Share News

మేమంతా సిద్ధంగా లేం!

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:50 AM

ప్రచారసభల్లో పదేపదే మీరు సిద్ధమా..అంటూ జగన్‌ అడుగుతూ ఉంటారు. వెంటనే కెమెరాలు వేదికకు దగ్గరగా ఒకే ప్రాంతం వైపు మళ్లుతాయి.

మేమంతా సిద్ధంగా లేం!
జగన్‌ మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్న జనం

- జగన్‌కి తేల్చిచెప్పిన జనం

-వెలవెలబోయిన నాయుడుపేట బహిరంగసభ

ప్రచారసభల్లో పదేపదే మీరు సిద్ధమా..అంటూ జగన్‌ అడుగుతూ ఉంటారు. వెంటనే కెమెరాలు వేదికకు దగ్గరగా ఒకే ప్రాంతం వైపు మళ్లుతాయి.అక్కడ వ్యూహాత్మకంగా ముందే ఏర్పాటు చేసుకున్నవారు చేతులెత్తి అరుస్తారు. ఉమ్మడి జిల్లాలో మదనపల్లె, పూతలపట్టు సభల్లో ఈ డ్రామా పండినా.. నాయుడుపేట సభలో మాత్రం అడ్డం తిరిగింది. జనం లేక సభ వెలవెలపోగా, వచ్చిన జనం కూడా జగన్‌ మైకు ముందుకు రాగానే జారుకోవడం మొదలుపెట్టారు. మిగిలిన ఆ కాస్తమందీ పేలవంగా స్పందించారు. ఒక రకంగా జగన్‌ వెంట నడవడానికి తామంతా సిద్ధంగా లేమని జనం ప్రకటించినట్టు అయ్యింది. ఈ పరిస్థితి చూసిన వైసీపీ నాయకులే..‘అయ్యో ఇలా అయిపోయిందేమిటా?’ అని దిగులు ముఖాలతో కనిపించారు. గురువారం జగన్‌ బస్సు యాత్రలోనూ ఇదే సీను రిపీట్‌ అయ్యింది. మరోవైపు జాతీయ రహదారి మొత్తం స్తంభింపజేసి మండుటెండల్లో ప్రజలకు నకరం చూపించారు. ఐదేళ్ల తర్వాత తొలిసారి తమ ముందుకు వచ్చిన జగన్‌రెడ్డి పాత హామీలు గుర్తు చేసుకుని మంచి మాట ఏదైనా చెప్తాడా అని చూసిన వారు నిరాశ చెందారు. అభివృద్ధి ఊసే లేకుండా యధాప్రకారం తిట్ల దండకాలతోనే ఆయన ప్రసంగం ముగియడం విశేషం.

-రేణిగుంట/ఏర్పేడు/నాయుడుపేట/శ్రీకాళహస్తి/పెళ్లకూరు/గూడూరు,ఆంధ్రజ్యోతి

జనమేరి నాయకా?

నాయుడుపేట సభకు జిల్లావ్యాప్తంగా భారీగా జనాన్ని సమీకరించాలని అధికార పార్టీ నేతలు చేసిన ప్రయత్నం విఫలమైంది. గత మంగళవారం నుంచే సిద్ధం సభల కోసం 250 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. అవి మదనపల్లె, పూతలపట్టు సభలకు జనాన్ని తరలించే పనిలో బిజీగా నడిచాయి. గురువారం వాటిని నాయుడుపేట సభకు మళ్లించారు. అయితే ఆ బస్సులు సరిపోవని భావించి బుధవారం అర్ధరాత్రి అదనంగా మరో 150 బస్సులు కేటాయించారు. మొత్తం 400 బస్సులు కేటాయించినా సభకు జనం రాలేదు. సభ వేదికపైకి జగన్‌ చేరుకునే సమయానికి కేవలం ముందువైపు గ్యాలరీల్లో మాత్రమే కార్యకర్తలు వున్నారు. ముప్పావు వంతు గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. జగన్‌ వేదికపైకి రావడంతో సభ వెలుపల, రోడ్లపై వున్న కార్యకర్తలను, ప్రజలను లోనికి వెళ్ళాలంటూ పోలీసులు బతిమాలారు.జగన్‌ మాట్లాడడం మొదలుపెట్టిన పది నిమిషాల నుంచే ముందు వరుస గ్యాలరీల్లో పలచగా వున్న జనం కూడా బయటకు జారుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకూ జరిగిన జిల్లాస్థాయి మేమంతా సిద్ధం సభల్లో ఇంతగా ఫెయిలైన సభ మరోటి లేదని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.

