Share News

ఆరణి మౌనానికి అర్థం?

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:41 AM

చిత్తూరు వైసీపీ టికెట్‌ విషయంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మౌనం ఇప్పుడు నగరంలో చర్చగా మారింది.

ఆరణి మౌనానికి అర్థం?

చిత్తూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు వైసీపీ టికెట్‌ విషయంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మౌనం ఇప్పుడు నగరంలో చర్చగా మారింది. ఆయన మౌనానికి అర్థం ఏమిటి.. అసంతృప్తి ప్రకటనా లేక అధిష్ఠానానికి తలొగ్గడమా అనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఇటీవల ఆయనతో పాటు ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. అక్కడ చిత్తూరు సీటు విజయానందరెడ్డికి కన్‌ఫర్మ్‌ అయినట్లు, ఎమ్మెల్యేకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు విజయానందరెడ్డి చిత్తూరులో కీలక నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు కూడా. ఆరణి మాత్రం ఎక్కడా చిత్తూరు టికెట్‌ గురించి ప్రస్తావించడం లేదు. అడిగినా మాట దాటవేస్తున్నారు. దీంతో ఆయన సీఎం ఇచ్చిన రాజ్యాసభ హామీని నమ్మి సంతృప్తి చెందారా.. లేదా అసంతృప్తిలో ఉన్నారా అనేది ఇప్పుడు చిత్తూరులో చర్చనీయాంశంగా మారింది. సహజంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇవ్వనప్పుడు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి బుజ్జగించడం పార్టీల్లో సాధారణం. అయితే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు ఓటముల మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. గెలిచినా కొన్ని సమీకరణల్లో పదవి ఇవ్వకపోవడమూ జరుగుతుంటుంది. అందుకే ఎన్నికల ముందు ఇచ్చే హామీలకు అంతగా విలువ ఉండదు.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విజయానందరెడ్డి, ఆరణి శ్రీనివాసులు భిన్నధ్రువాలుగా ఉన్నారు. వారి వర్గాలు కత్తులు దూసుకున్నాయి. వీరిద్దరి మధ్య చిత్తూరులో ఓ స్థాయి అధికారులు నలిగిపోయారు. బలమైన వ్యతిరేక వర్గంతో ఎమ్మెల్యే ఈ ఐదేళ్లు కాస్త ఇబ్బంది పడినమాట వాస్తవమే. సగం క్యాడర్‌ ఆయన వ్యతిరేక వర్గం వద్దే ఉండేది. వ్యతిరేక వర్గానికి పనులు కూడా బాగా అయ్యేవి. ఇలాంటి కారణాలతో ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా మరో అభ్యర్థి గెలుపుకోసం పనిచేస్తారా.. అనే చర్చలు చిత్తూరులో జోరందుకున్నాయి. దశాబ్దాలుగా ఆయన కాంట్రాక్టరు కావడంతో ఈ ప్రభుత్వంలోనూ మంచిగా కాంట్రాక్టు పనులు చేసుకున్నారు. పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగులో ఉన్నాయని, ఈ కారణంగా ఆయన పార్టీ మారే సాహసం చేయరని కూడా ప్రచారం జరుగుతోంది.

టికెట్‌ కోసం బలిజ సంఘం సమావేశం

చిత్తూరు టికెట్‌ను అధికార పార్టీ రెడ్డి సామాజికవర్గానికి కేటాయించిందని ప్రచారమున్న నేపథ్యంలో బలిజ సంఘం నాయకులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన టీడీపీ- జనసేన నుంచి అయినా తమ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్‌ సాధించుకోవాలని బలిజ సంఘం నాయకులు నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఈ మేరకు ఇటీవల ఆ సంఘంలోని ప్రముఖ నాయకులు కొందరు చిత్తూరులో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందరి చూపూ డీకే కుటుంబంమీద ఉంది. టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఇప్పటికే బలిజ సంఘం నాయకులు బెంగళూరు, చిత్తూరుల్లో పలుమార్లు డీకే కుటుంబంతో భేటీ అయిన విషయం తెలిసిందే. శ్రీనివాస్‌ కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని ప్రకటించారు. ఇక డీకే ఆదికేశవులు తమ్ముడు బద్రినారాయణ తాము టీడీపీలోనే ఉన్నామని పలుమార్లు చెబుతూనే ఉన్నారు. ఈ కుటుంబానికి అవకాశం ఇస్తే జిల్లాలో మిగిలిన అభ్యర్థులకు కూడా ఆర్థిక సాయం చేస్తారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయినా డీకే కుటుంబ నిర్ణయాన్ని బట్టే టీడీపీ- జనసేన కూటమి అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది. సంక్రాంతిలోగా అభ్యర్థిని ప్రకటించాలని టీడీపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.

Updated Date - Jan 06 , 2024 | 01:41 AM