన్నం ఎవరు తినలేదు. కోట్ల ఆదాయం స్వామికి వస్తోంది. ఇలాంటి అన్నం పెడతారా. టీటీడీకి ఏం తక్కువ. ఆకలితోనే లేచేశాం. చాలా అన్నం వృధా అయ్యింది’. ‘అన్నప్రసాదం ముద్దగా ఉంటోంది.

- గతంలో వచ్చిన విమర్శలపై టీటీడీ ఈవో సమీక్షలు
- ఆహార పదార్థాలను తరచూ తనిఖీ చేయాలని ఆదేశాలు
తిరుమల, ఆంధ్రజ్యోతి
‘అసలిది అన్నమేనా, ఎలా తినాలి. కమీషన్లు తీసుకుని చెత్తభోజనం పెడుతున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి అన్నమే తింటారా, బయట తినలేక కాదు స్వామి ప్రసాదమని వచ్చాం, ఆకులో పెట్టిన అన్నం ఎవరు తినలేదు. కోట్ల ఆదాయం స్వామికి వస్తోంది. ఇలాంటి అన్నం పెడతారా. టీటీడీకి ఏం తక్కువ. ఆకలితోనే లేచేశాం. చాలా అన్నం వృధా అయ్యింది’. ‘అన్నప్రసాదం ముద్దగా ఉంటోంది. అసలు రుచి, నాణ్యత కనిపించడం లేదు’ ఇవన్నీ గత ప్రభుత్వంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి అన్నప్రసాద వితరణపై భక్తుల నుంచి వచ్చిన విమర్శలు.
రూ.5 వేలకోట్ల బడ్జెట్ కలిగిన టీటీడీ భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలను వడ్డించడం లేదంటూ భక్తుల నుంచి తరచూ విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. స్వామి దర్శనానికి వచ్చే ధనిక భక్తుల నుంచి సామాన్య భక్తుల వరకూ కనీసం ఒక్కపూటైనా స్వామి అన్నప్రసాదాన్ని స్వీకరిద్దామని వచ్చి తీవ్ర అసంతృప్తితో తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.1985నుంచి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సూచనలతో టీటీడీ భక్తులకు అన్నప్రసాదాలను అందజేస్తోంది. తిరుమలలోని తరిగొండ వెంబమాంబ అన్నప్రసాద భవనంతో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లలో,బయటి క్యూలైన్లలో, పీఏసీ-4, పీఏసీ-2, వివిధ ప్రాంతాల్లోని ఫుడ్‌కౌంటర్లలో, వృద్ధులు, దివ్యాంగుల క్యూలైన్‌లో, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూకాంప్లెక్స్‌లో, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసం,విష్ణునివాసం యాత్రికుల సముదాయాల్లో, రుయా, స్విమ్స్, ప్రసూతి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రుల్లో, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో రోజూ దాదాపు లక్షన్నర మందికి అన్నప్రసాదాలను అందజేస్తోంది. ప్రధానంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా భారీ భవనంలో ఒకేసారి 16 వేలమంది కూర్చుని భోజనం చేసేలా వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని టీటీడీ నడుపుతోంది. ఈ భవనంలో రోజుకు దాదాపు 40 నుంచి 45 వేల మంది భోంచేస్తున్నారు. అయితే ఇటీవల ఈ భవనంలో వడ్డిస్తున్న అన్నప్రసాదాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అన్నం గట్టిగా ఉంటోందని పలుమార్లు విమర్శలొచ్చాయి. ప్రతినెలా నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమంలోనూ పలువురు భక్తులు అన్నప్రసాదం నాణ్యత బాలేదంటూ నేరుగా ఈవోకే ఫిర్యాదు చేసిన ఘటనలున్నాయి. మరికొంతమంది అన్నం గట్టిగా ఉంటోందని, తినడానికి ఏమాత్రం రుచిగా లేదని చెబుతూ ‘నాశనమైపోతారు’ వంటి శాపనార్థాలు పెట్టారు. పలువురు భక్తులు తమ ఆవేదనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసిన సందర్భాలున్నాయి.కొంతమంది దేవుడి ప్రసాదం కావడంతో బాగాలేదని బయటకు చెప్పలేక రెండు ముద్దలు తిని చేయి కడిగేస్తున్నారు.
నాణ్యత తగ్గిన విషయాన్ని ఒప్పుకున్న టీటీడీ
అన్నప్రసాద విభాగంలో గత రెండేళ్లుగా టెండర్ ద్వారా బియ్యం కొనుగోలు చేస్తున్నామని, నాణ్యత తగ్గడాన్ని తామూ కూడా గుర్తించామంటూ టీటీడీ కూడా ఒప్పుకుంది. భక్తుల నుంచి తరచూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇకపై రైస్ మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, నిపుణులైన సిబ్బందిని తీసుకుని మరింత నాణ్యంగా అన్నప్రసాదాలను తయారుచేసి అందజేస్తామని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే అన్నప్రసాదాల తయారీ కోసం టీటీడీ కొనుగోలు చేసే ముడిసరుకుల క్వాలిటీని పరీక్షించేందుకు ల్యాబ్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ అన్నప్రసాదాల నాణ్యత తగ్గడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కొంతమంది అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తిపడడంవల్లే అన్నప్రసాదాల్లో నాణ్యత, రుచి తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.అన్నప్రసాదం ట్రస్టుకు అందుతున్న విరాళాల ద్వారా వచ్చే వడ్డీ ద్వారానే దాదాపుగా అన్నప్రసాదాల వితరణ జరుగుతున్న క్రమంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొవడం శ్రేయస్కరం కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. దేవుడి ప్రసాదంగా భావించి భక్తులు స్వీకరించే అన్నప్రసాదాల్లో నాణ్యత, రుచి విషయంలో టీటీడీ మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నాణ్యత పెంపుపై ఈవో కసరత్తు
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించాక తొలుత అన్నప్రసాదాలపై వస్తున్న విమర్శలపైనే ప్రధానంగా దృష్టిసారించారు.నాణ్యత ఎందుకు తగ్గింది, ఎక్కడ లోపాలున్నాయనే అంశాలపై తరచూ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న బియ్యాన్ని, సరుకులను స్వయంగా పరిశీలించారు. భక్తులకు వడ్డిస్తున్న అన్నప్రసాదాలను నేరుగా రుచి చూసి గుర్తించిన లోపాలపై అధికారులతో మాట్లాడుతున్నారు.ఇకపై భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.నాణ్యతను పెంచేందుకు ఫుడ్ కన్సల్టెంట్‌ను నియమించాలని అభిప్రాయపడ్డారు. అలాగే ముడిసరుకుల కొనుగోళ్లపై దృష్టి సారించారు. నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసేలా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో గతంలోలాగే రుచికరమైన అన్నప్రసాదాలు అందుతాయని భక్తులు ఆశపడుతున్నారు.