Share News

మొండిగోడల్లోనే సీవోసీ బిల్డింగ్‌, మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణాలు

ABN , Publish Date - May 27 , 2024 | 12:24 AM

తిరుపతి నగరపాలక సంస్థ సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ (సీవోసీ) నూతన భవన నిర్మాణానికిచ్చిన గడువు అయిపోయింది. అయినా ఇప్పటివరకు 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అలాగే మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణ పనులు కూడా ముగింపు దశకు రావాల్సి ఉండగా, పాతిక శాతం కూడా పూర్తవ్వలేదు. ఈ లెక్కన చూస్తే ఇవి మరో రెండేళ్లయినా పూర్తయ్యేలా కనిపించడంలేదు.

మొండిగోడల్లోనే సీవోసీ బిల్డింగ్‌, మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణాలు
ఆర్‌ఎల్‌కే1255 - నిర్మాణంలో ఉన్న సీవోసీ భవనం

తిరుపతి నగరపాలక సంస్థ సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ (సీవోసీ) నూతన భవన నిర్మాణానికిచ్చిన గడువు అయిపోయింది. అయినా ఇప్పటివరకు 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అలాగే మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణ పనులు కూడా ముగింపు దశకు రావాల్సి ఉండగా, పాతిక శాతం కూడా పూర్తవ్వలేదు. ఈ లెక్కన చూస్తే ఇవి మరో రెండేళ్లయినా పూర్తయ్యేలా కనిపించడంలేదు.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

స్మార్ట్‌ సిటీ నిధులతో నిర్మిస్తున్న సీవోసీ భవన నిర్మాణం పునాదుల్లోనే పురిటినొప్పులు పడుతోంది. రూ.71 కోట్ల వ్యయంతో ఈరోడ్‌కు చెందిన ఆర్‌.ఆర్‌.తులసీ బిల్డర్స్‌ 18 నెలల్లో ఐకానిక్‌ భవన నిర్మాణం పూర్తిచేయాలన్న నిబంధనతో టెండరు దక్కించుకుంది. అయితే దాదాపు 21 నెలలు గడుస్తున్నా మొండిగోడలే కనిపిస్తున్నాయి. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని, ఎన్నికలకు ముందు తమ చేతులతోనే ప్రారంభించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి భూమిపూజ కార్యక్రమంలో సభాముఖంగా కాంట్రాక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పాత కార్పొరేషన్‌ కార్యాలయాన్ని మార్పు చేసే క్రమంలో అనేక అవరోధాలను దాటి 2022 ఆగస్టు 21న కొత్త భవనానికి భూమిపూజ జరిగింది. పాత భవనం కూల్చడానికే నాలుగు నెలల సమయం తీసుకుని గత ఏడాది జనవరి నుంచి కొత్త భవన నిర్మాణ పనులు మొదలుపెట్టారు.

టీడీపీ హయాంలోనే ఐకానిక్‌ భవనానికి ప్రణాళిక

పాతభవనం ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతో మున్సిపల్‌ సిబ్బంది విధులు నిర్వహించేవారు. దాని లైఫ్‌ అయిపోయిందని ఇంజనీరింగ్‌ నిపుణులు ఏడేళ్ల క్రితమే స్ట్రక్చరల్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గత టీడీపీ హయాంలోనే ఐకానిక్‌ బిల్డింగ్‌ నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పటి కమిషనర్‌ విజయరామరాజు గతంలో తాను రాజమండ్రిలో అధునాతన మున్సిపల్‌ బిల్డింగ్‌ నిర్మించానని, అదే అనుభవంతో ఇక్కడ కూడా నిర్మిస్తామని, టెండరు దశకు కూడా వెళ్లారు. సీవోసీ బిల్డింగ్‌ అండ్‌ పాన్‌ సిటీ ఐసీటీ సొల్యూషన్స్‌ పేరిట రూ.225 కోట్ల స్మార్ట్‌ సిటీ నిధులతో డీపీఆర్‌ (డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) సిద్ధం చేశారు. భవన నిర్మాణం రూ.79కోట్లు, సీవోసీ సెట్‌పకోసం దాదాపు రూ.146కోట్లతో అప్పుడు బడ్జెట్‌ ప్రతిపాదన చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పెద్ద బడ్జెట్‌ పనులకు బ్రేకులు పడటం జరిగింది.

