Share News

టీడీపీ నుంచి ఎవరెక్కడ?

ABN , Publish Date - Mar 14 , 2024 | 01:28 AM

నేడు విడుదల కానున్న తెలుగుదేశం అభ్యర్ధుల జాబితాపై ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఈ రెండు జిల్లాల పరిధిలో తొలి జాబితాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుపతిని మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీలలో ఒకదానికి కేటాయించే అవకాశముంది. ఇక మిగిలిన ఏడు స్థానాల్లో అభ్యర్థులెవరన్న దానిపైనే ఇప్పటిదాకా కొనసాగిన సస్పెన్స్‌ నేడు తొలగిపోయే ఆస్కారముంది.

టీడీపీ నుంచి ఎవరెక్కడ?

తిరుపతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): నేడు విడుదల కానున్న తెలుగుదేశం అభ్యర్ధుల జాబితాపై ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఈ రెండు జిల్లాల పరిధిలో తొలి జాబితాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుపతిని మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీలలో ఒకదానికి కేటాయించే అవకాశముంది. ఇక మిగిలిన ఏడు స్థానాల్లో అభ్యర్థులెవరన్న దానిపైనే ఇప్పటిదాకా కొనసాగిన సస్పెన్స్‌ నేడు తొలగిపోయే ఆస్కారముంది.

ఏడు స్థానాల్లో నేడు ఎన్నింటికో?

తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాల పరిధిలో పుంగనూరు, మదనపల్లె, పూతలపట్టు, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, వెంకటగిరి తదితర ఏడు అసెంబ్లీ స్థానాలు పెండింగులో ఉన్నాయి. గురువారం విడుదల కానున్న రెండవ జాబితాలో ఈ స్థానాలు అన్నింటికీ అభ్యర్థులను ప్రకటిస్తారా లేక కొన్ని స్థానాలు పెండింగ్‌లో పెడతారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంటోంది. నిజానికి చంద్రగిరిలో పులివర్తి నాని, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌రెడ్డి, పూతలపట్టులో మురళీమోహన్‌, పుంగనూరులో చల్లా రామచంద్రారెడ్డిలకు అధికారికంగా ప్రకటించలేదు కానీ టికెట్లు ఎప్పుడో ఖరారయ్యాయి. అయితే తొలి జాబితాలో వీరి పేర్లు ప్రకటించకపోవడంతో సస్పెన్స్‌ కొనసాగుతోంది. మార్పులేమైనా వుంటాయేమోనన్న అనుమానాలకు అవకాశం ఏర్పడింది. అయితే టికెట్ల ప్రకటనతో నిమిత్తం లేకుండా అధిష్ఠానంపై నమ్మకంతో ఈ నాలుగు స్థానాల్లో ఇంఛార్జులు ఎన్నికల ప్రచారానికి ఎప్పుడో శ్రీకారం చుట్టేశారు. ఇప్పటికే ఒకటికి రెండు సార్లు ప్రతి గడపా తొక్కి ఓట్లు అభ్యర్థించారు. కాగా పూతలపట్టు అభ్యర్థిని నేటి జాబితాలో వెల్లడించకపోవచ్చని సమాచారం. వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నడుమ పోటీ వుండగా తాను ఆత్మకూరు నుంచీ పోటీ చేస్తానని ఆనం ప్రకటించడంతో రామకృష్ణకు లైన్‌ క్లియర్‌ అయింది. అయితే ఆఖరి నిమిషంలో అధిష్ఠానం రామకృష్ణకు కాకుండా ఆయన కుమార్తె లక్ష్మీ సాయిప్రసన్నకు టికెట్‌ ఖరారు చేసింది.ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్‌కు కోడలు కూడా అయిన లక్ష్మీ సాయిప్రసన్న పేరు రెండవ జాబితాలో ప్రకటించే అవకాశముంది.

సత్యవేడు, మదనపల్లెలపైనే అందరి చూపు

ప్రత్యేక పరిస్థితుల కారణంగా సత్యవేడు, మదనపల్లె నియోజకవర్గాలపైనే అందరి చూపూ పడుతోంది. సత్యవేడులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసీపీని వీడి టీడీపీకి చేరువైన సంగతి తెలిసిందే. అక్కడ టీడీపీ టికెట్‌ ఆదిమూలానికే ఖరారైనట్టు సమాచారం. అయితే టికెట్‌ ఆశిస్తున్న ఇతర నేతల సంఖ్య ఎక్కువగా వున్నందున వారందరినీ పిలిపించుకుని సర్దిచెప్పాల్సి వుందని, అంతే కాకుండా పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత రాకుండా ఆచితూచి అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలో ఇవన్నీ సర్దుబాటు చేసిన తర్వాతే ఆదిమూలం పేరు ప్రకటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. కాబట్టి గురువారం వెలువడే జాబితాలో సత్యవేడు పేరు వుండదని సమాచారం. ఇక మదనపల్లె విషయానికొస్తే అక్కడ కూడా టీడీపీ టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే వుంది. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ నుంచీ టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషాకు టికెట్‌ ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముస్లిం మైనారిటీలు అధికంగా వున్న మదనపల్లెలో వందల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్‌ ఆస్తులను కాపాడ్డంతో పాటు ఆ భూముల్లో భారీ షాపింగ్‌ కాంప్లెక్సులు నిర్మించి వక్ఫ్‌ బోర్డుకు భారీగా ఆదాయాన్ని పెంచిన నేతగా ఆయనకు మైనారిటీ వర్గాల్లో హీరో వర్షిప్‌ వుంది. అధిక శాతం ముస్లింల మద్దతు ఆయనకే వుండడంతో అధిష్ఠానం షాజహాన్‌వైపు మొగ్గుచూపినట్టు సమాచారం. అయితే అక్కడ ఆశావహులకు నచ్చజెప్పాల్సి వున్నందున గురవారం జాబితాలో ఈ స్థానం పెండింగ్‌ పెట్టచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - Mar 14 , 2024 | 01:28 AM