మీ గుడ్లు, చికెన్ తిరిగిచ్చేస్తాం
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:40 AM
కరోనా కాలంలో తమకు గుడ్లు, చికెన్ పంపిణీ చేశానంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి పదేపదే ప్రస్తావిస్తూ తమను కించపరచడం బాగాలేదంటూ పలువురు ముస్లిం మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు

కరోనా కాలంలో తమకు గుడ్లు, చికెన్ పంపిణీ చేశానంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి పదేపదే ప్రస్తావిస్తూ తమను కించపరచడం బాగాలేదంటూ పలువురు ముస్లిం మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్, కోడిగుడ్లు, కూరగాయలతో మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.కరోనా సమయంలో ప్రచార ఆర్భాటం కోసం దాతలిచ్చిన కోడిగుడ్లు, చికెన్, కూరగాయలను ఎమ్మెల్యే పంపిణీ చేశారని చెప్పారు. అవి ఒకసారి తీసుకున్న పాపానికి నాలుగేళ్ల నుంచి రోజూ విలేకరుల సమావేశాలు పెట్టి మైనారిటీలను అవహేళన చేస్తున్నారని వాపోయారు. తాము చికెను, కోడిగుడ్లు, కూరగాయలను తిరిగి ఇచ్చేస్తామని వాటిని సంచుల్లో చేతబట్టి ప్రదర్శించారు. పట్టణంలోని కుమారస్వామి తిప్ప కూడలి నుంచి టీడీపీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది.మైనారిటీల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఎలాంటి కృషీ చేయలేదని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో మైనారిటీలంతా వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, పార్లమెంట్ కోశాధికారి కంఠా రమేష్, కాసరం రమేష్, మస్తాన్, మీర్జా తదితరులు పాల్గొన్నారు.
-శ్రీకాళహస్తి