ఐకానిక్‌ భవనం ప్రత్యేకతలివే..

ఐకానిక్‌ భవనం పూర్తయితే తిరుపతికి తలమానికంగా స్వామివారి నామాలు ప్రతిబింబించేలా భవన నిర్మాణం ఉండనుంది. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఐదు అంతస్తులతో రూపుదిద్దుకోనుంది. పాత కార్యాలయం 2,289 చ.మీ విస్తీర్ణమైతే కొత్తగా నిర్మించబోయేది 14,607 చ.మీ విస్తీర్ణంతో ఉండనుంది. తిరుపతి ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థతోపాటు సిటిజన్‌ సర్వీసెస్‌, ఎన్విరాన్మెంట్‌ సైన్సెస్‌, నీరు, విద్యుత్‌ వినియోగ వివరాలు తెలుసుకునేందుకు ఈ సెంటరు నుంచి పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేయనున్నారు.

మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ పరిస్థితి ఇదీ..

2022 డిసెంబరు 9 రైల్వేస్టేషన్‌ పార్శిల్‌ ఆఫీస్‌ ఎదురుగా ఉన్న కార్పొరేషన్‌ స్థలంలో భూమిపూజ చేశారు. పనులు మొదలుపెట్టి దాదాపు 17 నెలలు పూర్తవుతున్నా పాతికశాతం కూడా పూర్తికాలేదు. ఈనిర్మాణం వల్ల అటువైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు రూ.50కోట్ల బడ్జెట్‌ అంచనాతో బేస్‌మెట్‌ మినహా ఏడు అంతస్తుల మల్టీఫ్లెక్స్‌ నిర్మాణం చేయనున్నారు. ఇందులో 373 కార్లు పార్కింగ్‌తోపాటు మూడు స్ర్కీన్లతో థియేటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. సీవోసీ బిల్డింగ్‌ కాంట్రాక్ట్‌ సంస్థ ఆర్‌ఆర్‌ తులసీ బిల్డర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.40.90కోట్లకు దీని టెండరు దక్కించుకుంది. నగరంలో పార్కింగ్‌ సమస్య తీర్చడానికి గత టీడీపీ హయాంలో రూ.15కోట్ల బడ్జెట్‌తో 120 కార్లు, 120 స్కూటర్లు పార్కింగ్‌ చేసుకునేలా మల్టీలెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటుకు గతంలో ప్రణాళికలు రూపొందించారు. బడ్జెట్‌ను రూ.15కోట్ల నుంచి రూ.50కోట్లకు పెంచుతూ కార్ల పార్కింగ్‌ సంఖ్యను కూడా పెంచారు.

ఎందుకీ సాగదీత..

తమిళనాడుకు చెందిన ఆర్‌.ఆర్‌.తులసీ బిల్డర్స్‌కు మంచి పేరుంది. గతంలో టీటీడీకి చెందిన పెద్ద ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తిచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎందుకీ సాగదీత అని ఆరాతీస్తే పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. టెండరు దక్కించుకున్నాక కమీషన్లు బలవంతంగా పెద్దమొత్తంలో ముట్టచెప్పాల్సి రావడంతో కాంట్రాక్టర్‌ అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. దీంతో పనులు మొదలుపెట్టిన క్రమంలో బిల్లులు సకాలంలో వచ్చాయి కానీ నాలుగు నెలలుగా పైసా రాకపోవడంతో కాంట్రాక్టర్‌ తలపట్టుకుంటున్నట్టు సమాచారం.

Updated Date - May 27 , 2024 | 12:24 AM