హామీలు మరిచిన జగన్‌

గత ఎన్నికల్లో జిల్లా ప్రజలకు తానిచ్చిన హామీలను సభలో జగన్‌ ఏమాత్రం ప్రస్తావించలేదు. 2018లో పాదయాత్రలోనూ, 2019 ఎన్నికల ప్రచారంలోనూ జగన్‌ జిల్లా ప్రజలకు అనేక హామీలిచ్చారు. గాలేరు-నగరి, ఎస్‌ఎస్‌ కెనాల్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని, గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానని, మన్నవరం భెల్‌-ఎన్టీపీసీ ఫ్యాక్టరీ తెరిపిస్తానని, పులికాట్‌ సరస్సులో పూడిక తొలగిస్తామని... ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాటి గురించి ప్రస్తావించలేదు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పులికాట్‌ పూడిక తీత వంటి సమస్యలు ప్రస్తావించినా జగన్‌ వినిపించుకోలేదు. దానిపై స్పందించలేదు. దీంతో ఇటు వైసీపీ కార్యకర్తలు, అటు ప్రజలు కూడా తీవ్ర నిరాశకు, అసంతృప్తికి లోనయ్యారు.

శ్రీకాళహస్తి నేతల అత్యుత్సాహం

జనాన్ని ఇబ్బంది పెట్టి మరీ ఇన్నేసి బస్సులను మళ్లించినా నాయుడుపేట సభ ఎందుకు పలచబారిపోయిందా అని ఆరా తీస్తే.. శ్రీకాళహస్తి వైసీపీ నేతలు వాటిలో ఎక్కువ తమ నియోజకవర్గంలోని ప్రఽధాన కూడళ్ళకు జనాన్ని చేరవేయడానికే పరిమితం చేసుకున్నారని తెలిసింది. రేణిగుంట మండలం గురవరాజుపల్లి వద్ద జగన్‌ రాత్రి బస చేసిన చోటకు 500 మంది మహిళలను బస్సుల్లో ముందే రప్పించి, ఆయన్ను చూడడానికి నిరీక్షిస్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చారు. గంటన్నరకు పైగా అక్కడే పడిగాపులు కాసిన మహిళలకు కనీసం నిలువ నీడ కూడా లేకపోయింది. ఏర్పేడు మండలంలో ఒకటి రెండు చోట్ల మహిళా రైతులు, పెన్షనర్లు అయిన వృద్ధులను కూడా స్థానిక వైసీపీ నేత ఏర్పాటు చేశారు. అక్కడ బస్సు ఆపించి సీఎం జగన్‌ కిందకు దిగి వారితో మాట్లాడేలా ముందస్తు ఏర్పాటు చేశారు. కాగా జిల్లాలో మొత్తం 1100 ఆర్టీసీ బస్సులుండగా వాటిలో 400 బస్సులు సిద్ధం సభకు కేటాయించారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లలో బస్సుల కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది.

కార్యకర్తలున్న చోట్ల ఆగని బస్సు

ఏర్పేడు మండల కేంద్రంలో స్థానిక నేతలు, కార్యకర్తలు రెండు గంటల నుంచీ పడిగాపులు కాశారు. భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే బస్సు ఆపకుండా జగన్‌ లోపలి నుంచీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళిపోవడంతో వీరంతా తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. పలుచోట్ల కూడా ఇలానే జరిగింది. ముందే నిర్ణయించుకున్న చోట్ల తప్ప మరెక్కడా జగన్‌ బస్సు ఆగలేదు.

క్రేన్‌కి వేలాడినా..

ఏర్పేడులోనే ఓ కార్యకర్త క్రేన్‌ సాయంతో భారీ గజమాల వేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. జగన్‌ బస్సు సమీపించగానే క్రేన్‌ కొక్కీ వద్ద ఆ కార్యకర్త గాల్లో వేలాడుతూ మాల వేసేందుకు సంసిద్ధమయ్యాడు. అయితే బస్సు ఆపినా జగన్‌ మాత్రం కిందకు దిగలేదు. దీంతో క్రేన్‌ సాయంతో ఆ కార్యకర్త గజమాలను బస్సు పైభాగంలో తాకించి సంతృప్తి పడాల్సి వచ్చింది. ఇంత ప్రమాదకర ఫీట్‌ చేసిన ఆ కార్యకర్తను వైసీపీ నేతలు గానీ పోలీసులు గానే వారించకపోవడం విమర్శలకు దారి తీసింది.

