చిత్తూరును విద్యాకేంద్రంగా మారుస్తా
ABN , Publish Date - May 12 , 2024 | 02:27 AM
‘జిల్లా విభజన తర్వాత యూనివర్సిటీలన్నీ తిరుపతిలో ఉండిపోయాయి. జిల్లాలో ద్రవిడ వర్సిటీనే ఉంది. ఇక్కడ వర్సిటీనేకాదు ప్రతిష్ఠాత్మక కాలేజీలను నెలకొల్పి చిత్తూరును విద్యా కేంద్రంగా మారుస్తా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు నగరం మురకంబట్టు సర్కిల్ వద్ద శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ముగింపు సభలో ఆయన ప్రసంగించారు.

వర్సిటీయే కాదు.. ప్రతిష్టాత్మక కాలేజీలూ తెస్తా
అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నగరానికి నీళ్లు
ఇక్కడే చివరి మీటింగ్ పెట్టాలనుకుని వచ్చా
స్మగ్లర్లకు నేను భయపడాలా..?
ఎన్నికల ప్రచార ముగింపు సభలో చంద్రబాబు
కుప్పంలో కేజీ బంగారమిచ్చినా వైసీపీకి ఓటేయరు
నా కుప్పంలో ఎక్కడ చూసినా కేజీఎఫ్ తరహాలో క్వారీలను తవ్వేసి రూ.వేల కోట్లను దోచుకున్నారు. ఇన్నాళ్లు ఇదంతా నాకే తెలీదు. కుప్పంలో ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారంట. అక్కడి ప్రజలకు కేజీ బంగారమిచ్చినా వైసీపీకి ఓటేయరు.
జగన్ స్మగ్లర్‌కు సీటిచ్చాడు
చిత్తూరు వైసీపీ అభ్యర్థి ఎర్రచందనం స్మగ్లర్. అతడు జైల్లో ఉండాలి. జగన్ స్మగ్లర్లకు సీటిచ్చి జిల్లా మొత్తం దోచుకుందాం అనుకుంటున్నాడు. ఇక్కడ మా వాళ్లను బెదిరిస్తున్నాడంట. బెదిరిస్తే భయపడతామా. నేను అనుకుని ఉంటే ఎప్పుడో ఎక్కడికో పోయేవాడు. దోచుకున్న డబ్బుల్లో రూ.2 వేలు పంపిణీ చేసేందుకు జగన్, పెద్దిరెడ్డి, స్మగ్లర్ కుట్ర చేశారు.
చిత్తూరు, మే 11 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లా విభజన తర్వాత యూనివర్సిటీలన్నీ తిరుపతిలో ఉండిపోయాయి. జిల్లాలో ద్రవిడ వర్సిటీనే ఉంది. ఇక్కడ వర్సిటీనేకాదు ప్రతిష్ఠాత్మక కాలేజీలను నెలకొల్పి చిత్తూరును విద్యా కేంద్రంగా మారుస్తా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు నగరం మురకంబట్టు సర్కిల్ వద్ద శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..
చిత్తూరు సభతో కొండంత ధైర్యం వచ్చింది
నాకు జన్మనిచ్చిన జిల్లా.. రాజకీయ ఓనమాలు నేర్పించిన జిల్లా.. చిత్తూరు. సామాన్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎంగా ఇక్కడ పర్యటించాను. రాష్ట్రమంతటా తిరిగి చివరి మీటింగ్ చిత్తూరులో పెట్టాలనుకుని వచ్చా. చిత్తూరు సభలో పాల్గొన్నాక కొండంత ధైర్యం వచ్చింది. సభ అదరగొట్టింది. రాష్ట్రానికి ఊపునిచ్చింది. ఉమ్మడి జిల్లాలో 14 సీట్లనూ గెలిపించండి. చిత్తూరును అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనుంది. మీరంతా ఓటేయకుంటే నేనేమీ చేయలేను.
నేను ఉంటే ఇంకా ఎంతో చేసేవాడ్ని
తిరుపతిని ఎలక్ర్టానిక్ హబ్‌గా మార్చి అనేక పరిశ్రమలు తెచ్చాను. జాతీయ విద్యా సంస్థలూ నా హయాంలోనే వచ్చాయి. చిత్తూరులో అపోలో నాలెడ్జ్ సిటీ నేను పెట్టిందే. నేను ఉంటే అడవిపల్లె రిజర్వాయరు నుంచి చిత్తూరుకు నీళ్లు వచ్చేవి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేవాడ్ని. వైసీపీ వాళ్లు ఐదేళ్లలో ఓ తట్ట మట్టి ఎత్తలేదు. చుక్కనీరు రాలేదు. జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఎకరాకు నీళ్లిస్తా.
