Share News

తిరుపతి ఎంపీ సీటుకు కొత్త అభ్యర్థిని ప్రకటిస్తాం

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:24 AM

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. అనంతపురంలో వచ్చే నెల మొదటివారంలో జరగనున్న వైసీపీ ‘సిద్ధం’ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో సోమవారం సమావేశం జరిగింది.

తిరుపతి ఎంపీ సీటుకు కొత్త అభ్యర్థిని ప్రకటిస్తాం
అనంతపురం సభకు సిద్ధం పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి ,రోజా తదితరులు

-టికెట్లు రానివారిని ఇతర పదవులతో సంతృప్తిపరుస్తాం

- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

తిరుపతి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. అనంతపురంలో వచ్చే నెల మొదటివారంలో జరగనున్న వైసీపీ ‘సిద్ధం’ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో సోమవారం సమావేశం జరిగింది.జన సమీకరణ ఏర్పాట్లపై వైసీపీ ఎమ్మెల్యేలతో, నాయకులతో మంత్రి చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను అవినీతిపరుడో కాదో ప్రజలకు తెలుసునని, ఆదిమూలంపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తిరుపతి ఎంపీగా ఆదిమూలం స్థానంలో కొత్త అభ్యర్థిని పార్టీ ప్రకటిస్తుందన్నారు.టికెట్లు రానివారిని ఇతర పదవులతో సంతృప్తిపరిచేందుకు పార్టీ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. రాయలసీమ జిల్లాల్లో అన్ని సీట్లనూ వైసీపీ గెలుచుకుంటుందన్నారు.

ఫ పార్టీ ఆదేశిస్తే ఒంగోలుకు సిద్ధమే : మంత్రి రోజా

మంత్రి రోజా మాట్లాడుతూ ‘నగరి నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న నేను ఒంగోలుకు పోవాల్సిన అవసరం ఏముందో అర్థం కావడంలేదు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు కూడా నేను సిద్ధమే’ అన్నారు. తాను నామినేటెడ్‌ పదవులు అమ్ముకుంటున్నానని చంద్రబాబు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి తీసుకునివుంటే నిరూపించాలన్నారు. వైసీపీ పుణ్యంతో కౌన్సిలర్‌ అయిన మహిళ ఎవరో చెప్పిన మాటలకు లొంగి తనపై బురద జల్లారని, అలాంటివాళ్లకు భగవంతుడే సమాధానం చెబుతాడన్నారు.టీడీపీ, జనసేన పార్టీలకు నాయకులు లేక అభ్యర్ధుల జాబితా విడుదల చేయలేకపోతున్నారన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేసే నాన్‌లోకల్‌ లీడర్లు ఎక్కువైపోయారంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు, పవన్‌ మధ్యలో నాలుగో కృష్ణుడిలాగా షర్మిల ప్రవేశించిందన్నారు. రాష్ర్టాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌ పార్టీలో చేరి వైఎస్‌ కుటుంబాన్ని ముక్కలు చేస్తోందన్నారు.మంత్రి పెద్డిరెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన వ్యాఖ్యలు కరెక్టు కాదన్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని చెప్పడానికి ఆదిమూలం వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు.

ఫ పలువురు నేతలు డుమ్మా

రాయలసీమ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి జయరాం,ఎంపీ గోరంట్ల మాధవ్‌, పూతలపట్టు, సత్యవేడు, మదనపల్లె ఎమ్మెల్యేలు ఎంఎస్‌ బాబు, ఆదిమూలం, నవాజ్‌ భాషా, తిప్పేస్వామి సమావేశానికి రాలేదు.అదేవిధంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి, రాజంపేట, కదిరి ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జున్‌ రెడ్డి, సిద్దా రెడ్డి కూడా హాజరు కాలేదు.కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.తిరుపతిలో సమావేశం జరిగినప్పటికీ స్థానిక నేతలు కన్పించకపోవడాన్ని పలువురు చర్చించుకోవడం కనిపించింది.ఎంపీ గురుమూర్తి మినహా తక్కినవారు సమావేశంలో కనిపించలేదు.

Updated Date - Jan 30 , 2024 | 01:25 AM