Share News

వైసీపీ కోటకు వేమిరెడ్డి బీటలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 02:20 AM

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ నిట్టనిలువునా చీలనుంది.

వైసీపీ కోటకు వేమిరెడ్డి బీటలు

వీపీఆర్‌ వెంట టీడీపీలోకి భారీగా వలసలు

నెల్లూరు, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ నిట్టనిలువునా చీలనుంది. కుట్ర పూరిత రాజకీయాలను తట్టుకోలేక వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి(వీపీఆర్‌) భారీస్థాయిలో ఆ పార్టీ నాయకులను తనవెంట తీసుకెళుతున్నారు. మార్చి 2వ తేదీ ఉదయం 10.30 గంటలకు వీపీఆర్‌ కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో వీపీఆర్‌ దంపతులు టీడీపీలో చేరనున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే స్థాయి కలిగిన నాయకుల నుంచి డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల నాయకులు వందలాదిమంది టీడీపీలో చేరనున్నారు.వైసీపీకి వీపీఆర్‌ రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే వైసీపీలో అలజడి పెరిగింది. రోజూ వైసీపీకి చెందిన కీలక నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. నెల్లూరు సిటీ, రూరల్‌, సూళ్లూరుపేట, గూడూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి పలువురు కీలక నాయకులు మార్చి 2న టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ చేరికలతో టీడీపీ మరింత బలపడటంతోపాటు వైసీపీ కోటకు బీటలు వారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

7న గూడూరు,వెంకటగిరిల్లో లోకేష్‌ శంఖారావం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన ‘శంఖారావం’ సభలను మార్చి 7వ తేదీన మధ్యాహ్నం గూడూరు, సాయంత్రం వెంకటగిరి నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లోకేష్‌ పర్యటన ప్రారంభం కానుంది.

Updated Date - Mar 01 , 2024 | 02:20 AM