Share News

అంగన్వాడీల జల దీక్ష

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:11 AM

తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారంతో 24వ రోజుకు చేరింది. సీడీపీవో, ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు.

అంగన్వాడీల జల దీక్ష
కార్వేటినగరంలోని పద్మసరస్సులో దిగి అంగన్వాడీ కార్యకర్తల నిరసన

చిత్తూరు, జనవరి 4: తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారంతో 24వ రోజుకు చేరింది. సీడీపీవో, ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కార్వేటినగరం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపిన అంగన్వాడీలు పద్మసరస్సు చెరువు వద్దకు చేరుకున్నారు. ఆ చెరువులో నిలబడి జల నిరసన దీక్ష చేశారు. సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండు చేశారు. చిత్తూరులో గురువారం ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘ నేతలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. 24 రోజులుగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. బుధవారం జరిగిన కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్లే సమయంలో తమను పోలీసులు నిర్బంధించడానికి నిరసనగా కుప్పంలో అంగన్వాడీలు నిరసన గళం విప్పారు. పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ దీక్షా శిబిరంలో పడుకుని నిరసన తెలిపారు. కలెక్టరేట్‌ ముట్టడి సందర్భంగా పోలీసులతో విచక్షణా రహితంగా మహిళలని కూడా చూడకుండా ఈడ్చి లాగి పడేయడం బ్రిటిష్‌ రాజ్యాన్ని తలపించిందని యూనియన్‌ నేతలు ధ్వజమెత్తారు. పలమనేరులో అంగన్వాడీల నిరసనకు సీఐటీయూ నేతలు సంఘీభావం తెలిపారు. పుంగనూరు సీడీపీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలునిరసన కొనసాగించారు. అంగన్‌వాడీలకు రూ.26 వేల జీతం, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చే వరకు సమ్మె విరమించేది లేదని భీష్మించారు.

Updated Date - Jan 05 , 2024 | 01:11 AM