Share News

అమాత్యులెవరు?

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:54 AM

రాష్ట్రంలో అధికారం మారిన నేపధ్యంలో రేపు ప్రధానిగా నరేంద్ర మోదీ, అలాగే ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారాలు చేయనున్నారు.

అమాత్యులెవరు?

జిల్లాలో మంత్రి పదవులపై సర్వత్రా చర్చ

చిత్తూరు ఎంపీకి కేంద్ర మంత్రిగా ఛాన్సు

రాష్ట్ర మంత్రి పదవి కోసం పలువురి యత్నాలు

రాష్ట్రంలో అధికారం మారిన నేపధ్యంలో రేపు ప్రధానిగా నరేంద్ర మోదీ, అలాగే ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారాలు చేయనున్నారు. ఆయా తేదీల్లోనే కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాలు కూడా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. లేదంటే కొన్ని రోజుల ఆలస్యం అయినా మొత్తం మీద ఈ నెలలోనే పూర్తిస్థాయి కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జిల్లా నుంచీ ఎవరెవరికి మంత్రి పదవులు లభించే అవకాశముంది? ఏ ప్రాతిపదికన? అన్న అంశాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. కూటమిలో ఏ పార్టీలో ఎవరికి? సామాజికవర్గాల రీత్యా అయితే ఎవరికి? కొత్త జిల్లాల ప్రకారమా లేక ఉమ్మడి జిల్లాల ప్రకారమా? అన్న ప్రశ్నలు అటు రాజకీయ వర్గాలతోపాటు జనంలోనూ వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చర్చలతో నిమిత్తం లేకుండా జిల్లా నుంచీ పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తిరుపతి, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): టీడీపీ వర్గాల సమాచారం మేరకు కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ సామాజికవర్గం నుంచీ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పేరు పరిశీలనలో వుంది. అధిష్ఠానం వద్ద గణనీయమైన పలుకుబడి వున్న కారణంగానే ఆయన ప్రకాశం జిల్లావాసి అయినా చిత్తూరు ఎంపీ టికెట్‌ తెచ్చుకున్నారని, దానికి తోడు ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల విజయానికి వీలైన మేరకు ఆర్థికంగా సహకరించారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నత విద్యావంతుడు కావడం, అఖిల భారత సర్వీసుల అధికారిగా పనిచేసిన నేపథ్యం,అధిష్ఠానం వద్ద పలుకుబడి ఆయనకు అదనపు అర్హత కాగలదని సమాచారం.

రాష్ట్ర మంత్రులుగా ప్రచారంలో ఇద్దరి పేర్లు

తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఎవరికి మంత్రి పదవులు లభిస్తాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలు, నెల్లూరు నుంచీ కొత్తగా తిరుపతి పరిధిలోకి చేరిన మూడు స్థానాలూ కలిపి మొత్తం 17 స్థానాలకు గానూ 15 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు జనసేన కాగా మిగిలిన వారు టీడీపీకి చెందినవారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన మంత్రి పదవులకు ఇద్దరి పేర్లు ప్రచారంలో వున్నాయి. చిత్తూరు జిల్లా నుంచీ పలమనేరు ఎమ్మెల్యే అమరనాఽథరెడ్డి, అన్నమయ్య జిల్లా నుంచీ పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అమరనాధరెడ్డి విషయానికి వస్తే కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపఽథ్యం వుండడం, డీసీసీబీ ఛైర్మన్‌గా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగానూ, మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఆయనకు అర్హతలని చెబుతున్నాయి. జిల్లాలో నాయకులను సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు నడిపించిన నేతగా ఆయనకు అధిష్ఠానం వద్ద ప్రత్యేక గుర్తింపు వుంది. దానికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో అధికార పార్టీ వర్గాల ఆగడాలను ఎదుర్కొనడం, నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర నిర్వహణలో రాయలసీమవ్యాప్తంగా కీలక బాధ్యతలు నిర్వర్తించడం, ఆ క్రమంలో 24 పోలీసు కేసులను ఎదుర్కొనడం ఆయనకు కలసివస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పీలేరు ఎమ్మెల్యే కిషోర్‌ కుటుంబానికి సైతం సుదీర్ఘ రాజకీయ నేపథ్యం వున్న సంగతి తెలిసిందే. తండ్రి మంత్రిగా, అన్న సీఎంగా పనిచేసి వుండడంతో పాటు కిషోర్‌ గత టీడీపీ ప్రభుత్వంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో అధిష్ఠానం ఆయనకు ప్రత్యేక గుర్తింపు కల్పించింది. పుంగనూరు సెగ్మెంట్‌లో వైసీపీ ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోవడంతో పాటు తంబళ్ళపల్లి, మదనపల్లె నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేశారన్న పేరుంది. చంద్రబాబుపై కురబలకోటలో వైసీపీ దాడుల ఘటనకు సంబంధించి కిషోర్‌ పోలీసు కేసులు కూడా ఎదుర్కొన్నారు. వీటన్నింటికీ మించి రాజంపేట పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు స్థానాలకు గానూ వైసీపీ మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు గెలిచి బలంగా ఉనికి చాటుకుంది. అక్కడ టీడీపీ రెండు సీట్లకు, జనసేన ఒక సీటుకు పరిమితమయ్యాయి. అలాంటి చోట పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి కిషోర్‌ సేవలు అవసరమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సామాజికవర్గాలవారీగా అవకాశాలపై ఆశలు

