క్రీడారంగం పురోగమించేనా?
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:35 AM
వైసీపీ హయాంలో ఐదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

వైసీపీ హయాంలో క్రీడారంగం జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అందుబాటులో ఉన్న క్రీడాంశాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుపరం చేయడంతో పేదలైతే క్రీడలను మరచిపోయారు. నూతన ప్రభుత్వ హయాంలో అయినా క్రీడారంగం పురోభివృద్ధి చెందనుందా..? ఆ దిశగా చర్యలు చేపట్టనుందా..? అంటే ఔననే సంకేతాలు జిల్లా యంత్రాంగం ద్వారా అందుతున్నాయి.
- తిరుపతి(క్రీడలు)
జిల్లా కేంద్రమైన తిరుపతిలో దాదాపు 20 ఎకరాల్లో శ్రీనివాస క్రీడా సముదాయం ఉంది. ఇందులో కార్యాలయం, ఇండోర్ స్టేడియం (షటిల్‌బ్యాడ్మింటన్, జిమ్, యోగా, బాక్సింగ్ క్రీడలకు అనుకూలంగా ఉంది). వెలుపల ఫ్లడ్‌లైట్లతో కూడిన రెండు టెన్ని్‌స కోర్టులు, స్కేటింగ్ రింగ్, స్విమ్మింగ్ పూల్, క్రికెట్‌నెట్ ప్రాక్టీసు స్థలాలున్నాయి. తాత్కాలిక వసతుల మినహా శాశ్వత, అధునాతన సదుపాయాలు లేవు. అలాగే శ్రీకాళహస్తి, సత్యవేడులలో అరకొర ఏర్పాట్లతో క్రీడా ప్రాంగణాలు మాత్రమే ఉన్నాయి.
కోచ్‌లు, సిబ్బంది కొరత
హాకీ, ఫుట్‌బాల్, రెజ్లింగ్, వాలీబాల్, జోడో, స్విమ్మింగ్, స్కేటింగ్‌లకు మాత్రమే కోచ్‌లున్నారు. షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, జిమ్నాస్టిక్, ఖోఖో, అథ్లెటిక్, క్రికెట్ అంశాలకు శిక్షకులు కరువయ్యారు. దీంతోపాటుగా గ్రౌండ్స్‌మెన్స్, ఆఫీసు అటెండర్లు, స్విమ్మింగ్‌పూల్ లైఫ్‌గార్డ్స్, స్వీపర్లు, వాచ్‌మెన్ లేకుండా క్రీడాప్రాంగణాలు కొనసాగుతుండడం గమనార్హం.
అర్ధంతరంగా ఆగిన పనులు
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రగిరిలో రూ.2.1కోట్లతో ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం ఏర్పాటైంది. అయితే ప్రభుత్వం మారగానే అర్ధంతరంగా పనులు ఆగిపోయాయి. ఇప్పటికీ మొండిగోడలతో దర్శనమిస్తోంది. ప్రాంగణం కూడా నిరుపయోగంగా ఉంటోంది.
ప్రతిపాదనలతో సరి
2022లో తమిళనాడు తరహా జిల్లావ్యాప్తంగా అకాడమీలు, క్రీడా వసతి గృహాల ఏర్పాటు అన్నది ప్రతిపాదనలకే పరిమితమైంది. రూ.52లక్షలతో శ్రీనివాస క్రీడా సముదాయంలో వాణిజ్యసముదాయం నిర్మాణానికి అనుమతులు వచ్చినా నిధులు విడుదల కాలేదు. ఔట్‌డోర్ మైదానాల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదన కూడా మరుగున పడిపోయింది. దీంతో డిస్ర్టిక్ట్ అథారిటీ కోచ్‌లు బయట పాఠశాలలు, కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు. పే అండ్ ప్లే విధానంతో వసూలైన నగదు కూడా నేరుగా శాప్‌కు చేరడంతో జిల్లా క్రీడాభివృద్ధి కుంటుపడింది. మూడేళ్ల క్రితం అప్పటి పాలకులు స్వార్థంతో ప్రవేశపెట్టిన ఈ విధానం నిష్ప్రయోజనంగానే మిగిలిపోయింది. జిల్లా నుంచి ఏడాదికి దాదాపు రూ.50లక్షల వరకు శాప్‌ఖాతాలో జమ అవుతున్నా.. అక్కడినుంచి వచ్చే నిధులు మాత్రం రూ.18లక్షలే. దీనివల్లే క్రీడారంగం అభివృద్ధి చెందలేకపోతోందని పలువురి క్రీడాభిమానుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం.
కోచ్‌లకు 4నెలలుగా జీతాల్లేవ్
జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో పనిచేస్తున్న కోచ్‌లకు నాలుగు నెలలుగా జీతాలు రాలేదు. దాంతో వారి కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా ఒకరు, శాప్ కోచ్‌లుగా ముగ్గురు (క్రికెట్, టెన్నిస్, హాకీ), ఔట్ సోర్సింగ్‌లో (జూడో, ఫుట్‌బాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, హాకీ), పే అండ్ ప్లేలో (వాలీబాల్, స్కేటింగ్, రెజ్లింగ్)మొత్తం డజను మంది కోచ్‌లు శిక్షణ అందిస్తున్నారు. కాగా ఖేలో ఇండియా స్కీమ్, శాప్, పే అండ్ ప్లే కోచ్‌లకు మాత్రం నెల నెలా జీతాలు సక్రమంగా అందుతున్నాయి. ఔట్‌సోర్సింగ్ కోచ్‌లకు (ఒక్కొక్కరికి రూ.19,500చొప్పున) మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన జీతాలు చెల్లించలేదు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ పరిధిలో ఉండడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని తెలుస్తోంది. ఆప్కా్‌సకు మార్చికే కాలపరిమితి ముగిసింది. కొనసాగింపునకు సిఫార్సు చేసినా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో సాధ్యపడలేదు. నూతన ప్రభుత్వం ఏర్పడి గత నెల చివర్లో ఆప్కాస్ సంస్థకు మరో ఏడాది కాలపరిమితి పొడిగింపు లభించింది. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, ఇకనైనా తమకు జీతాలు చెల్లించాలని ఆయా కోచ్‌లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.