Share News

వైసీపీ నిబంధనల ఉల్లంఘన

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:33 AM

చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి నామినేషన్‌ దాఖలు ప్రక్రియలో ఆ పార్టీ శ్రేణులు నిబంధనలు ఉల్లంఘించాయి. గురువారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు గంగినేని చెరువు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రెండుగంటల పాటు సాగిన ఈ ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్దకు చేరుకుంది. లోపలికి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని ఎన్నికల సంఘం నిబంధన ఉన్నా వైసీపీ శ్రేణులు పట్టించుకోలేదు.

 వైసీపీ నిబంధనల ఉల్లంఘన
గేటును తోసుకుంటూ లోనికి వెళుతున్న కారు

చిత్తూరు, ఏప్రిల్‌ 18: చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి నామినేషన్‌ దాఖలు ప్రక్రియలో ఆ పార్టీ శ్రేణులు నిబంధనలు ఉల్లంఘించాయి. గురువారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు గంగినేని చెరువు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రెండుగంటల పాటు సాగిన ఈ ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్దకు చేరుకుంది. లోపలికి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని ఎన్నికల సంఘం నిబంధన ఉన్నా వైసీపీ శ్రేణులు పట్టించుకోలేదు. విజయానందరెడ్డి, ఆయన సతీమణి, కుమారుడు కారులో వచ్చారు. గేటు వద్దనే కారు ఆపి వెళ్లాలని పోలీసులు చెప్పినప్పటికీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వినిపించుకోకుండా తోసుకుంటూ లోనికి తీసుకెళ్లారు. చేసేది లేక పోలీసులు మిన్నకుండిపోయారు. కాగా, విజయానందరెడ్డి నామినేషన్‌ దాఖలు సందర్భంగా చిత్తూరులోని వీధులన్నీ ట్రాఫిక్‌తో స్తంభించాయి. ఎంఎస్‌ఆర్‌ జంక్షన్‌ నుంచి వేలూరు వైపు వెళ్లే వాహనాలను అనుమతించలేదు. కలెక్టరేట్‌, గిరింపేట, రెడ్డిగుంట ప్రాంతాలకు వెళ్లే వారిని ఇరువారం బైపాస్‌ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించడంతో ఇబ్బందులు పడ్డారు. గంగినేని చెరువు, కొండమిట్ట, గిరింపేట, దుర్గమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడంతో పొగతో స్థానికులు ఇబ్బందిపడ్డారు.

Updated Date - Apr 19 , 2024 | 01:33 AM