మద్య నిషేధం ఎక్కడ జగన్?
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:50 AM
‘మద్య నిషేధం చేశాకే ఎన్నికలకు వస్తానని సీఎం జగన్ చెప్పారు. ఇపుడు ఏ ముఖం పెట్టుకుని జనాన్ని ఓట్లు అడుగుతారు’ అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
టీడీఆర్ బాండ్ల బాధితులతో కలసి పోరాటం చేస్తాం
నేడు ‘జయహో బీసీ’: టీడీపీ
తిరుపతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘మద్య నిషేధం చేశాకే ఎన్నికలకు వస్తానని సీఎం జగన్ చెప్పారు. ఇపుడు ఏ ముఖం పెట్టుకుని జనాన్ని ఓట్లు అడుగుతారు’ అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో సోమవారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. తిరుపతిలో మాస్టర్‌ప్లాన్ రోడ్లు ఎవరికోసం వేశారో మీడియా సమక్షంలో చూసేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. టీడీఆర్ బాండ్లలో భారీ కుంభకోణం జరిగిందని, నిజమైన బాధితులతో కలసి పోరాటం చేస్తామన్నారు. దొంగ ఓట్లతో గెలిచేందుకు వైసీపీ అభ్యర్థి అప్‌డేట్ అయ్యారని ఆరోపించారు. కుమారుడిని ఎమ్మెల్యే చేసేందుకు కరుణాకర రెడ్డి బూటకపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి నగరంలోని ఇందిరా మైదానంలో మంగళవారం ఐదు గంటలకు జయహో బీసీ కార్యక్రమం జరగనుందన్నారు. బీసీలందరూ ఒకేతాటిపై నిలిచి చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చేతివృత్తులు, కులసంఘాలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పారు. అనంతరం సమావేశం జరిగే మైదానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు చినబాబు, క్లస్టర్ ఇన్‌చార్జులు, రాష్ట్ర, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.