Share News

నీరు లేక మృత్యుకేక

ABN , Publish Date - Jun 03 , 2024 | 02:19 AM

నాడు ఆహ్లాదం పంచిన ఆ కేంద్రం ఇప్పుడు ఆవేదన కలిగిస్తోంది. కిలకిలలకు బదులు పక్షులు విలవిలలాడుతుంటే హృదయం ద్రవించిపోతోంది. విహార విడిది కోసం ఖండాలు దాటి వచ్చిన అరుదైన విహంగాలకు ఆహారమూ కరువయ్యింది. జలకళతో కేరింతలు కొడుతూ కాలాన్ని మరిచిపోయిన గూడబాతు(పెలికాన్‌)లకు గుక్కెడు నీరే గగనమైంది. దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు పక్షుల కేంద్రంలో ఇప్పుడు మూగ ప్రాణుల మరణ మృదంగం కలవరపెడుతోంది. కాసింత నీరూ అందించలేని కారుణ్య రహిత అధికార యంత్రాంగ తీరును ఇది ప్రతిబింబిస్తోంది.

 నీరు లేక మృత్యుకేక

నాడు ఆహ్లాదం పంచిన ఆ కేంద్రం ఇప్పుడు ఆవేదన కలిగిస్తోంది. కిలకిలలకు బదులు పక్షులు విలవిలలాడుతుంటే హృదయం ద్రవించిపోతోంది. విహార విడిది కోసం ఖండాలు దాటి వచ్చిన అరుదైన విహంగాలకు ఆహారమూ కరువయ్యింది. జలకళతో కేరింతలు కొడుతూ కాలాన్ని మరిచిపోయిన గూడబాతు(పెలికాన్‌)లకు గుక్కెడు నీరే గగనమైంది. దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు పక్షుల కేంద్రంలో ఇప్పుడు మూగ ప్రాణుల మరణ మృదంగం కలవరపెడుతోంది. కాసింత నీరూ అందించలేని కారుణ్య రహిత అధికార యంత్రాంగ తీరును ఇది ప్రతిబింబిస్తోంది.

ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకునే నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో విదేశీ విహంగాల మృత్యు ఘోష వినిపిస్తోంది. అడుగంటిన నీటి వనరుల్లో అల్లల్లాడుతున్న పక్షుల యాతన చూస్తే గుండె చెరువవుతోంది. దేశ విదేశాలను దాటి వచ్చే విహంగాల విడిదికి కేరాఫ్‌ అయిన నేలపట్టులో ‘దాహాకారాల’ తీరు దయనీయంగా మారింది. ఏటా అక్టోబరులో సుమారు 120 రకాలకు చెందిన వేల సంఖ్యలో పక్షులు ఇక్కడ విడిది చేస్తాయి. ఇక్కడున్న రెండు మంచి నీటి చెరువుల్లో చెట్లపై కొలువుదీరి ఆనందాన్ని పంచుతాయి. కేంద్రమంతా సందడిచేస్తాయి. తెల్లారగానే ఆహారం కోసం పరిసర పొలాల్లో, పులికాట్‌ సరస్సులో వాలిపోయి సాయంత్రం మళ్లీ నేలపట్టుకు చేరుకుంటాయి. ఏప్రిల్‌ మొదటి వారానికల్లా తిరిగి సొంతప్రాంతాలకు పయనమవుతాయి.

చెట్లపై నిర్జీవంగా..

ప్రస్తుతం పక్షుల రక్షిత కేంద్రంలో నీటి వనరులు అడుగంటిపోయాయి. ఆహార వేటలో రెక్కలు అలసిపోయినా ఫలితం కనిపించడం లేదు. ఎండిన డొక్కలతో ఈసురోమంటూ పక్షులు గూడు చేరుకుంటున్నాయి. గొంతు తడుపుకొందామంటే కనుచూపుమేరలో చుక్కనీరు కనిపించడం లేదు. ఫలితంగా ఈ విదేశీ అతిఽథులు ఆకలితో అలమటిస్తున్నాయి. దుర్భరస్థితిలో కొన్ని మృత్యువాత పడుతున్నాయి. పదుల సంఖ్యలో పెలికాన్‌ పక్షులు ప్రాణం విడుస్తున్నాయి. చెట్లపై నిర్జీవంగా పడున్న కళేబారాలు కనిపిస్తున్నాయి.

ప్రత్యామ్నాయమున్నా పట్టించుకునే వారేరి..

కొన్ని పెలికాన్‌ పక్షులు వయో భారంతో తిరిగి తమ ఖండాలకు చేరుకోలేక నేలపట్టులోనే ఆగిపోతున్నాయి. ఇలాంటి పక్షుల ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. చెరువుల్లో నీరు పూర్తిగా అడుగంటి పోతే పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం మొదటి చెరువు అడుగంటింది. ఉన్న కొద్దిపాటి బురద నీరు తాగుతున్న పక్షులు అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నాయి. పది రోజుల్లోనే సుమారు 20 వరకు చనిపోయినట్లు అంచనా. ఈ కేంద్రంలో ఇప్పుడు 50 పెలికాన్‌ పక్షులు సంచరిస్తున్నాయి. వీటి ఆహారం, నీరు కోసం స్థానిక వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. నీరసంతో సత్తువ కోల్పోయిన పక్షులను పట్టుకుని పులికాట్‌ సరస్సులో విడిచిపెడితే కనీసం ప్రాణలైనా నిలబడతాయి. అలాంటి ప్రయత్నమూ చేయకుండా అధికారులు చేతులెత్తేశారు. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మిగిలిన ప్రాణులు కూడా విగత జీవులయ్యే ప్రమాదం నెలకొంది.

మృత్యువు అంచున పెలికాన్‌

ఆస్ర్టేలియా, బర్మా, బంగ్లాదేశ, పాకిస్తాన్‌, శ్రీలంక వంటి దేశాల నుంచి పెలికాన్‌ పక్షులు ఇక్కడ విడిదికి విచ్చేస్తాయి. 28 ఏళ్ల జీవితకాలం ఉండే వీటి సగటు బరువు 4.54 నుంచి 7.7 కిలోల వరకు ఉంటుంది. సుదీర్ఘ ముక్కు, 152 నుంచి 188 సెం.మీ వరకు పొడవు రెక్కలు వీటి ప్రత్యేకత. అరుదైన ఈ జాతి పక్షుల్లో కొన్ని నేలపట్టుకు వచ్చాక వయోభారంతో తిరిగి ఖండాంతరాలు వెళ్లలేక ఇక్కడే ఉండిపోతున్నాయి. ఎటువంటి సంరక్షణ లేక ఇవి ఇక్కడే విషాదాంతమవుతున్నాయి.

ఆ హామీలు నీటిమూటేనా..

నేలపట్టు పక్షుల కేంద్రంలోని రెండు చెరువులను వేసవికి ముందు నీటితో నింపితే మండుటెండలోనూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఏటా మేలో మృత్యు ఘోష వినిపిస్తోంది. పక్షులు చనిపోవడం పరిపాటిగా మారింది. ఫ్లెమింగో వేడుక వేళ నాయకులు వస్తుంటారు. ఇక్కడి చెరువుల్లో ఎప్పుడూ జలకళ ఉండేలా చూస్తామంటూ హామీలిస్తున్నా నీటిమూటగానే మిగిలిపోతున్నాయి.

Updated Date - Jun 03 , 2024 | 02:19 AM