పెద్దిరెడ్డి నొక్కిందంతా కక్కిస్తా..
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్ని అక్రమంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. అడ్డుకునేందుకు వస్తున్న నన్ను తిరుపతి ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. నేను అనుకుని ఉంటే రోడ్డు మీదకి కూడా రాలేరు. ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. పదవులన్నీ ఆయనకే కావాలి. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, కాంట్రాక్టర్లు అన్నీ ఆయన కుటుంబానికే. వీళ్లు నొక్కిన డబ్బంతా కక్కిస్తా.
నేనెప్పుడైనా హత్యా రాజకీయాలు చేశానా?
బాబాయ్‌ని చంపేసి నారాసుర రక్తచరిత్ర అంటూ నింద నా మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ జిల్లా వాడిగా నా గురించి మీకు తెలుసు కదా. ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా హత్యా రాజకీయాలు చేశానా?
చిత్తూరు, పూతలపట్టుల్లో టీడీపీదే గెలుపు
‘చిత్తూరులో గెలుపు జగన్మోహన్‌దే. మన వాడు పోగలుగుతాడా అనుకున్నాను. కానీ అందర్నీ కూడగట్టుకుని కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైపోయాడు. కౌరవ వధ తప్పదు’ అని చంద్రబాబు గురజాల గురించి చెప్పినప్పుడు సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ‘మూడుసార్లు పూతలపట్టులో గెలవకపోయినా.. ఈసారి అక్కడ మురళీమోహన్ పక్కాగా గెలవబోతున్నారు. అలాగే, సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావు కూడా చిత్తూరు ఎంపీగా గెలవబోతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో జనసేన అభ్యర్థి. ఆయన తప్పకుండా గెలుస్తారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
స్థానిక నాయకులకు ప్రశంస
ఉత్సాహంగా, స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్‌ని గెలిపిస్తానని చెప్పిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అని చంద్రబాబు ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రజలు కేకలు పెడుతూ పెద్దఎత్తున స్పందించారు. ఇక్కడ టీడీపీకి పెద్ద దిక్కు, ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న సిన్సియర్ కార్యకర్త అంటూ మాజీ ఎమ్మెల్సీ దొరబాబును అభినందించారు. మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మాజీ మేయర్ హేమలత, చంద్రప్రకాష్, త్యాగరాజు, బాలాజీ, డీఏ శ్రీనివాస్, బద్రి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అరుణ తదితరులు కష్టపడుతున్నారన్నారు.
సీఆర్ రాజన్‌కు సముచిత స్థానం
‘టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీఆర్ రాజన్‌కు ఈసారి ఎమ్మెల్యే సీటివ్వాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాను. ఆయనకు సముచిత స్థానమిచ్చే బాధ్యత నాది’ అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ముందుగా గురజాల జగన్మోహన్, మురళీమోహన్, దగ్గుమళ్ల ప్రసాదరావు, సీఆర్ రాజన్‌తో చంద్రబాబు మాట్లాడించారు.
సభ సక్సెస్
ఎండను, వర్షాన్ని లెక్కచేయని జనం
చిత్తూరు సభ సక్సెస్ అయింది. చిత్తూరు టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. షెడ్యూల్ కంటే గంటన్నర ఆలస్యంగా 4:45 గంటలకు మురకంబట్టు సర్కిల్‌కు చంద్రబాబు చేరుకున్నారు. అంతవరకూ జనం ఎండలోనే వేచి చూశారు. ప్రసంగం చివర్లో వర్షం పడినా కదల్లేదు. టీడీపీ గెలిస్తే అమలు చేసే పథకాలు, అభివృద్ధి.. జగన్ మళ్లీ వస్తే జరిగే ప్రమాదం గురించి చంద్రబాబు వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఓ పాటను ప్రసంగం మధ్యలో ప్రజలకు వినిపించారు. దాని గురించి వివరించారు. చివర్లో ఈదురు గాలులు, వర్షం పడినా ప్రసంగం ఆపలేదు. ఐదు నిమిషాలు మాట్లాడారు. ‘వర్షం పడుతోంది శుభారంభం. వరుణ దేవుడు దీవిస్తున్నాడు’ అని చెప్పారు.