Share News

వైసీపీ ప్రచారాలకు వలంటీర్లే దిక్కు!

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:53 AM

జిల్లావ్యాప్తంగా వెయ్యిమందికి పైగా రాజీనామా రిజైన్‌ చేసి ప్రచారంలోకి రావాలంటూ వైసీపీ నాయకుల ఒత్తిడి రెండు నెలలకు రూ.20 వేలు ఆఫర్‌తో పాటు జూన్‌లో మళ్ళీ కొనసాగింపు హామీ

వైసీపీ ప్రచారాలకు వలంటీర్లే దిక్కు!

తిరుపతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వలంటీర్ల రాజీనామాలు మంగళవారానికి అధికారిక లెక్కల ప్రకారం వెయ్యి దాటాయి. ఎంత బలగం వున్నా, ఎన్ని వనరులున్నా ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నేతలకు వలంటీర్లే దిక్కవుతున్నారు. అయితే ఎన్నికల కమిషన్‌ నుంచీ ఆంక్షలున్న కారణంగా వాటి నుంచీ తప్పించుకుని స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారానికి వినియోగించుకునేందుకు వారిపై రాజీనామాలకు ఒత్తిడి తెస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రాజీనామా చేసే వలంటీర్లకు ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ఇస్తున్నారు. రాజీనామాలకు వస్తున్న ఒత్తిడిని బట్టి చూస్తుంటే అధికార పార్టీ ఎన్నికల్లో వలంటీర్లపై ఏ స్థాయిలో ఆధారపడుతోందో చెప్పకనే చెబుతోంది.

జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం నాటికి 1058 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. సోమవారం వరకూ 902 మంది విధుల నుంచీ తప్పుకోగా మంగళవారం మరో 156 మంది బాధ్యతల నుంచీ తప్పుకున్నారు. అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గం నుంచీ 276మంది వలంటీర్లు రాజీనామా చేయగా సూళ్ళూరుపేట నుంచీ 264మంది, శ్రీకాళహస్తిలో 233మంది, వెంకటగిరి నుంచీ 149మంది, గూడూరులో 95మంది, తిరుపతిలో 34మంది, సత్యవేడులో అత్యల్పంగా ఏడుగురు రాజీనామాలు సమర్పించారు. అనధికారికంగా చూస్తే రాజీనామా చేసిన వారి సంఖ్య దీనికి రెట్టింపు కంటే ఎక్కువగా వుంది. వలంటీర్లు తమ రాజీనామా లేఖలను ఆయా పంచాయతీ కార్యదర్శులకు అందజేస్తున్నారు. వారు రికార్డు తయారు చేసుకుని ఎంపీడీవోలకు సమర్పించాలి. ఎంపీడీవోలు ఆ సమాచారాన్ని జిల్లా కేంద్రంలోని డీఎల్‌డీవోకు నివేదించాలి. సంబంధిత అధికారి అప్రూవ్‌ చేశాకే రాజీనామా అధికారికమవుతుంది. ఈ ప్రక్రియకు రెండుమూడు రోజులు పడుతున్నందున ఏరోజుకారోజు రాజీనామాల సంఖ్య అధికారికంగా ప్రకటించడం లేదు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 23 మంది తొలగింపు

జిల్లాలో ఇప్పటి వరకూ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కారణంతో తొలగించిన వలంటీర్ల సంఖ్య 23కు చేరింది. శ్రీకాళహస్తిలో అత్యధికంగా తొమ్మిదిమందిని, సత్యవేడులో ఏడుగురిని, తిరుపతిలో ఐదుగురిని, గూడూరు, సూళ్ళూరుపేటల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 23మందిని ఇప్పటి వరకూ తొలగించారు.అధికార పార్టీ నేతలకు ఎంత అనుచరగణమున్నా, ఎన్ని ఆర్థిక వనరులున్నా ఎన్నికల్లో మాత్రం ప్రఽధానంగా వలంటీర్లపైనే ఆధారపడుతున్నారు. గ్రామ, వార్డుల పరిధిలో వలంటీర్లకున్న విస్తృత పరిచయాలు, ప్రభావం ఇతరులకు వుండడం లేదు. ప్రతి యాభై ఇళ్ళకు ఒక వలంటీరు అందుబాటులో వుండడం, ఆ యాభై కుటుంబాలను తరచూ కలుస్తూ వుండడం, ప్రభుత్వ పథకాల లబ్ధిని అందజేస్తుండడం, ఇతరత్రా ప్రభుత్వ పనులకు కూడా జనం వారిపై ఆధారపడుతుండడం దీనికి కారణం. దీంతో ఏ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ కులం లేదా ఏ మతం? ఎంతమంది ఓటర్లున్నారు? వారిలో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నది ఎంతమంది? వారి నేపధ్యం? ఏ పార్టీకి సానుభూతిపరులు? వంటి సమాచారం వలంటీర్ల నుంచే రాబడుతున్నారు. వీటన్నింటికీ మించి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులను, పార్టీ నేతలను కూడా వలంటీర్లే ప్రజలకు పరిచయం చేయాల్సిన పరిస్థితి. దీనికి మించి పంపకాలకు వలంటీర్లను మించిన నమ్మకమైన ప్రత్యామ్నాయం అధికార పార్టీ నేతలకు మరొకరు దొరకడం లేదు. ఈ అంశాలను దృష్టిలో వుంచుకుని అధికార పార్టీ నేతలు వలంటీర్లపైనే భారం వేస్తున్నారు. ఆ పనులు స్వేచ్ఛగా, నిరాటంకంగా జరగడం కోసం రాజీనామాలకు ఒత్తిడి తెస్తున్నారు.

చంద్రగిరిలో నగదు ఆఫర్‌

చంద్రగిరి నియోజకవర్గంలో వలంటీర్ల రాజీనామాలకు అధికార పార్టీ నేతలు నగదు ఆఫర్‌ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు తమ పరిధిలోని వలంటీర్లను కలసి రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారు. అందుబాటులోకి రాని వారికి పదేపదే ఫోన్లు చేస్తున్నారు. రాజీనామా చేయడానికి ఇష్టపడని వారు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకుని అందుబాటులో లేకుండా పోతున్నారు. నెలకు రూ. 5 వేల గౌరవ వేతనం పొందుతున్న సంగతి గుర్తు చేస్తున్న నాయకులు రాజీనామా చేస్తే ఏప్రిల్‌, మే నెలలకు గానూ రూ. 10 వేల చొప్పున రూ. 20 వేలు చెల్లిస్తామని ఆఫర్‌ ఇస్తున్నారు.జూన్‌లో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ఆ నెల నుంచీ వలంటీర్లుగా మళ్ళీ కొనసాగిస్తామని నచ్చజెబుతున్నారు. ఒత్తిళ్లు కావచ్చు లేదా మొహమాటం కావచ్చు అదీ కాకుంటే నగదు ఆఫర్లకు మెత్తబడి కావచ్చు కానీ మొత్తంమీద జిల్లాలో అత్యధికంగా వలంటీర్ల రాజీనామాలు చంద్రగిరి నియోజకవర్గంలోనే నమోదయ్యాయి. ఇక్కడ కేవలం సోమ, మంగళవారాల్లోనే వెయ్యి మందికి పైగా రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే అవి ఇంకా అధికారికంగా ప్రకటితం కాలేదు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముంది. చంద్రగిరిలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా కూడా వలంటీర్ల రాజీనామాల సంఖ్య గణనీయంగా పెరగనుంది.

Updated Date - Apr 18 , 2024 | 12:53 AM