Share News

కల్లోల కడలి

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:29 AM

మూడు రోజులుగా ఆగిన వేట

కల్లోల కడలి
కోట మండలం గోవిందపల్లిపాళెం వద్ద కల్లోల భరితంగా ఉన్న సముద్రం

కోట, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాయుగుండం బలపడి తుపాన్‌గా మారుతుండటంతో కోట మండలంలోని శ్రీనివాససత్రం, గోవిందపల్లిపాళెం గ్రామాల సమీపంలోని సముద్రం కల్లోలంగా మారింది. అలల ఉధ్రుతి పెరిగింది. బుధవారం ఉదయం నుంచి పలుచోట్ల తేలికపాటి జల్లులు పడగా, చలి పెరిగింది. మూడు రోజులుగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకపోవడంతో జీవనోపాధి కోల్పోయారు. మరోవైపు సముద్రంలో బోట్‌ ఇంజన్‌ నిలిచిపోయి మంగళవారం సాయంత్రం మత్స్యకారులు చిక్కుకున్నారన్న సమాచారంతో ఇక్కడి మత్స్యకార గ్రామాలు ఆందోళన పడ్డాయి. స్థానికులు ఉన్నారా అని ఆరా తీశాయి. గూడూరు సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు కోట తహసీల్దారు జయజయరావు మంగళవారం అర్ధరాత్రి నుంచి అప్రమత్తమయ్యారు. చివరకు వాళ్లు నెల్లూరు జిల్లాకు చెందిన వారని, బుధవారం ఉదయం వాళ్లను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసుశాఖ అప్రమత్తం

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యుత్‌ పరికరాల వద్ద ఉండరాదని, చెట్ల కింద నిలబడకూడదని, కాలువలు, కల్వర్టుల వద్దకు వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112 లేదా పోలీసు వాట్సాప్‌ నెంబరు 80999 99977 నెంబర్లకు ఫోను చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Updated Date - Nov 28 , 2024 | 12:29 AM