సామాజిక సమీకరణలు, కూటమి పార్టీల సమీకరణల దృష్ట్యా పలువురు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మదనపల్లె నుంచీ టీడీపీ తరపున గెలిచిన షాజహాన్‌ బాషాకు ముస్లిం మైనారిటీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందని ముస్లిం మైనారిటీ వర్గాలు ఆశిస్తున్నాయి.తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రాయలసీమ మొత్తం మీద జనసేన తరపున బలిజ సామాజికవర్గం నుంచీ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అని ఆ సామాజికవర్గం గట్టి నమ్మకంతో వుంది. ఆ మేరకు ఆయన కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కుటుంబ నేపథ్యం, ఆయన తండ్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అధినేత చంద్రబాబుకు సన్నిహిత మిత్రుడు కావడం వంటి కారణాలతో తిరుపతి జిల్లా నుంచీ ఆయనకు అవకాశం వుంటుందని అక్కడి పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడైన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌కు ఛాన్సు దక్కుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.టీడీపీకి కంట్లో నలుసుగా మారిన మాజీ మంత్రి రోజాను భారీ మెజారిటీతో ఓడించిన భానుకు మంత్రి పదవి తప్పక దక్కుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.ఇక తిరుపతి జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ గురించి చెప్పక్కర్లేదు.చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చం ద్రగిరిలో పాతికేళ్ళ తర్వాత రికార్డు మెజారిటీతో గెలిచిన నానీకి అధినేత వద్ద,యువనేత లోకేశ్‌ వద్ద ప్రత్యేక గుర్తిం పు వుంది. గత ప్రభుత్వంలో అధికార పార్టీని ఎదుర్కొని, పార్టీని బలోపేతం చేసే క్రమంలో అనేక ఇబ్బందులకు గురైన నానీకి మంత్రి పదవితో అధిష్ఠానం న్యాయం చేస్తుందని చంద్రగిరి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సీనియర్‌ నేత కావడంతో పాటు వియ్యంకుడైన పారిశ్రామికవేత్త గంగాప్రసాద్‌ అధినేత చంద్రబాబుకు సన్నిహితు డు కావడం వల్ల అవకాశాల్లేకపోలేదని అనుచరవర్గం ఆశాభావంతో వుంది. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడిని ఓడించడం అదనపు అర్హతగా భావిస్తోంది.

ఎస్సీ సామాజికవర్గం నుంచీ...

వైద్యరంగంలో ప్రముఖుడు కావడం, అధినేత చంద్రబాబుతో సన్నిహితత్వం వుండడం,మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తెను ఓడించడం వంటి కారణాలతో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఽథామ్‌సకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందని స్థానిక పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.ఎస్సీ మహిళ కోటాలో వైద్యురాలైన సూళ్ళూరుపేట యువ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశాల్లేకపోలేదని అక్కడి పార్టీ శ్రేణులు ఆశాభావంతో వున్నాయి. తండ్రి గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసి వుండడం ఆమెకు అనుకూలిస్తుందని చెబుతున్నాయి. అలాగే గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ సీనియారిటీ కారణంగా ఎస్సీ కోటాలో ఛాన్సుంటుందని ఆయన అనుచరవర్గం నమ్ముతోంది. వైసీపీ ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని సవాల్‌ చేసిన నేతగా పేరుతెచ్చుకోవడంతో పాటు సత్యవేడులో సంచలన విజయం సాధించిన కోనేటి ఆదిమూలం మంత్రి పదవికి అర్హుడని అక్కడి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా మంత్రి పదవుల కోసం తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాల పరిధిలో విస్తృతస్థాయిలో జనం మధ్య చర్చ నడుస్తోంది. రానున్న ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Updated Date - Jun 08 , 2024 | 01:54 AM