పోలీసు సార్లు ఎవరెక్కడున్నారు?
ABN , Publish Date - Aug 21 , 2024 | 01:08 AM
ప్రభుత్వానికి పోలీసులు విశ్వాసపాత్రంగా ఉండడం సహజమే. అయితే అయిదేళ్లపాటు ఒక రాజకీయపార్టీకి బంటుల్లా వ్యవహరించడమే విచిత్రం.
(చిత్తూరు, ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వానికి పోలీసులు విశ్వాసపాత్రంగా ఉండడం సహజమే. అయితే అయిదేళ్లపాటు ఒక రాజకీయపార్టీకి బంటుల్లా వ్యవహరించడమే విచిత్రం. జిల్లాలో పోలీసు బాస్ మొదలు ఎస్‌ఐల దాకా అనేకమంది ఇలా వైసీపీ నాయకుల అడుగులకు మడుగులెత్తారు. వారు ఏమి చెబితే అదే చేశారు. వైసీపీ ప్రత్యర్థులైన వారిని అడ్డుకున్నారు. కొట్టారు. కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. భయభ్రాంతులను చేశారు. ఐదేళ్లు ఈ అరాచకత్వమే రాజ్యమేలింది. ప్రజల తీర్పుతో జగన్ పార్టీ ఊడ్చుకుపోయింది. తమను వేధించిన, హింసించిన, అక్రమకేసులు పెట్టిన పోలీసు అధికారులు ఇప్పుడు ఏమయ్యారు.. ఎక్కడున్నారు అనే ఆసక్తి బాధితుల్లోనూ, ప్రజల్లోనూ ఉంది. అధికారం మారగానే ప్లేటు మార్చడంలో ఘనులైన కొందరు జిల్లాలోనే ఉన్నారు. కొందరు బదిలీ అయ్యారు. మరికొందరు వీఆర్‌లో ఉన్నారు. ఆ వివరాలు ఇవీ..
ఆ ముగ్గురూ ప్రత్యేకం
నాటి ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ గంగిరెడ్డి ఈ ముగ్గురూ రాష్ట్రవ్యాప్తంగా అరాచక అధికారులుగా ముద్ర పడ్డారు. వైసీపీకి, పెద్దిరెడ్డికి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టారు. అక్రమ కేసులతో వేధించారు. రిషాంత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్నారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రిషాంత్‌రెడ్డికి పోస్టింగ్ ఇవ్వకుండా హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. సుధాకర్‌రెడ్డి ఎన్నికలకు ముందు అనంతపురం ఏసీబీ డీఎస్పీగా వెళ్లారు. పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడిగా ముద్ర వేసుకున్న సీఐ గంగిరెడ్డిని ఎన్నికలకు కొన్నాళ్ల ముందు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు.
పెద్దిరెడ్డి రాజ్యంలో పనిచేసినవారెక్కడ?
పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డిని ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా పోలీసులు పనిచేశారు. గతంలో చౌడేపల్లెలో పనిచేసిన సీఐ మధుసూదన్‌రెడ్డి ఇప్పుడు కర్నూలులో ఉన్నారు. కల్లూరు సీఐగా పనిచేసిన శ్రీనివాసులు ఇప్పుడు చిత్తూరు వీఆర్‌లో ఉన్నారు. పుంగనూరు, రొంపిచెర్ల ఎస్‌ఐగా పనిచేసిన సుకుమార్ మెడికల్ లీవుపై వెళ్లారు. చౌడేపల్లె ఎస్‌ఐగా పనిచేసిన రవికుమార్ ఇప్పుడు మదనపల్లెలో ఉన్నారు. సోమల ఎస్‌ఐగా పనిచేసిన నరసింహులు ఇటీవల పలమనేరుకు బదిలీ అయ్యారు. సదుం ఎస్‌ఐ మారుతి పోలింగ్ ముందు సస్పెండయ్యారు. ఏకపక్షంగా పనిచేసిన చౌడేపల్లె సీఐ కృష్ణారెడ్డిని తాజాగా ప్రభుత్వం వీఆర్‌కు పంపింది.
కుప్పంలో అరాచక పోలీసుల జాడేది?
కుప్పం నియోజకవర్గంలోనూ పోలీసులు ఏకపక్షంగా పనిచేశారు. టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టారు. వైసీపీతో అంటకాగిన కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్‌ను వీఆర్‌కు పంపించారు. రామకుప్పం, బైరెడ్డిపల్లె ఎస్‌ఐగా పనిచేసిన కృష్ణయ్య వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి టీడీపీ శ్రేణుల మీద అక్రమ కేసులు పెట్టారు. తాజాగా ఆయన్ను వీఆర్‌కు బదిలీ చేశారు. కృష్ణయ్య రామకుప్పంలో ఓ టీడీపీ కార్యకర్తను బూతులు తిట్టిన ఆడియో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈయన తర్వాత రామకుప్పం వచ్చిన ఎస్‌ఐ శివకుమార్ కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. ఇలాగే వ్యవహరించిన శాంతిపురం మండలంలోని రాళ్లబుదుగూరు ఎస్‌ఐ సుమన్‌ను వీఆర్‌కు పంపించారు.
