మూడు కుటుంబాల్లో విషాదం
ABN , Publish Date - Mar 03 , 2024 | 01:20 AM
పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (డెయిరీ సైన్స్) చదువుతున్న విద్యార్థుల్లో ఓ 18 మంది విహార యాత్ర కోసం శుక్రవారం రాత్రి చెన్నై సమీపంలోని మహాబలిపురానికి వెళ్లారు.
- సముద్ర స్నానానికెళ్లిన ముగ్గురు విద్యార్థుల గల్లంతు
- ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒకరి మృతదేహం
పలమనేరు, మార్చి 2: పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (డెయిరీ సైన్స్) చదువుతున్న విద్యార్థుల్లో ఓ 18 మంది విహార యాత్ర కోసం శుక్రవారం రాత్రి చెన్నై సమీపంలోని మహాబలిపురానికి వెళ్లారు. శనివారం ఉదయం పర్యాటక ప్రదేశాలను చూస్తూ సరదాగా గడిపారు. తర్వాత అక్కడున్న బీచ్‌లోకి సంతోషంగా దిగారు. వీరిలో మౌనిష్ (19), విజయ్ కుమార్(19), ప్రభు (18) గల్లంతయ్యారు. విజయ్‌కుమార్ మృతదేహం మాత్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఈ దుర్ఘటన... మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.
మూడు నెలల్లో బిడ్డల చదువు పూర్తవుతుంది
- విజయ్‌కుమార్, మౌనిష్ తల్లిదండ్రులు
బంగారుపాళ్యం, మార్చి 2: విజయ్‌కుమార్, మౌని్‌షలది బంగారుపాళ్యం మండలంలోని నలగాంపల్లె పంచాయతీ కేసీ కండ్రిగ గ్రామం. విజయ్‌కుమార్ తల్లిదండ్రులు లత, తులసీరామ్. మౌనిష్ తల్లిదండ్రులు రామాంజలి, చంద్రబాబు. వీరికి విషయం తెలియడంతో బోరున విలపిస్తున్నారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మూడు నెలల్లో తమ బిడ్డల చదువు పూర్తవుతుందని, ఈ సమయంలో ఇలా జరిగిందని తల్లిదండ్రులు వాపోయారు.
మనవడి కోసం..
సదుం, మార్చి 2: ప్రభు.. సదుం మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ పెడకంటివారిపల్లెకు చెందిన శివరాణి కుమారుడు. పులిచెర్ల మండలానికి చెందిన శ్రీనివా్‌సతో శివరాణికి వివాహమైంది. భర్త చనిపోవడంతో పదేళ్లుగా పుట్టింట్లోనే కుమార్తె, కుమారుడితో శివరాణి ఉంటున్నారు. విషయం తెలియడంతో ప్రభు అమ్మమ్మ సిద్ధమ్మను ఓదార్చడం ఎవ్వరి తరమూ కావడం లేదు. పల్లెలోనూ విషాదఛాయలు నెలకొంది.