చెరువులో పడి ఇద్దరు విద్యార్థుల మృతి
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:03 AM
చెరువులో స్నానం కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడిన సంఘటన చిత్తూరు రూరల్ మండలం పచ్చనపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది

చిత్తూరు రూరల్, ఏప్రిల్ 2: చెరువులో స్నానం కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడిన సంఘటన చిత్తూరు రూరల్ మండలం పచ్చనపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పచ్చనపల్లి హరిజనవాడకు చెందిన కుప్పయ్య కుమారుడు ఆకాష్ 10వ తరగతి, త్యాగరాజులు కొడుకు సంతోష్ 9వ తరగతి, మరో పిల్లవాడితో కలిసి ఆవులు మేపేందుకు వెళ్లారు. ఎండకు తట్టుకోలేక స్నానం చేద్దామని ఆకాష్, సంతోష్ చెరువులో దిగి ఆడుకుంటుండగా, వారితో వచ్చిన పిల్లవాడు టాయిలెట్‌కు అని వెళ్లాడు. అతడు తిరిగి వచ్చే సరికి ఆ ఇద్దరు విద్యార్థులు కనపడలేదు. రాళ్లు వేసినా బయటకు రాలేదని ఆ చెరువులోనే చేపలు పట్టేందుకు వచ్చిన వ్యక్తికి ఆ పిల్లవాడు చెప్పాడు. దీంతో అతడు చెరువులోకి దూకి వెతుకుతుండగా సంతోష్ ప్రాణాలతో దొరికాడు. అతడికి ఫస్ట్ ఎయిడ్ చేసి చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ మృతి చెందాడు. ఎంత వెతికినా ఆకాష్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చి చెరువులో వెతికించగా, చెరువు లోపల బురదలో ఇరుక్కుపోయి కనపడ్డాడని గ్రామస్తులు తెలిపారు. అప్పటికే ఆకాష్ మృతి చెంది ఉన్నాడని తెలిపారు. ఇద్దరు విద్యార్థుల మృతితో పచ్చపనల్లి గ్రామంలో విషాదం నెలకొంది.