ఎస్ బాస్‌లు.. ఈ అధికారులు
గుడిపాల ఎస్‌ఐగా పనిచేసిన శ్రీనివాసులు ఎన్నికల సమయంలో ఏకపక్షంగా వ్యవహరించి, లాఅండ్‌ఆర్డర్ తప్పేలా చేయడంతో ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండు చేశారు. ఎస్‌ఆర్‌పురం ఎస్‌ఐగా 2022-23 మధ్యలో పనిచేసిన శ్రీనివాసులు నారాయణస్వామికి, విజయానందరెడ్డికి అనుకూలంగా వ్యవహరించి రెండుసార్లు వీఆర్‌కు వెళ్లారు. నాయుడుపేట నుంచి చిత్తూరుకు ఎన్నికల ముందు వచ్చిన డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి వైసీపీ కోసం పనిచేశారు. తాజాగా ఆయన్ను పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. చిత్తూరు వన్‌టౌన్, టూ టౌన్, వెస్ట్ సీఐలు విశ్వనాథ్‌రెడ్డి, ఉలసయ్య, రవిశంకర్‌రెడ్డితో పాటు తాలుకా, బీఎన్‌ఆర్‌పేట ఎస్‌ఐలు ఉమామహేశ్వర్‌రెడ్డి, వెంకటసుబ్బమ్మను ప్రభుత్వం తాజాగా వీఆర్‌కు పంపింది. వీరిలో విశ్వనాథ్‌రెడ్డి మాత్రం అన్నమయ్య జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సీఐగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. పాలసముద్రం ఎస్‌ఐ భారతి ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. పాత కేసులున్న టీడీపీ శ్రేణుల్ని మాత్రమే బైండోవర్ చేశారు. జీడీనెల్లూరు పోలీ్‌సస్టేషనులో ఏఎ్‌సఐ ఆంజనేయులురెడ్డి, గజేంద్ర, హెడ్‌కానిస్టేబుల్ గోపాల్ వైసీపీ నేత విజయానందరెడ్డికి అనుకూలంగా ఉంటూ స్టేషనులో జరిగే విషయాల్ని ఎప్పటికప్పుడు ఆయనకు చేరవేసేవారనే ప్రచారం ఉంది. ఎన్నికలకు ముందు పెనుమూరు వచ్చిన ఎస్‌ఐ లోకేశ్ మీద ఆరోపణలు రావడంతో వీఆర్‌కు పంపించారు. ఏకపక్షంగా వ్యవహరించిన కార్వేటినగరం సీఐ సత్యబాబును తాజాగా వీఆర్‌కు బదిలీ చేశారు.
పలమనేరులో..
పలమనేరు సీఐ చంద్రశేఖర్ వైసీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణాకు సహకరించారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఆయన ఇసుక తీసుకెళ్తున్న టీడీపీ నేతను ఇబ్బంది పెట్టడంతో సుమారు వంద మంది శ్రేణులు రోడ్డుపై ధర్నా చేశారు. తాజాగా ఆయన్ను వీఆర్‌కు బదిలీ చేశారు. వి.కోటలో ఏకపక్షంగా పనిచేసి టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన సీఐ లింగప్పను చిత్తూరు వీఆర్‌కు మార్చారు. పెద్దపంజాణి మండలంలో వైసీపీతో అంటకాగిన ఎస్‌ఐ శ్రీనివాసులు ఎన్నికల తర్వాత వీఆర్‌కు వెళ్లారు. గంగవరం సీఐ చిన్నగోవిందు ఏకపక్షంగా పనిచేశారనే ఆరోపణల నేపథ్యంలో తాజాగా వీఆర్‌కు మార్చారు.
రోజాకి వీరవిధేయులు
నగరి సీఐగా పనిచేసిన శ్రీనివాసంతి మాజీ మంత్రి రోజాకు అనుకూలంగా పనిచేసి టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టారు. రోజాకు తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అరుణ ఆధ్వర్యంలో మహిళలు చీర ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఈ సీఐ అడ్డుకుని.. అరెస్టు చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ చిత్తూరులో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాది నుంచి నగరి సీఐగా పనిచేస్తున్న సురేష్ ఎన్నికల సమయంలో ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. గాలి భానుప్రకాష్ మీద అప్పట్లో దాడి జరిగినా, కేసులు పెట్టలేదు. తాజాగా ఈయన్ను కూడా చిత్తూరు వీఆర్‌కు మార్చారు. తవణంపల్లె ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి వైసీపీ కోసం పనిచేశారు. ఎన్నికల తర్వాత ఆయనే లాంగ్ లీవు పెట్టి వెళ్లిపోయారు.