Share News

కుప్పంలోనూ వెబ్‌ కాస్టింగ్‌

ABN , Publish Date - May 11 , 2024 | 02:19 AM

కుప్పం నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని అన్ని కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షణలో ఎన్నికల జరపాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.

కుప్పంలోనూ వెబ్‌ కాస్టింగ్‌

అదనపు బలగాలు, ఎన్నికల సంఘం నిఘా

చిత్తూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని అన్ని కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షణలో ఎన్నికల జరపాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా కుప్పంలోనూ దీన్ని అమలు చేస్తున్నట్లు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్‌ ప్రకటించారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా వైసీపీ నాయకుల, పోలీసుల తీరు మారలేదు. వైసీపీ నాయకులేమో ప్రతిపక్షాల మీద దాడులు చేయడం, పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పుంగనూరు నియోజకవర్గంలోని 265 కేం ద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల నిర్వహణా తీరును వీడియో, ఆడియో ద్వారా రికార్డు చేస్తారు. ఎప్పటికప్పుడు ఈసీ పర్యవేక్షిస్తుంది. అలాగే పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోయినా 288 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంపైనా అరాచకాలకు కేంద్ర బిందువుగా మారిన బడా నేత దృష్టి పెట్టడం.. ఓడిస్తానని ప్రకటించడం.. అందుకనుగుణంగా అక్కడ అధికార పార్టీ ఓటుకు రూ.5 వేలు పంపిణీ చేయడం తెలిసిందే. ఇదంతా గమనించిన ఈసీ ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా కుప్పంలో వెబ్‌ కాస్టింగ్‌కు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలోని 243 పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌ అమలు కానుంది.

వెబ్‌ కాస్టింగ్‌ అంటే: పోలింగ్‌ రోజున కేంద్రం లోపలా, బయటా వీడియో, ఆడియో రికార్డ్‌ చేస్తారు. ఎన్నికల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు లైవ్‌ వీక్షించే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో కేంద్ర బలగాలూ అధికంగా మోహరిస్తాయి. నేతలు ఘర్షణలకు పాల్పడినా, రిగ్గింగ్‌కు ప్రయత్నించినా వెంటనే ఉన్నతాధికారులు అలర్ట్‌ అవుతారు. మరింత కట్టుదిట్టంగా రీపోలింగ్‌ నిర్వహిస్తారు. నేతలకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు.

Updated Date - May 11 , 2024 | 07:23 AM