Share News

‘మా ఊరికొస్తే చంపేస్తాం’

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:32 AM

ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మా ఉరుకొస్తే చంపేస్తాం’ అంటూ పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో శుక్రవారం వైసీపీ కార్యకర్తలు బీసీవై పార్టీకి చెందిన నలుగురు నాయకులపై కర్రలతో దాడి చేశారు. బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే రామచంద్రయాదవ్‌ కాన్వాయ్‌లోని వాహనం అద్దాలను ధ్వంసం చేశారు.

‘మా ఊరికొస్తే చంపేస్తాం’
వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వాహనం అద్దాలు

ఇరుపార్టీల నేతల వాగ్వాదాలు, తోపులాటలతో ఉద్రికత్త

పుంగనూరు, ఏప్రిల్‌ 26: ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మా ఉరుకొస్తే చంపేస్తాం’ అంటూ పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో శుక్రవారం వైసీపీ కార్యకర్తలు బీసీవై పార్టీకి చెందిన నలుగురు నాయకులపై కర్రలతో దాడి చేశారు. బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే రామచంద్రయాదవ్‌ కాన్వాయ్‌లోని వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. బాధితుల కథనం మేరకు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రయాదవ్‌ మాగాండ్లపల్లెలో రోడ్డుషో చేసి, వెళుతుండగా కాన్వాయ్‌ చివరలో ఉన్న వాహనంలోని ఆ పార్టీ నేతలు ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ‘మాకే పాంప్లెట్లు ఇస్తారా’ అంటూ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శశిభూషణ్‌రెడ్డి మరికొందరు బీసీవైపీ నాయకులు నారాయణస్వామి, వేణుగోపాల్‌రెడ్డి, వంశీ, సురేంద్రయాదవ్‌లపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దుర్భాషలాడి కరపత్రాలు చింపేశారు. వారు వాహనంలో వెళ్లిపోతుండగా వైసీపీ జెండాలతో వెంబడించి రాళ్లతో వెనుక అద్దాలను ధ్వంసం చేశారు. ఆ నలుగురిని పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న రామచంద్రయాదవ్‌ మాగాండ్లపల్లెకు చేరుకున్నారు. అప్పటికే పుంగనూరు సీఐ రాఘవరెడ్డి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు. రామచంద్రయాదవ్‌ రాగానే అడ్డుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పారు. తమ పార్టీ నాయకులను గ్రామస్తులు నిర్బంధించారని, వారిని విడిచిపెట్టాలని, అలాగే వారిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో వైసీపీ శ్రేణులు రావడం, బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో వాగ్వాదాలు, తోపులాటలతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సర్దిచెప్పి బీసీవై పార్టీ నాయకులను విడిపించడంతో పరిస్థితి సర్దుమణిగింది. ఇదిలావుంటే తన ఇంటిపై బీసీవైపీ నాయకులు దాడిచేశారని వైసీపీ కార్యకర్త శశిభూషణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బీసీవై పార్టీ నాయకుడు నారాయణస్వామి తమపై దాడి చేసి గాయపరిచారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గడదేశిలోనూ అడ్డగింత

పుంగనూరు మండలం గడదేశిలోనూ బీసీవై పార్టీ నాయకులను వైసీపీ శ్రేణులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నాయి. బీసీవైపీ అభ్యర్థి రామచంద్రయాదవ్‌ రోడ్డుషోలో భాగంగా గడదేశికి రాగానే కొందరు మద్యం మత్తులో గ్రామంలోకి రాకూడదని గొడవ చేశారు. ‘అడ్డుకోవడానికి మీరెవరు’ అంటూ వైసీవైపీ నేతలు ముందుకు దూసుకెళ్లారు. విషయం తెలియగానే పుంగనూరు పోలీసులు అక్కడికి చేరుకుని గొడవలు లేకుండా చూశారు.

ఓటమి భయంతోనే దాడులు : రామచంద్రయాదవ్‌

ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నారని, గొడవలు చేసిన వారిని వదిలిపెట్టేదిలేదని స్పష్టం చేశారు. వైసీపీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని, ప్రజల మద్దతు ఉంటే ఎన్నికల్లో చూసుకోవాలి తప్ప అధికారం ఉందని దాడులు చేయడం సిగ్గుచేటని ఖండించారు. ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 01:32 AM