జడ్పీటీసీకి లేని ప్రొటోకాల్ మంత్రి రోజా అన్నకెవరు ఇచ్చారు?
ABN , Publish Date - Mar 03 , 2024 | 01:24 AM
జడ్పీటీసీలకు లేని ప్రొటోకాల్ మంత్రి రోజా అన్నకు ఎవరిచ్చారని వడమాల పేట జడ్పీటీసీ మురళీధర రెడ్డి ప్రశ్నించారు.
వడమాలపేట వైసీపీ జడ్పీటీసీ మురళీధర రెడ్డి
తిరుపతి(తిలక్‌రోడ్), మార్చి 2: జడ్పీటీసీలకు లేని ప్రొటోకాల్ మంత్రి రోజా అన్నకు ఎవరిచ్చారని వడమాల పేట జడ్పీటీసీ మురళీధర రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల వడమాలపేటలో రూ.50లక్షల తుడా నిధులతో సీసీ డ్రెయిన్లు నిర్మించడానికి చేసిన భూమిపూజలో ఏ అధికారంతో రోజా అన్న రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నదమ్ములతో కలిసి నగరి నియోజక వర్గాన్ని రోజా దోచేస్తున్నారని ఆరోపించారు. తాను జిల్లా పరిషత్ సభ్యుడి హోదాలో గత నెల 25న అప్పలాయ గుంటలో సచివాలయం, పత్తిపుత్తూరులో పాలశీతలీకరణ కేంద్రం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తే అవే భవనాలను శనివారం మంత్రి రోజా ప్రారంభించడమేంటన్నారు. ఏ ప్రజాప్రతినిధికీ ఇంతటి ఘోరావమానం జరక్కూడదన్న ఆయన అధికారులపై ప్రైవేటు కేసు వేస్తున్నానని స్పష్టం చేశారు. అప్పలాయగుంటలో ప్రజలెవరూ మంత్రి రోజా కార్యక్రమానికి రాకపోవడంతో అక్కడ రద్దు చేసుకుని పత్తిపుత్తూరులో పాలశీతలీకరణ కేంద్రాన్ని, సచివాలయాన్నీ తనకు సమాచారం ఇవ్వకుండా వలంటీర్లు, ప్రభుత్వ అధికారులతో ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే నగరి నియోజకవర్గంలో ప్రజాపతినిధులు, వైసీపీ క్యాడర్ రోజాపై అసంతృప్తితో ఉన్నారని, ఎమ్మెల్యే టికెట్‌ను స్థానికులకు ఇస్తే గెలిపించుకుంటామని వైసీపీ అధిష్ఠానానికి సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అధికారులను మంత్రి రోజా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు, భాస్కర్‌రెడ్డి, పరంధామయాదవ్, వాసుదేవరెడ్డి, జయచంద్రా రెడ్డి పాల్గొన్నారు.