Share News

ద్రవిడ వర్సిటీని ప్రక్షాళన చేస్తాం

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:49 AM

కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. స్థాపన లక్ష్యాలను గాలికొదలింది. పలు కోర్సులను రద్దు చేసింది. విద్యార్థులు చదువుకునే అవకాశం లేకుండా చేస్తోంది. మేము అధికారంలోకి రాగానే వర్సిటీని ప్రక్షాళన చేస్తాం. రద్దయిన అన్ని కోర్సులను తిరిగి ప్రవేశపెడతాం’ అని చంద్రబాబు అన్నారు.

ద్రవిడ వర్సిటీని ప్రక్షాళన చేస్తాం
సమావేశంలో పాల్గొన్న యువత

అన్ని కోర్సులను తిరిగి ప్రవేశపెడతాం

యువతతో ముఖాముఖిలో చంద్రబాబు

యువశక్తిని నిర్వీర్యం చేసిన జగన్‌ను సాగనంపాలని పిలుపు

కుప్పం/గుడుపల్లె, మార్చి 26: ‘కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. స్థాపన లక్ష్యాలను గాలికొదలింది. పలు కోర్సులను రద్దు చేసింది. విద్యార్థులు చదువుకునే అవకాశం లేకుండా చేస్తోంది. మేము అధికారంలోకి రాగానే వర్సిటీని ప్రక్షాళన చేస్తాం. రద్దయిన అన్ని కోర్సులను తిరిగి ప్రవేశపెడతాం’ అని చంద్రబాబు అన్నారు. కుప్పం గ్రానైట్‌ను ఐదేళ్లుగా వైసీపీ నేతలు కేజీఎఫ్‌ తరహాలో తవ్వి దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘గనులు, ఇసుక, బెరైటీస్‌ లాంటి ఖనిజ సంపదను దోచేశారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే మన ఇంటిమీద మనకు హక్కులుండవు. అందుకే ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలి’ అంటూ పిలుపునిచ్చారు. కుప్పంలో రెస్కోను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నియోజకవర్గంలోని యువతతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

కిరణ్‌కుమార్‌, రామకుప్పం: తటస్త ఓటర్లను ఎవరూ కలవడం లేదు. వారిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తే టీడీపీ ఘన విజయం సాధిస్తుంది.

చంద్రబాబు: యువత రాజకీయాల్లో ముందుకు రావాలి. మీరే తటస్తులను కలిసి ఓట్లు అభ్యర్థించి పార్టీ విజయానికి కృషి చేయండి. మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలో నేను ఆలోచిస్తా.

మురుగేష్‌, రామకుప్పం: ఒక్క అవకాశమంటూ జగన్‌ గద్దెనెక్కి కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలను.. వారి కుటుంబీకులను తిట్టిస్త్తున్నారు. అలాంటి నాయకుడు మాకు అవసరం లేదు.

చంద్రబాబు: అడ్డదారిలో వచ్చిన వ్యక్తి సీఎం అయితే ఇలాగే ఉంటుంది. అసెంబ్లీ వేదికగా నన్నే వేధించారు. ఇది కౌరవ సభని, గౌరవ సభ చేసి వస్తానని ఆనాడే చెప్పా. యువత నా వెంట ఉంటే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తా. రాజకీయాలను ప్రక్షాళన చేసి, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చ జరిగేలా చూస్తా.

ఆనంద్‌, మల్లానూరు: ఈ ప్రభుత్వంలో యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వీటి నివారణకు ఏంచేస్తారు?

చంద్రబాబు: మనం యువత మత్తుకు బానిసలు కాకుండా వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఉపాధి కల్పించడం ద్వారా వారు పెడదోవ పట్టకుండా, కుటుంబాలకు భారం కాకుండా, బాసటగా నిలిచేలా చర్యలు తీసుకుంటాం. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.

బాలకృష్ణ, చందం: ఎంఏ ఇంగ్లీష్‌ చేసిన నేను ఆపై కోర్సులకోసం ద్రవిడ వర్సిటీకి వెళితే చాలా కోర్సులు తీసేసి ఉన్నారు. ఈ వర్సిటీపై శ్రద్ధ తీసుకుంటారా?

చంద్రబాబు: ద్రవిడ వర్సిటీ స్థాపన లక్ష్యాలైన భాష, సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యమిస్తాం. జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలలను ద్రవిడ వర్సిటీకి అనుసంధానిస్తాం. రద్దు చేసిన కోర్సులను పునరుద్ధరిస్తాం. ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటుచేసి సెట్రల్‌ వర్సిటీగా తీర్చిదిద్దుతాం.

Updated Date - Mar 27 , 2024 | 12:49 AM