81 కిలోమీటర్ల బస్సుయాత్రతో జనానికి నరకం

రేణిగుంట మండలం గురవరాజుపల్లి నుంచి జగన్‌ గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరి నాయుడుపేటకు సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. ఈ దూరం 53 కిలోమీటర్లు. అలాగే అక్కడ నుంచీ గూడూరు వద్ద జిల్లా సరిహద్దుల వరకూ 28 కిలోమీటర్లు. మొత్తం ఈ 81 కిలోమీటర్ల దూరం సాగిన బస్సు యాత్ర జిల్లావ్యాప్తంగా వేలాదిమందికి ప్రత్యక్ష నరకం చూపించింది. రేణిగుంటలో సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం కావడానికి గంటా రెండు గంటల ముందే ట్రాఫిక్‌ ఆపేశారు. చెన్నై, కడప, నెల్లూరు, తిరుపతి కీలక మార్గాల్లో రెండు గంటల పాటు ట్రాఫిక్‌ ఆపడంతో వేలాది వాహనాలు కిలోమీటర్ల కొద్దీ ఆగిపోయాయి. బస్సు యాత్ర ప్రారంభమైన అరగంట తర్వాత రాకపోకలకు అనుమతించినప్పటికీ ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో మరో రెండు గంటల పాటు తీవ్ర అవస్థ పడ్డారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి, పెళ్ళకూరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక విజయవాడ-చెన్నై జాతీయ రహదారిపై వేల కొద్దీ వాహనాలు రెండు వైపులా నిలిచిపోయాయి. ఇలా కనీసం నాలుగైదు గంటల పాటు జాతీయ రహదారిపై వాహనాలు చిక్కుకుపోయాయి. రేణిగుంట మండలం రామకృష్ణాపురం కూడలి వద్ద రెండు అంబులెన్సులు ఇరుక్కుపోయాయి. ఓ వాహనం రోగిని తేవడానికి శ్రీకాళహస్తికి వెళుతుండగా మరోటి రోగిని తిరుపతికి తీసుకెళుతూ గంటల కొద్దీ చిక్కుకుపోయింది. వేసవిలో ఎండ ధాటికి తోడు ఉక్కపోతకు వాహనాల్లోని జనం నరకయాతన అనుభవించారు.

డ్రైవర్లు తక్కువ....యజమానులే ఎక్కువ

బస్సు యాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పొయ్య గ్రామం వద్ద సీఎం జగన్‌ లారీ, ఆటో డ్రైవర్లతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ఈ సమావేశం డ్రైవర్ల పేరిట జరిపినా నిజానికి హాజరైన వారిలో లారీ, ఆటో డ్రైవర్లు చాలా తక్కువ. వాటి యజమానులే ఎక్కువగా కనిపించారు. సమావేశంలోకి జగన్‌ రాకముందే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ పాత్రికేయులను స్థానిక నేతల ద్వారా గుర్తించి బయటకు పంపించేశారు. సమావేశం పేరుకు ముఖాముఖీ అయినా వారితో ముఖాముఖీ మాట్లాడిందేమీ లేదు. వారి చేతికి మైక్‌ ఇవ్వడంతో ఎక్కువమంది జగన్‌ను పొగిడేందుకే సమయం వెచ్చించారు. ఒకరిద్దరు సమ్యలు ప్రస్తావించినా జగన్‌ వాటిని వినిపించుకోనట్టుగా మిన్నకుండిపోయారు తప్పితే స్పందించలేదు. ఓ ఆటో డ్రైవర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ స్కూలు పిల్లలకు ఏటా ఉచితంగా యూనిఫామ్‌ ఇస్తున్న విధంగా తమకు కూడా ఏడాదికి రెండు జతలు యూనిఫామ్‌ అందజేయాలని కోరగా ఆ మాటలను జగన్‌ వినిపించుకోనట్టుగా వుండిపోయారు. సూచనల పెట్టెలు రెండు ఏర్పాటు చేశామని, ఎవరైనా సలహాలు, సూచనలు చేయదలిస్తే స్లిప్పులో రాసి ఆ పెట్టెల్లో వేస్తే తాను తర్వాత పరిశీలిస్తానంటూ చెప్పి నిష్క్రమించారు.

సీఎం చెక్కు చెల్లాలంటే 40 రోజులు ఆగాలట!

రేణిగుంట మండలం గురవరాజుపల్లి నుంచీ బస్సు యాత్ర ప్రారంభించిన సీఎం జగన్‌ కొంచెం దూరం వెళ్లగానే వెదుళ్ళ చెరువు వద్ద తండ్రీ కొడుకులు ఆపారు. తన 12 ఏళ్ళ కుమార్తె చైత్ర వినికిడి సమస్యతో బాధపడుతుంటే ఆపరేషన్‌ చేయించామని తండ్రి వివరించాడు. సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేయగా చెక్కు వచ్చిందని, కానీ చెల్లడం లేదని వాపోయాడు. అయితే సీఎం సహాయనిధి నుంచీ సాయం అందాలంటే 40 రోజలు ఆగాలి అని సమాధానం ఇచ్చి జగన్‌ ముందుకు సాగిపోవడంతో తండ్రీ తనయలు తెల్లబోయారు.

Updated Date - Apr 05 , 2024 | 01:50 AM